ప్రత్యేక హోదా తేగలిగితే పవన్ మొనగాడే!

ప్రత్యేకహోదాకు ఇప్పటిదాకా కట్టుబడి ఉన్నదని తానొక్కడిని మాత్రమే అని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. పైగా మోడీ, అమిత్ షా అనే వాళ్లు తనకు చాలా చాలా క్లోజ్ అనే బిల్డప్ ఇవ్వడానికి కూడా యత్నిస్తుంటారు.

అలాంటి పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి, చిన్న గ్యాప్ తర్వాత.. విజయవాడలో వరుస ప్రెస్‌మీట్‌లతో జగన్ సర్కారు మీద ఊపిరాడనివ్వని దాడులు కొనసాగించి.. తీరా ఎంచక్కా ఢిల్లీ వెళ్లారు. ఇలాంటి నేపథ్యంలో... ఆయన ఢిల్లీలో ఏం చక్రం తిప్పబోతున్నారు? అనే అంశంపై విపరీతంగా చర్చ జరుగుతోంది.

పవన్ ఢిల్లీ యాత్రపై ప్రధానంగా రెండు అంశాలపై అందరిలో చర్చ నడుస్తోంది. ఒకటి- ఆయన ఢిల్లీ పాలకులకు జగన్ మీద బోలెడన్ని పితూరీలు చెప్పే అవకాశం ఉంది. రెండు- రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలి. ఈ రెండు అంశాల్లో ఆయన దేనికి ప్రాధాన్యం ఇస్తారు? కేవలం పితూరీల పవన్ గానే మిగిలిపోతారా? లేదా, రాష్ట్రంకోసం పాటుపడే.. ప్రత్యేకహోదా సాధించే, దానికోసం పోరాడే పవన్‌గా కీర్తి గడిస్తారా? అనేది మాత్రం వేచిచూడాలి.

కేవలం జగన్మోహనరెడ్డి మీద పితూరీలు చెప్పడం ద్వారా కేంద్రానికి దగ్గరవ్వాలని పవన్ భావిస్తే గనుక.. పప్పులో కాలేసినట్టే. ఎటూ రాష్ట్రంలోని భాజపా నాయకులు జగన్ ను విమర్శిస్తున్నారు గనుక.. తాను ఢిల్లీ వెళ్లి.. మరిన్ని పితూరీలు జగన్ మీద చెబితే.. మైలేజీ వస్తుందని ఆయనకు అనిపించవచ్చు.

ఇసుక సమస్య గురించి పవన్ కళ్లలోంచి చూసి తెలుసుకోవాల్సిన అగత్యం కేంద్రానికి లేదు. వారికి ప్రాక్టికల్‌గా ఉండే ఇబ్బందులు తెలుసు.. పైగా.. సమస్య తీరిపోయాక పవన్ ఢిల్లీ వెళుతున్నారు.

తెలుగుభాష గురించి కంప్లయింటు చేయడానికి అవకాశం ఉంది. అసలే దేశం మొత్తం హిందీ రుద్దాలని చూస్తున్న జంట మోడీ-షా! వారు తెలుగు మీడియంను తొలగించడాన్ని ఎంత, ఎందుకు సీరియస్‌గా తీసుకుంటారో ఇప్పుడే ఊహించలేం.

ఇవి కాకుండా... ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించి.. కేవలం ప్రెస్‌నోట్, లేదా, మీడియా మీట్ లో చెప్పడం కాకుండా, కేంద్రంలోని పెద్దలద్వారా కూడా పవన్ ప్రత్యేకహోదా గురించి అడిగినట్లుగా చెప్పించి.. లేదా కనీసం ట్వీట్ చేయించి.. దాన్ని సాధించే దిశగా చిన్నఅడుగైనా వేస్తే.. పవన్ మొనగాడు లెక్క!

Show comments