పవన్! వారి కన్నీళ్లు ఎలా తుడుస్తారు?

పవన్ సక్సెస్ గురించి ఒక్క మాటైనా మాట్లాడుకోవడానికి చాలాకాలంగా మొహం వాచిపోయి ఉన్న ఆయన అభిమానులకు ‘వకీల్ సాబ్’ ఒక శుభవార్త. ఫ్యాన్స్‌కి - పాజిటివ్‌గా మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ దొరికింది.. సినిమాకు మంచి టాక్ వస్తున్నప్పటికీ.. ఈ సినిమా మీద పలువురు భారీగానే నష్టపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ప్రభుత్వం ప్రీమియర్ షోలకు, టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలేదు గనుక.. ఒక్క కృష్ణా జిల్లాలోనే రెండుకోట్ల రూపాయల నష్టం తొలిరోజు వాటిల్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ నష్టం వారికి ఎవరు పూడుస్తారు? తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్ని సందర్భాల్లో చేసినట్టుగా.. పవన్ కల్యాణ్ కూడా తన రెమ్యునరేషన్ లోంచి- తన కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తారా? అనేది ప్రశ్న.

హీరోల రెమ్యునరేషన్లు ఒక స్థాయిలో అదుపులో ఉన్నంత వరకు ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా నష్టం రాదు. సాధారణంగా 10-20 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా పేరున్న పవన్ కల్యాణ్.. వకీల్ సాబ్ చిత్రానికి 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

కొవిడ్ వాతావరణంలో థియేటర్లకు రావడానికి జనం భయపడుతున్న పరిస్థితుల్లో అంతేసి మొత్తాలు ఖర్చు పెట్టి.. ఇలా రాబట్టుకోలమని రూపకర్తలు ప్లాన్ చేశారో మనకు తెలియదు. అయితే రిలీజ్ సమయానికి కొవిడ్ మళ్లీ బీభత్స రూపం దాల్చడంతో ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతివ్వలేదు. 

ప్రీమియర్ షోల ముసుగులో అడ్డగోలుగా ఫ్యాన్స్ ను దోచేసుకుని.. డబ్బు సంపాదించుకోవడం ఒక టార్గెట్ గా సినిమా వ్యూహాలు పనిచేస్తాయి. పవన్ సినిమా అంటే.. ప్రాడక్ట్ ఎలా ఉన్నప్పటికీ.. ప్రీమియం షోలతో టికెట్ ధరల పెంపుతో దోచుకునే చాన్స్ పుష్కలంగా ఉంటుంది గనుకనే.. నిర్మాతలు అంత పెద్ద రెమ్యునరేషన్లు ఇవ్వడానికి ఎగబడతారు. 

కానీ.. ఇక్కడ సీన్ మారింది. కొవిడ్ పుణ్యమాని ప్రీమియర్ షోలు మంటగలిసిపోయాయి. టికెట్ ధరలు పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతించలేదు. ఇలాంటి చాటుమాటు బాదుడుకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇదంతా పవన్ కల్యాణ్ మీద కక్షతో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరులాగా ఒక ప్రచారం జరిగింది. 

ఇలాంటి దోపిడీ అనుమతులు లేకపోవడం వలన.. ఒక్క కృష్ణా జిల్లాలో తొలిరోజున బయ్యర్లు రెండు కోట్లు నష్టపోయినట్టుగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కానీ.. ఈ వార్తను అర్థం చేసుకోవాల్సింది ఇలా కాదు. తొలిరోజు 2 కోట్లు దోచుకోడానికి ఎగ్జిబిటర్లు ప్లాన్ చేశారన్న మాట. ఈ దామాషాలో... ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిరోజు నాటికే.. 23 జిల్లాలకు కలిపి ఇంచుమించుగా యాభై కోట్ల దోపిడీకి కుట్ర జరిగి ఉంటుందని అర్థం చేసుకోవాలి. 

ఏదైతేనేం.. టికెట్లు ధరల పెంచి దోచుకోవడం ద్వారా.. ప్రీమియర్ షోల రూపంలో దోచుకోవడం ద్వారా.. అదనపు డబ్బులు వస్తాయని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పలేదు. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా వల్ల వారంతా దారుణంగా నష్టపోయినట్టే లెక్క. 

మరి.. వార్తల్లో వస్తున్నట్టుగా ఒక నిమిషం స్క్రీన్ అప్పియరెన్స్‌కు ఒక కోటి రూపాయల వంతున.. ఈ సినిమాకు యాభై కోట్ల అనూహ్యమైన రెమ్యునరేషన్ తీసుకున్న పవన్ కల్యాణ్ నష్టపోయిన వారి కన్నీళ్లు ఎలా తుడుస్తారు? ప్రజలకోసమే జీవిస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చే పవన్ కల్యాణ్.. తన వల్ల నష్టపోయిన వారిని ఎలా ఆదుకుంటారు? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.

Show comments