కేసీఆర్ నెత్తిన పవన్ పాలు పోసినట్టే!

తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి కనీస వ్యవస్థాగత నిర్మాణం కూడా లేకపోయినప్పటికీ.. తమతో పొత్తులు పెట్టుకోవడానికి సీపీఎం వెంపర్లాడుతుండడం చూసి.. పవన్ కల్యాణ్ కు బహుశా ఆశ్చర్యం కలిగి ఉంటుంది. అందుకే, తమ బలం ఎంతున్నదనే సంగతి విస్మరించి.. కనీసం సీపీఎం వారి ముచ్చట తీర్చడానికైనా పవన్ కల్యాణ్ వారితో జట్టుకట్టి.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కు సారథ్యం వహిస్తూ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటికే రెండు దఫాలుగా జనసేన పొలిటికల్ ఎపైర్స్ కమిటీతో చర్చించారు. పవన్ వస్తే కూటమికి చాలా బలం వస్తుందని.. ఆయన వారికి ప్రతిపాదించారు. అయితే సహజంగానే ఆ కమిటీ సభ్యులు తుదినిర్ణయం చెప్పలేదు. తమ పార్టీ  ‘ప్యాక్’ ద్వారా పవన్ కల్యాణ్ ప్రతిపాదనకు సంబంధించి వివరాలన్నీ తెలుసుకున్నారు. తుది నిర్ణయం తీసుకోవడానికి తాను స్వయంగా సీపీఎం వారితో చర్చించడానికి కూడా నిర్ణయించుకున్నారు. ఆయన అనుమతించిన అపాయింట్ మెంట్ మేరకు మంగళ లేదా బుధవారాలలో సీపీఎం తమ్మినేని వీరభద్రంతో పవన్ కల్యాణ్ భేటీ జరుగుతుంది. ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి... ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలే ఎక్కువ.

ఆ నమ్మకం ఉన్నది గనుకనే... కాంగ్రెస్/సీపీఐ/తెదేపా తరఫునుంచి పొత్తు ప్రతిపాదనలు వస్తే తమ్మినేని ఇదివరకే నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. పవన్ ఒప్పుకోకపోతే బహుశా వారు ఆ కూటమిలో చేరుతారు. అంతిమంగా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల బరి త్రిముఖ పోటీకి వేదికగా నిలిచేలా కనిపిస్తోంది.

అంతిమంగా ఇదే జరిగితే గనుక.. త్రిముఖ పోటీ ఏర్పడడానికి మూల కారకుడిగా నిలిచే పవన్ కల్యాణ్.. కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్లే.. ఆయనకు ఎంతో ఉపకారం చేసినట్లే అని పలువురు భావిస్తున్నారు. పాలనలో చాలా దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్ కు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ‘ప్రభువ వ్యతిరేక ఓటు’ దెబ్బ తప్పక  ఉంటుందనేది పలువురి అంచనా. ఇప్పుడు త్రిముఖ పోటీ కారణంగా.. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండు గా చీలుతుంది. పవన్ బరిలో ఉంటే.. ఆ చీలక ఎక్కువగా కూడా ఉంటుంది. దాంతో తెరాస-కేసీఆర్ విజయం నల్లేరుపై బండినడకలా మారుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి పవన్ నిర్ణయం బుధవారం నాటికి ఎలా పరిణమిస్తుందో చూడాలి.

RELATED తప్పదు.. హరీష్‌రావుకి వేరే ఛాన్స్‌ లేదు.!