వైష‌మ్యాలు పండిస్తున్న‌రాజ‌కీయ రైతు ప‌వ‌న్‌

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎవ‌రంటే...

మొద‌ట ఆయ‌న మేధోమ‌థ‌నం చేసి ప్ర‌శ్న అనే పంట‌ను ఉత్ప‌త్తి చేశాడు. ఆ త‌ర్వాత దాన్నుంచి ఆయ‌న‌ పుట్టాడు. పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళించిన చందంగా....ప‌వ‌న్‌కు ఇష్టం లేకపోయినా సినిమా హీరో అయ్యాడు. దీంతో అక్క‌డ కాసుల వ‌ర్షాన్ని కురిపించి, నిర్మాత‌ల పంట పండించాడు. ఆ పంట‌లో త‌న‌కూ వాటా ఇచ్చారు. దీంతో ఆయ‌నకు డ‌బ్బుకు డ‌బ్బు, పేరుకు పేరు. త‌క్కువ స‌మ‌యంలోనే ప‌వ‌ర్‌స్టార్ అయ్యాడు.

రాజ‌కీయ రైతుగా ...

సినిమాల్లో పండించిన పంట‌తో క‌డుపు నిండింది. ఇక క‌డుపు మాడ్చుకుంటున్న వారి ఆక‌లి తీర్చేందుకు స‌రైన వేదిక రాజ‌కీయాల‌నుకున్నాడు. ఏమిటీ స‌మాజం ఇలా భ్ర‌ష్టు ప‌ట్టిపోతోంది, స‌మాజం మ‌న‌కేం ఇచ్చింద‌ని కాకుండా, మ‌నం మ‌న వంతుగా స‌మాజానికి ఏమిచ్చామ‌ని సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి మ‌న‌సు అంత‌రాంత‌రాల్లో ఓ ప్ర‌శ్న కార‌ణంగా జ‌రిగిన‌ సంఘ‌ర్ష‌ణ, సంవేద‌న నుంచి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన అనే పార్టీ ఆవిర్భ‌వించింది.

పార్టీ పుట్టిందేగానీ, టీడీపీ-బీజేపీ మిత్ర‌ప‌క్షానికి మ‌ద్దతు ఇచ్చి వారికి అధికార పంట పండించాడు. అందుకు ప్ర‌తిఫ‌లంగా ప్యాకేజీ అందింద‌ని గిట్ట‌ని వారు ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. అందుకే ఆయ‌న్ను ముద్దుగా ప్యాకేజీ క‌ల్యాణ్ అని పిలుస్తుంటారు. 2019 ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు టీడీపీ-బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్నాడు.

జ‌గ‌న్ సునామీలో గ‌ల్లంతు...

నోరు తెరిస్తే చెగువేరా, నోరు మూస్తే క‌మ్యూనిజం అనే ప‌వ‌న్ మాట‌ల్లో నిజం , న‌డ‌వ‌డిక‌లో ఓ ఇజం...అదే ప‌వ‌నిజం అని న‌మ్మిన వామ‌ప‌క్షాలు...ఎన్నిక‌ల ముందు పొత్తు పెట్టుకున్నాయి. అంతేకాదు బీఎస్పీతో కూడా పొత్తు పెట్టుకుని గంప గుత్త‌గా ద‌ళిత‌, అణ‌గారిన వ‌ర్గాల ఓట్లను దండుకుని అధికార పంట పండించు కోవ‌చ్చ‌నుకున్నాడు.

అయితే వైసీపీ నేత వైఎస్ జ‌గ‌న్ సునామీలో  జ‌న‌సేన‌, త‌దిత‌ర పార్టీల‌న్నీ గ‌ల్లంత‌య్యాయి.  చావు త‌ప్పి క‌న్నులొట్ట పోయిన మాదిరిగా టీడీపీ కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో త‌న‌ను రెండుచోట్ల ఓడించిన జ‌గ‌న్‌పై ఎలాగైనా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకున్నాడా హీరో.

మ‌త‌, కుల‌, ప్రాంత వైష‌మ్యాల‌ను రెచ్చ‌గొడుతూ...

"నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది" అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ చాలా పాపుల‌ర్‌. ఇప్పుడాయ‌న రంగ మారాడే త‌ప్ప న‌ట‌న మాత్రం కొన‌సాగిస్తున్నాడ‌నేందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకోవ‌చ్చు. మాట‌ల్లో చెగువేరా అని మ‌భ్య‌పెడుతూ వ‌చ్చిన ప‌వ‌న్ ...ఉన్న‌ట్టుండి ఒక‌రోజు  మ‌న‌సంతా అమిత్‌షా, మోడీ ఉన్నార‌ని గుండెలు చీల్చి చూపాడు. దీంతో  వామ‌ప‌క్షాల గుండెలు బ‌ద్ద‌ల‌య్యాయి.

అమిత్‌షానే ఈ దేశానికి స‌రైన లీడ‌ర్ అని, బీజేపీకి తానెప్పుడూ దూరం కాలేద‌ని, బీజేపీతో క‌ల‌సి ప‌నిచేసే రోజు రావ‌చ్చ‌ని  ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరుప‌తి వేదిక‌గా ప్ర‌క‌టించాడు. జ‌గ‌న్ స‌ర్కార్ ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెడ‌తాన‌న్నామ‌త మార్పిళ్ల‌తో లింకు, తిరుప‌తి, తిరుమ‌ల‌లో క్రిస్టియ‌న్ మ‌త‌మార్పిళ్లు అంటూ విమ‌ర్శ‌లు, కృష్ణా పుష్క‌ర ఘాట్ వ‌ద్ద మ‌త‌మార్పిళ్లు జ‌ర‌గుతుంటే ఏం చేస్తున్నార‌ని ద‌బాయింపు. అంతేకాదు కోస్తాకు పోతే రాయ‌ల‌సీమ గుండాలు , ముఠాకోరులంటూ ఆరోప‌ణ‌లు, రాయ‌ల‌సీమ‌కు వ‌స్తే మాత్రం అక్క‌డి ప్ర‌జ‌ల పౌరుషం గురించి గొప్ప‌లు చెప్ప‌డం. అంతా మాయ‌.

అంత వ‌ర‌కు ప‌వ‌న్‌పై ఉన్న అనుమానాలకు ఓ స‌మాధానం దొరికింది. చెగువేరా త‌నకు స్ఫూర్తి అని చెప్పుకునే ప‌వ‌న్‌క‌ల్యాణ్...ప‌దేప‌దే జ‌గ‌న్‌పై మ‌త ముద్ర వేస్తూ, ఏపీలో మ‌త, కుల, ప్రాంతీయ వైష‌మ్యాల‌ను పండించే రాజ‌కీయ క‌ర్ష‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నాడని అర్థ‌మైంది. నేడు కాకినాడ‌లో రైతు సౌభాగ్యం పేరుతో ఒక్క‌రోజు చేయ‌నున్న దీక్ష వెనుక ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్క‌లో భాగ‌మే మ‌త‌, కుల‌, ప్రాంతంతో సీఎం జ‌గ‌న్‌కు ముడిపెట్టి విమ‌ర్శ‌లు చేయ‌డం. 

Show comments