పవన్ కల్యాణ్ పని అయిపోయినట్టేనా..?

ఏపీలో పవన్ కి ఎగ్జిట్ పోల్స్ సున్నా చుట్టేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీ వైపు వెళ్లకుండా జనసేన వైపు డైవర్ట్ చేయడం కోసం చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని మరీ సొంత పార్టీ నేతలకు రాజకీయ సమాధి కట్టిన పవన్ కల్యాణ్ ను ఎగ్జిట్ పోల్స్ లెక్కలోకి కూడా తీసుకోలేదు. 

ఎవరూ ఊహించని ఫలితాలొస్తాయనుకుంటే.. అసలు తామే ఊహించని ఫలితాలొస్తాయేమోనని మథనపడుతున్నారు జనసైనికులు. ఊహించని ఫలితాలు, నిశ్శబ్ద విప్లవం.. అంటూ ఊదరగొట్టిన జనసైనికులకు ఇప్పుడు మాట్లాడే అవకాశం పూర్తిగా పోయింది. రెండు రోజుల నుంచీ రెండంకెల సీట్లొస్తాయని చెప్పుకున్నోళ్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పూర్తిగా ఖంగుతిన్నారు. 

గరిష్టంగా 5 కనిష్టంగా 0 స్థానాలు జనసేనకు కట్టబెట్టాయి సర్వే సంస్థలు. ఈ విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేశాయి. ఎంపీ సీట్ల విషయానికొస్తే లగడపాటి రాజగోపాల్ మొహమాటానికి ఒకటి వేశారు కానీ, మిగతా సర్వేలన్నీ జనసేనకు సున్నా చుట్టేశాయి. అంటే రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయానికి అవకాశమే లేదన్న విషయం స్పష్టమైంది. 

గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ సాధించిన సీట్లు కూడా ఈసారి ప్రభుత్వ వ్యతిరేక గాలిలో జనసేన సాధించలేకపోతోంది అంటే టీడీపీ-జనసేన డబుల్ గేమ్ సామాన్యులకు కూడా క్లియర్ గా అర్థమైందని తెలుస్తోంది. మరీ సున్నా నుంచి 5 స్థానాలు మాత్రమే అని తేల్చేయడంతో ఎటూ పాలుపోని పరిస్థితి. కనీసం ఒక్క స్థానం కూడా జనసేన గ్యారెంటీగా గెలుస్తుందని ఏ ఒక్క సర్వే కూడా చెప్పలేదు. అంటే పవన్ పోటీ చేసిన 2 స్థానాలపై కూడా గ్యారెంటీ లేదని అర్థం.. 

కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే జనసేనకు పడింది అనుకుంటే.. అక్కడ వైసీపీకి మెజార్టీ క్లియర్ గా వచ్చేసింది. టీడీపీ స్కోర్ 60 మించట్లేదు. అంటే పవన్ కల్యాణ్ పాచిక పారలేదని అర్థమవుతోంది. బాబు-పవన్  డైవర్షన్ గేమ్ ని ప్రజలు పూర్తిస్థాయిలో తిప్పికొట్టారని దీన్ని బట్టి అర్థం అవుతోంది.

తెలుగు హీరోల మంచితనం.. సినిమాల వరకేనా!

ఎమ్బీయస్‌: బెదురు బాబు

Show comments