రఘురామ-పవన్ : పరస్పరం గతిలేక..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు రాజకీయ జీవితంలో.. తర్వాతి మజిలీ ఏమిటో తేలిపోయింది. ఆయన పవన్ కల్యాణ్ పంచన చేరి.. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్ బొమ్మ పెట్టుకుని ఆయన ఇచ్చిన టికెట్ తో ఎంపీగా గెలిచిన రఘురాజు.. గెలిచిన తర్వాత.. పార్టీతో వైరం పెంచుకుని.. ప్రభుత్వం మీద నానా అవాకులు చెవాకులూ పేలుతూ చెలరేగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ ఆయనను దాదాపుగా తమ పార్టీనుంచి బహిష్కృత నేతగానే పరిగణిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన తర్వాతి రాజకీయ జీవితం ఏమిటనే ప్రశ్న అందరికీ కలుగుతోంది. ఇప్పటిదాకా రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ.. తాజాగా.. రఘురాజు తర్వాతి రాజకీయ మజిలీ జనసేన అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహించిన జనసేనాని పవన్ కల్యాణ్ మాటల్లో ఈ మేరకు క్లారిటీ దొరికింది. రఘురామ రాజును వైసీపీ వేధిస్తున్నదంటూ.. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో చాలా భాగం ఆవేదనను ఆయనకోసం కేటాయించారు. నియోజకవర్గం ఎంపీ తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా చేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాల్గొన్న అల్లూరి విగ్రహావిష్కరణ సభకు బిజెపి వారి భాగస్వామ్య పార్టీ అని చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పిలవనేలేదని ప్రజలు అనుకున్నారు. ‘నన్ను పిలిచారు.. నేనే వెళ్లలేదు’ అని పవన్ కల్యాణ్ చెప్పుకోవాల్సి వస్తోంది. అయితే ఎందుకు వెళ్లలేదంటే ఆయన చెబుతున్న కారణం మాత్రం చిత్రమైనది. అక్కడి ఎంపీ రఘురాజును పిలవలేదు గనుక.. అందుకోసం అలిగి పవన్ కల్యాణ్ కూడా వెళ్లలేదట. ఇదేం చిత్రమైన బంధమో అనుకోనక్కర్లేదు. భవిష్యత్ చేరికలకు అది సంకేతం అని భావించాలి. 

పవన్ కల్యాణ్ తో రఘురాజుకు సుదీర్ఘకాల సుదృఢ అనుబంధం ఉందని అందరికీ తెలుసు. పవన్ కల్యాణ్ ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో భేటీ అయ్యే.. అనేక సందర్భాల్లో రఘురాజు ప్రెవేటు గెస్ట్ హౌస్ లోనే బస చేస్తారనేది, తన పర్యటన గోప్యతను కాపాడుకుంటారనేది కొద్దిమందికే తెలిసిన సంగతి. తీరా ఇప్పుడు రఘురాజు మీద ప్రేమను ఆయన వెళ్లగక్కారు. 

తనను ఎంపీగా గెలిపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సున్నం పెట్టుకున్న నాటినుంచి.. రఘురాజు.. ఏ పార్టీలో చేరాలా అని తహతహ లాడుతున్నారు. బిజెపిలో చేరనున్నట్టు చాలా ప్రచారం జరిగింది. కానీ.. ఏపీలో బిజెపి పార్టీకే దిక్కులేని పరిస్థితిలో.. తనకంటూ సొంత ఓట్ల బలం కూడా లేని రఘురాజు.. వారితో చేరి సాధించేదేమీ ఉండదు. ఈ నేపథ్యంలో ఆయన తన లాస్ట్ రిసార్ట్ లాగా జనసేనను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. తన ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉండే కుల ఓట్లను నమ్ముకుని.. ఆయన జనసేన ప్రాపకం పొందుతున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. 

రఘురాజు జనసేనలో చేరిక ఇంకా అధికారికంగా తేలకపోయినా.. రఘురాజు భజనలో పవన్ కల్యాణ్ తరించడానికి చేస్తున్న ప్రయత్నం గమనిస్తే.. ఎవ్వరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. వైసీపీ అందించిన ఎంపీ పదవి వైభోగాన్ని, ప్రోటోకాల్ మర్యాదలను అనుభవిస్తున్న రఘురాజు.. టర్మ్ ముగిసి ఎన్నికలు వచ్చే నాటికి జనసేన పార్టీలో చేరడం.. మళ్లీ ఎంపీగా పోటీచేయడం గ్యారంటీ అని పలువురు విశ్లేషిస్తున్నారు.  

రఘురామకు వేరే పార్టీ గతిలేదు. పవన్ కల్యాణ్ కు తన పార్టీకి సంబంధించి వేరే నాయకులకూ గతిలేదు. ఇరువురికీ పరస్పరం గతిలేక ఒక్కటవుతున్నారని అందరూ అనుకుంటున్నారు.

Show comments