పవన్ పార్టీ సీఎం అభ్యర్థి గద్దర్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్నారు. సీపీఎంతో పొత్తు కూడా ఇవాళ రేపట్లో ఖరారు అయిపోతుంది. సాధారణంగా ఎన్నికల బరిలోకి దిగేప్పుడు.. తాము టైంపాస్ గా పోటీచేయడం లేదని, గెలుస్తాం అనే నమ్మకంతోనే బరిలోకి దిగుతున్నామనే భావన ప్రజలకు కలిగించడానికి పార్టీలు కొన్ని టెక్నిక్కులను అనుసరిస్తుంటాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించడం కూడా అలాంటి ట్రిక్కుల్లో ఒకటి. మరి పవన్ సారథ్యంలో సీపీఎం ఇతర పార్టీలు కూటమిగా ఏర్పడితే వారి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? విప్లవ గాయకుడు గద్దర్ పేరును తెరపైకి తెస్తారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి.

తెరాస తరఫున ‘మళ్లీ నేనే సీఎం’ అని స్పష్టంగా ప్రకటించుకుని.. కేసీఆర్ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్-తెదేపా-సీపీఐ-జనస కిచిడీ కూటమికి సీఎం అభ్యర్థిని కాదు కదా.. తాము గెలిస్తే ఏ పార్టీ నేతృత్వం తీసుకుంటుందో ప్రకటించేంత ధైర్యం కూడా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. భారతీయ జనతా పార్టీకి సాధారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించే సాంప్రదాయం ఉంది. కానీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఆ సిద్ధాంతాన్ని పాటిస్తారో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం. వారు పాపం ఇంకా అభ్యర్థులనే తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు.

ఇక మిగిలిందెల్లా.. జనసేన-సీపీఎం కూటమి మాత్రమే. వీరిద్దరి మధ్య పొత్తులు తుదిరూపు తీసుకోవాల్సి ఉంది. ఆ నిర్ణయం జరిగేలోగా.. ముఖ్యమంత్రి ఎవరనే విషయంలోనూ ఒకమాట అనుకుంటారనేది సమాచారం. మామూలు పరిస్థితుల్లో అయితే.. తెలంగాణలో ఇంకా సంస్థాగత నిర్మాణం కూడా లేని జనసేన- నాలుగైదు నియోజకవర్గాలకు మించి ప్రభావం చూపలేని సీపీఎంలు పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వారు ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి చర్చించుకోవాల్సిన అవసరంలేదు. కానీ పవన్ కు తెలంగాణలో గద్దర్ వంటి పలువురు ప్రముఖులతో క్లోజ్ పరిచయాలు ఉన్నాయి. వారంతా ఆయన కోసం ఎన్నికల్లోకి వస్తారు.

పైగా గద్దర్ కూడా ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పోటీచేస్తా.. అవసరమైతే ముఖ్యమంత్రి కూడా అవుతా అని ప్రకటించారు. గద్దర్ ఎన్నికల్లోకి రావడం అంటూ జరిగితే అది పవన్ పార్టీ తరఫున గానీ, పవన్ మద్దతుతోగానీ మాత్రమే జరుగుతుందని పలువురు అనుకుంటున్నారు. గద్దర్ పేరును తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తాము కాస్త సీరియస్ గానే బరిలోకి దిగుతున్నాం అనే భావన ప్రజలకు కలిగించవచ్చునని, ఆయన పేరు కొన్ని అదనపు ఓట్లను కూడా రాబడుతుందని ఆ పార్టీలు అంచనాతో ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

RELATED అలా అడల్ట్‌ స్టార్‌ని అయ్యాను: సన్నీలియోన్‌