హేట్ లవ్ స్టోరీ: బాబుకు ప్రేమతో పవన్!

పవన్ కల్యాణ్ ముసుగు తొలిగిపోయింది. ఇన్నాళ్లూ ఆడిన నాటకం సంక్రాంతి సందర్భంగా బట్టబయలైంది. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, పొలిటికల్ స్క్రీన్ మీద కూడా అద్భుతంగా నటించగలనని నిరూపంచిన జనసేనాని, ఎట్టకేలకు తన మనసులో మాట బైటపెట్టారు. మొన్నటి వరకూ పెదబాబునీ, చినబాబునీ నోటికొచ్చినట్టు తిట్టి ఇప్పుడు వత్తాసు పలుకుతున్నారు.

సంక్రాంతి సంబరాల కోసం తెనాలి వెళ్లిన పవన్.. బహిరంగ సభలో బహిరంగంగానే బాబుపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. చంద్రబాబు మీద జగన్, కేసీఆర్ కలసి కక్షసాధిస్తున్నారని సింపతీ చూపించారు. బాబుపై కక్షపెంచుకుని రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నారంటూ మండిపడ్డారు.

రాజకీయ కక్షలకు రుణ మాఫీలుండవు. వడ్డీతో సహా తిరిగి చెల్లించుకోవాల్సిందే. ఇప్పటికే తెలంగాణలో ఆ బాకీని చంద్రబాబుకి తిరిగి చెల్లించేశారు కేసీఆర్. ఇక ఏపీలో జగన్ బకాయిపడ్డారు. ఈ ఎన్నికలతో అది కూడా తీరిపోతుంది. బాబుగారికి ఇబ్బంది కలిగితే ఓర్చుకోలేకపోతున్నారేమో ఇలా ముందుగానే కక్షసాధింపు అంటూ పెద్ద పెద్ద మాటలు వాడేస్తున్నారు పవన్ కల్యాణ్.

2014లో చంద్రబాబు తనకి పదవి ఇచ్చేవాడని, కానీ తానే తీసుకోలేదని కూడా సెలవిచ్చారు జనసేనాని. అదేమంటే ప్రజల కోసమే తీసుకోలేదంట. మరి అదే ప్రజల కోసం ఇప్పుడు పదవి కావాలంటున్నారు కదా? అది కూడా సీఎం పదవి. మరి దీన్నేమనాలి.

మొత్తానికి సంక్రాంతి పండగ హుషారులో పవన్ కల్యాణ్ చంద్రబాబుతో తనకున్న లాలూచీపై నోరు జారారు. బాబుపై అంత ప్రేమే ఉంటే బైటపడొచ్చుకదా? జనాల చెవుల్లో పూలు పెట్టడానికి 175 స్థానాల్లో ఒంటరిగా పోటీచేస్తా, నేను ఎవ్వరితో కలవను అంటూ బిల్డప్ ఎందుకు?

ఎన్నికల దాకా బెట్టుచేసి, చివర్లో రాష్ట్ర భవిష్యత్ కోసం ఇంకోసారి కలవక తప్పలేదని పవన్ స్టేట్ మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చంద్రబాబుతో పవన్ కి ఉన్న చీకటి ఒప్పందానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

Show comments