పవన్ పలాయనవాదానికి ప్రతీక!

అప్పుడెప్పుడో అనంతపురం నుంచి పోటీచేస్తా అన్నారు.. ఆ మధ్య పిఠాపురం నుంచి పోటీచేస్తా అని కూడా అన్నారు. మధ్యమధ్యలో అన్న మాటలన్నీ లెక్కతీస్తే.. ఇప్పటిదాకా పర్యటించిన నియోజకవర్గాల్లో మూడొంతుల చోట్లనుంచి ‘ఇక్కడనుంచి పోటీచేయాలని ఉంది’ అనిగానీ.. ‘ఇక్కడే పోటీ చేస్తా’ అని గానీ.. పవన్ కల్యాణ్ వాక్రుచ్చి ఉన్నారు.

తాజాగా ఆయన ‘‘ఎక్కడినుంచి పోటీచేసేది త్వరలోనే వెల్లడిస్తా’’ అంటూ కొత్త సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఊరూరా తిరిగేప్పుడు లోకల్ గా ఆకట్టుకోడానికి అన్నట్లుగా ‘ఇక్కడే నా పోటీ’ అనడం.. ఆ తర్వాత తుర్రుమని... తుస్సుమనిపించడం పవన్ కు అలవాటైపోయినట్లుగా కనిపిస్తోంది. ఈ వైఖరి ఆయనలో స్థిరచిత్తం లేదనడానికి, పలాయనవాదానికి ప్రతీక అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా పవన్ కల్యాణ్.. తాను వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీచేసేది.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో డిసైడ్ చేస్తానని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఒక నిలకడలేని మనిషి అని ఎద్దేవా చేయడానికి ‘ఆయనను కనీసం అయిదు నిమిషాలు కదలకుండా నిల్చోమని చెప్పండి’ అంటూ  రాజకీయ ప్రత్యర్థులు అంటుంటారు.

ఆయనకు స్థిర చిత్తం లేదనడానికి కూడా బోలెడు ఉదాహరణలు చెబుతుంటారు. తనలోని నిలకడలేని తనానికి పవన్ తన నియోజకవర్గం విషయం కూడా మరో తార్కాణం అని నిరూపించుకుంటున్నారు. తాను విశ్వమానవుడిని అంటూ పవన్ ఎన్నిరకాల సన్నాయి నొక్కులు నొక్కినా సరే.. ఆయన కేవలం కుల ప్రాతిపదిక మీదనే రాజకీయం చేస్తున్నాడనే సంగతి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

కులబలం ఉన్న ఊర్లలో పోరాటయాత్ర సాగుతున్నప్పుడు ఒకరకంగా మాట్లాడుతూ... కులబలం లేనిచోట్ల ప్రసంగాల్లో కాస్త మెత్తబడుతూ.. ఇలా అతి జాగ్రత్తలు తీసుకుంటూ పవన్ కల్యాణ్ తన కులపిచ్చిని యథేచ్ఛగా చాటుకుంటున్నారు.

అలాగే.. తన కుల ప్రాబల్యం బాగా ఉన్న నియోజకవర్గాల్లో తన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా పవన్ కల్యాణ్ అంచనాల్లో ఉన్నారు. అయినా సరే.. పవన్ కల్యాణ్ ఇప్పటికీ తన నియోజకవర్గాన్ని తేల్చుకోలేదన్నది నిజమేనా అని పలువురు సందేహిస్తున్నారు.

నిజానికి పవన్ కులం ఓట్లు మెజారిటీగా ఉన్న, ప్రభావం చూపగలిగిన తిరుపతి నుంచి పోటీచేయాలని అనుకుంటున్నట్లుగా కూడా కొన్ని వదంతులున్నాయి. సీమ పోరాటయాత్రను తిరుపతిలో ముగించే సమయానికి పవన్ ఆ విషయాన్ని ప్రకటించవచ్చునని కూడా పలువురు భావిస్తున్నారు.

Show comments