ఇప్పుడు అనంతపురం గుర్తురాలేదా పవన్?

రాయలసీమ నుంచే నేను పోటీచేస్తా
ఓడిపోవడానికి సిద్ధపడి మరీ అనంతపురం జిల్లా నుంచి పోటీ

గతేడాది పోరాటయాత్ర పేరిట రోడ్ షోలు నిర్వహించారు పవన్. రాయలసీమ నుంచే ఆ పోరాట యాత్ర ప్రారంభించారు. ఆ టైమ్ లోనే పవన్ చేసిన రెండు ప్రకటనలు ఇవి. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేనాటికి పవన్ ఆ రెండు స్టేట్ మెంట్స్ ను మరిచిపోయారు.

రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ ఊదరగొట్టిన జనసేనాని, ఎన్నికల వేళ తానిచ్చిన హామీని తనే మరిచిపోయారు. తన సామాజికవర్గం ఎక్కడుందో వెదుక్కొని మరీ అక్కడకు వెళ్లిపోయారు. ఇలా ఏదో మాట్లాడ్డం, ఆనక మరిచిపోవడం పవన్ కు కొత్తేంకాదు. గతంలో ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా ప్రతిచోట ఉద్దానం సమస్య గురించి మాట్లాడిన పవన్, తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారు.

ఇక్కడే మరో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. సరికొత్త రాజకీయ ఒరవడి సృష్టిస్తానని చెప్పే పవన్, ఇలా ఒకేసారి రెండు నియోజకవర్గాల్ని ఎన్నుకోవడం ఏంటో అర్థంకావడం లేదు. రెండుచోట్ల పోటీచేస్తే ప్రజాధనం వృధా కాదా. భవిష్యత్తులో అదృష్టం కలిసొచ్చి పవన్ 2 స్థానాల్లో నెగ్గితే, ఏదో ఒక స్థానంలో ఉపఎన్నిక అనివార్యం కాదా? మళ్లీ ప్రభుత్వ ధనం, యంత్రాంగానికి అదనపు సమయం వృధా కదా? ఈ విషయాల్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం లేదు.

గతంలో స్వయంగా పవన్ చెప్పిన మాటలివి. ఇప్పుడు వాటిని కూడా మరిచిపోయారు. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలనేది పవన్ కోరిక. తన పార్టీ సంగతి పక్కనపెడితే, తనుమాత్రం కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలని భావిస్తున్నారు. ఇంకాస్త ముందుకెళ్లి కర్నాటక తరహాలో హంగ్ వస్తే, తను చక్రం తిప్పొచ్చని కూడా భావించారు.

కానీ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే పవన్ ఇలా ఎందుకైనా మంచిదని 2 స్థానాల్లో పోటీకి దిగారు. అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎగబడుతున్నారని, లెక్కలేనన్ని అప్లికేషన్లు వచ్చాయని చెబుతున్న జనసేనాని, రెండు స్థానాల్లో పోటీచేయడం ఎందుకు? తను బరిలోకి దిగబోతున్న రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని వేరే అభ్యర్థికి ఇవ్వొచ్చు కదా? సరికొత్త రాజకీయాలు చేస్తానంటూ ఇలా రెండు స్థానాల్లో పోటీకి దిగడం ఏంటో?

గతంలో చిరంజీవి కూడా ఇలానే చేశారు. ప్రజారాజ్యం స్థాపించి 2 స్థానాల్లో పోటీచేశారు. ఒక స్థానంలో ఓడిపోయి, మరోస్థానంలో గెలిచారు. ఆ తర్వాత తన పార్టీని తీసుకెళ్లి నేరుగా కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు పవన్ కూడా అన్నయ్య బాటలోనే నడుస్తున్నారు. ప్రస్తుతానికైతే చిరంజీవిలా రెండు స్థానాల్లో పోటీకి దిగుతున్నారు. నెక్ట్స్ ఏం చేయబోతున్నారో చూడాలి!

పరిటాల కుటుంబం గెలిస్తే.. వీళ్లంతా పారిపోవాల్సిందే

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments