కులం లెక్కలతో టికెటిచ్చిన పవన్ కల్యాణ్!

ఆ మాటకొస్తే.. కులం కొలబద్ధ లోంచి చూడకుండా ఇవాళ ఎమ్మెల్యే టికెట్ గానీ, ఎంపీ టికెట్ గానీ ఇచ్చే పార్టీ అసలుందా? అనే అనుమానం మనకు కలుగుతుంది. అంతమాత్రాన ఏ పార్టీ నాయకుడు అయినా.. ‘అతను ఫలానా కులం గనుక.. నేను టికెట్ ఇస్తున్నా’ అని చెప్పరు కదా.. ‘అదను నా కులం గనుక... టికెట్ ఇస్తున్నా అని చెప్పరు కదా...’! కానీ, పవన్ కల్యాణ్ అలాగే చెప్పారు. జనసేన పార్టీ తరఫున ఏపీలో వచ్చే ఏడాది రాబోయే ఎన్నికల్లో పోటీచేయడానికి తొలి ఎమ్మెల్యే టికెట్ ను తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పితాని బాలకృష్ణకు కేటాయిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘ఆయనదీ నాదీ ఒకటే కులం.. అందుకే టికెట్ ఇస్తున్నా’ అని బహిరంగంగా పేర్కొన్నారు. కాకపోతే పవన్ కల్యాణ్ ఇక్కడొక చిన్న ట్విస్టు పెట్టారు.

పవన్ కల్యాణ్ ది కాపు కులం. పితాని బాలకృష్ణ ది శెట్టి బలిజ. మరి ‘ఆయన్దీ నా కులమే’ అని పవన్ ఎందుకన్నారు. అక్కడే ఉంది ట్విస్టు. ‘మా ఇద్దరిదీ ఒకటే కులం.. అదే పోలీసు కులం’ అంటూ పవన్ తన మార్కు చమక్కు వినిపించారు. ‘మా నాన్న కానిస్టేబుల్, పితాని బాలకృష్ణ కూడా కానిస్టేబులే. అందుకే తొలి టికెట్ ఇస్తున్నా’ అని పవన్ పేర్కొన్నారు.

ముమ్మిడివరానికి చెందిన పితాని బాలకృష్ణ కానిస్టేబుల్ గా ఉంటూ రాజీనామా చేసి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గానికి ఇన్చార్జిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఆయన జనసేనకు దగ్గరయ్యారు. చివరికి మంగళవారం నాడు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో తన నియోజకవర్గంలోని కొందరు కార్యకర్తలతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇస్తానని పార్టీలో చేర్చుకుని మోసం చేశారని.. అందుకే ఇప్పుడు జనసేనలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో కాపుల్లాగానే, శెట్టిబలిజలది కూడా బలమైన సామాజిక వర్గమే. పితానిని చేర్చుకున్న సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నేను కులాలు పట్టించుకోను, అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తాను, అందుకే పార్టీ నిర్మాణం లేటైంది.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు గానీ.. కులబలం పరంగా పితానితో పార్టీకి ఎడ్వాంటేజీ ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ టికెట్ కేటాయించినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది.