తెలంగాణలో తొలి పొత్తు.. బాబుకు చెక్

తెలంగాణ అసెంబ్లీని రద్దుచేసి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ కులాసాగా ఉంటే.. మిగతా పార్టీలు పొత్తులపై మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో తొలిపొత్తు మాత్రం సీపీఐ-జనసేన మధ్య కుదిరేట్టు కనిపిస్తోంది. మంగళ, బుధ వారాల్లో పొత్తుపై కీలక ప్రకటన వెలువడుతుంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే దాదాపుగా సీపీఎం-జనసేన జట్టుగా ఎన్నికల బరిలో దిగడం ఖాయం. 

సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటికే ఓసారి జనసేన ఆఫీస్ కి వచ్చి నేతలతో చర్చించి వెళ్లారు. జనసేన పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ నేతలు మరోసారి దీనిపై సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రకటన తర్వాత వ్యవహారం మరింత స్పీడందుకుంది. నిన్న పవన్ కల్యాణ్ స్వయంగా పొత్తు విషయంపై తమ నేతలతో అంతర్గత సమావేశంలో చర్చించారు. రెండు రోజుల్లో సీపీఎం నేతలతో ఆయన సమావేశమవుతారు. 

అయితే ఈ పొత్తు వల్ల అటు జనసేనకు, ఇటు సీపీఎంకు ఒరిగేదేం లేదు. ఎన్నికలపై ఈ పొత్తు ఎలాంటి ప్రభావం చూపదు. కానీ ఇక్కడ పవన్ కల్యాణ్ వ్యూహం వేరు. ఆయన చంద్రబాబును దెబ్బకొట్టే లక్ష్యంతో ఈ పొత్తు పెట్టుకుంటున్నారు. అదెలాగంటే..

తెలంగాణలో సీపీఎంతో జనసేన పొత్తు ఖరారయితే.. కాంగ్రెస్ తో కలసి మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటున్న టీడీపీ ఎత్తుగడకు ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు, కోదండరాం జనసమితి తో కలసి టీడీపీ మహాకూటమికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సీపీఐ కాస్తో కూస్తో సుముఖంగా ఉన్నా.. సీపీఎం మాత్రం ముందు నుంచీ జనసేనతో ప్రయాణం చేయాలనుకుంటోంది. 

ఏపీలో వామపక్షాలు ఏకపక్షంగా జనసేనకు జై కొడుతుంటే.. తెలంగాణలో మాత్రం పొత్తుల విషయంలో వామపక్షాల మధ్య అభిప్రాయబేధాలున్నాయి. సీపీఎంని అటువైపు అడుగేయకుండా పవన్ అడ్డుకోగలిగితే, పురిటిలోనే మహా కూటమిని చంపేసినట్టు అవుతుంది. 

సీపీఎం, సీపీఐ కేంద్ర కమిటీలు ఓ నిర్ణయం తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన-వామపక్ష కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ పని అయిపోయినట్టే. టీడీపీకి ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ ఒక్కటే అవుతుంది.