పవన్‌ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్టు?

రాయలసీమలో జనసేన పార్టీ ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. నాలుగు జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆఖరికి కొన్ని సీట్లకు జనసేనకు అభ్యర్థులే లేకుండా పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్నిచోట్ల నామమాత్రపు పోటీ, మరికొన్ని చోట్ల అసలు అభ్యర్థులే లేరు. కొన్నిచోట్ల మాత్రం కొందరు హడావుడి చేశారు. ఇదీ జనసేన పరిస్థితి. హిందూపురం ఎంపీ సీటుకు జనసేన తరఫు నుంచి కానీ ఆ పార్టీ కూటమిలోని వారి తరఫు నుంచి అభ్యర్థి ఎవరూ పోటీలో లేకుండా పోయారంటే.. జనసేన కథ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

కనీసం ఎంపీ సీట్లకు అభ్యర్థులు పెట్టుకోలేని రీతిలో పవన్‌ కల్యాణ్‌ రాజకీయం సాగిందని స్పష్టం అవుతూ ఉంది. ఇక ఓట్ల విషయానికి వస్తే జనసేన కొద్దోగొప్పో ఓట్లను సంపాదించుకున్నదనేది మాత్రం వాస్తవం. ప్రత్యేకించి అవి బలిజల ఓట్లు. వాటితో పాటు పవన్‌ కల్యాణ్‌ మీద సినీ వీరాభిమానంతో కొద్దోగొప్పో ఓట్లు పడ్డాయి. ఈ రెండు కేటగిరిల్లోని ఓట్లు మాత్రమే జనసేనకు పడ్డాయి. వాటి స్థాయి నియోజకవర్గాన్ని బట్టి వెయ్యి నుంచి ఐదారువేల వరకూ ఉండొచ్చని అంచనా.

అయితే అభ్యర్థులు కాస్త గట్టిగా కష్టపడ్డ నియోజకవర్గాల్లో జనసేన స్థాయి పదివేల ఓట్ల వరకూ వచ్చిందనే టాక్‌ కూడా వినిపిస్తూ ఉంది. కర్నూలు జిల్లాల్లో ఎస్పీవై, అనంతపురం అర్బన్లో, ధర్మవరం నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌.. వీటిల్లో జనసేన కాస్త ఓట్లను పొందిన దాఖలాలు  కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో సాధారణంగా అభ్యర్థులు మెజారిటీలు పొందే స్థాయిలో జనసేన ఓట్లను పొందింది. ఒక లెక్కప్రకారం చూస్తే.. జనసేనకు పడ్డ ప్రతి వంద ఓట్లలో ఎనభై వరకూ తెలుగుదేశం ఓట్లు, ఇరవై వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు ఉంటాయని అంచనా!

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!