పవన్ కల్యాణ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్!

మూడు ఆప్షన్లు అనేసరికి ఎవరూ ముందుకు రాకపోవడంతో జనసేన ఇప్పుడు ఒంటరి పోరంటూ కొత్త పల్లవి అందుకుంది, జనంతోనే పొత్తు అని పవన్ ప్రకటించారు, జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ కొత్తగా మాట్లాడుతున్నారు. దీనిపై నాగబాబు కూడా ట్వీట్లు వేస్తున్నారు. 

"జనసేనకు ఒక్క ఛాన్స్.." ఇదీ వారి కొత్త నినాదం. అంటే దీనర్థం, పొత్తులకు రాకపోతే ఒంటరిగా పోటీ చేస్తానంటూ పవన్ కల్యాణ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి దిగినట్టు కనిపిస్తోంది.

ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా..?

జనసేన ఒంటరిగా పోటీ చేస్తే లాభమా, నష్టమా అనే సంగతి పక్కనపెడితే అసలు పవన్ కల్యాణ్ కి ఆ స్థాయి ధైర్యం లేదనేది మాత్రం వాస్తవం. సీఎం కావాలనే కోరిక ఉన్నా పవన్ కల్యాణ్ కి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలనే కోరిక బలంగా ఉంది. ఎవరి సపోర్ట్ లేకుండా తాను సీఎం కాలేననే భయమూ ఉంది. 

Readmore!

అందుకే మీరు ప్రకటించండి, మీరే ప్రకటించండి అని ఇన్నాళ్లూ బతిమిలాడుకున్నారు. ఎవరూ నోరు మెదపకపోయే సరికి ఇప్పుడిలా బ్లాక్ మెయిల్ మొదలు పెట్టారు.

మహానాడుతో టీడీపీలో కాస్త జోష్ వచ్చిందని ఆ పార్టీ నాయకులు ఊహాలోకంలో తేలిపోతున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తావనే లేకుండా ఆత్మకూరులో ప్రచారం చేసుకున్నాం కదా అని బీజేపీలో కూడా ధీమా పెరిగింది. ఈ దశలో పవన్ ని ఎవరూ కేర్ చేయడంలేదు. 

కనీసం ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం పవన్ ని పిలవలేదు బీజేపీ. దీంతో తన ఉనికి నామమాత్రమేనని తేలిపోవడంతో ఇప్పుడు బెట్టు చేస్తున్నారు. తాను ఒక్కడినే పోటీ చేస్తా, నాకూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజల్ని వేడుకుంటున్నారు.

టీడీపీ, బీజేపీ భయపడిపోతాయా..?

ప్రస్తుతానికి ఏపీలో వైసీపీని సింగిల్ గా ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి లేదు. పోనీ జనసేన, టీడీపీ, బీజేపీ కలసి వచ్చినా పోటీ ఇచ్చేంత సీన్ కూడా లేదు. ఈ దశలో పొత్తుకు పోయి లేనిపోని తిప్పలెందుకు అని భావిస్తున్నారు నేతలు. టికెట్ల విషయంలో కచ్చితంగా గొడవలు జరుగుతాయి. రెబల్స్ వల్ల ఆ కాస్త అవకాశాలు కూడా పోతాయి. అందుకే టీడీపీ దీర్ఘాలోచనలో పడింది.

అటు బీజేపీ ఏపీ శాఖకు అధిష్టానం తలంటుతోంది. తెలంగాణలో బలపడ్డాం కదా, ఏపీలో మీకేం నొప్పి అంటూ నిలదీస్తోంది. దీంతో బీజేపీ ఏపీ శాఖ కూడా సొంతకుంపటి పెట్టుకునే ఆలోచనలో ఉంది. ఈ దశలో పవన్ తన ఉనికి చాటుకోడానికి ప్రయత్నిస్తున్నారు. 

ముందుగానే బెట్టు చేస్తున్నారు, ఒంటరి పోరు అంటూ బీజేపీ, టీడీపీపై ఒత్తిడి చేస్తున్నారు. మరి ఈ బ్లాక్ మెయిల్ కి ఆ రెండు పార్టీలు భయపడతాయా.. లేకపోతే పవన్ ని మరింత లైట్ తీసుకుంటాయా అనేది వేచి చూడాలి. 

Show comments