'పరువు హత్య' ఇంతకీ రాక్షసులు ఎవరు?

మంచిమాట...
ఒక్కమాటలో చెప్పాలంటే.. మిర్యాలగూడలో జరిగిన పరువుహత్య ఒక కుటుంబ వ్యవహారం. ఒక వ్యక్తికి సంబంధించిన కక్ష. ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. దాన్నొక సామాజిక అంశంగా మార్చేస్తున్నారు మరికొందరు. ఇది ఎందుకు ఒక కుటుంబానికి సంబంధించిన అంశం అనాల్సి వస్తోందంటే.. కులాంతర వివాహాలు మన దగ్గర మరీ కొత్తవేవీ కాదు. అందరూ ఆమోదించకపోవచ్చు గాక.. భారతదేశంలో, అందునా తెలుగునాట శతాబ్దాల నుంచే కులాంతర వివాహాలున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో అవి చాలా ఎక్కువ అయ్యాయి కూడా.

కులాంతర వివాహాలను ఆమోదించే దశకు వచ్చేశారు మన జనాలు. అందరూ కాకపోవచ్చు. కొందరైనా ఆమోదిస్తున్నారు. ప్రతి ఒక్కరి సర్కిల్‌లోనూ కొన్నైనా కులాంతర వివాహాలు ఉంటాయి. ఆ వివాహాలు అందరి సమక్షంలో వేడుకగా జరిగిన సందర్భాలూ ఉంటాయి. గమనించాల్సిన అంశం.. ఈ కులాంతర వివాహాల్లో చాలా వరకూ ప్రేమ వివాహాలు. వీటిల్లో చాలావరకూ పెద్దల ఆశీర్వాదంతోనే జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పెద్దల ఆమోదానికి ప్రధానమైన కండీషన్‌.. తమ పిల్లల మెచ్యూరిటీ. పిల్లలు చక్కగా చదువుకుని, కనీసం గ్రాడ్యుయేషనో పూర్తిచేసి.. ఒక ఉద్యగం చేసుకునే స్థాయికి ఎదిగి.. అప్పుడు తమ ప్రేమ గురించి చెబితే, ఆ తల్లిదండ్రులు కూడా పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతుండటాన్ని మన కళ్ల ముందే చూస్తున్నాం.

ఇద్దరూ చదువుకుని ఉంటే.. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే స్థాయికి చేరుకుంటే.. అప్పుడు వాళ్లు తీసుకునే నిర్ణయాలకు కూడా చాలా విలువ ఉంటుంది. ఏ తల్లిదండ్రులు అయినా వాటికి విలువనిస్తారు. ఇలాంటి పెళ్లిళ్లు ప్రతి ఊర్లోనూ జరుగుతున్నాయి. ఇందులో సందేహంలేదు. అలాగని కులాంతర వివాహాల విషయంలో ప్రతి తల్లీతండ్రీ ఆమోదించే దశకు వచ్చేశారని చెప్పడంలేదు. ఇప్పటికీ ఆమోదించని వారూ చాలామంది ఉన్నారు. అలాంటి వారింటిలో ఒక పరువు హత్య జరిగింది.

ఇది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారంగానే చూడాలి. ఈ వ్యవహారంలో పిల్లల పాత్రను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతిమంగా హత్య అనేది దారుణమే. అందుకు ఆ తండ్రి కూడా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. తన జీవితాన్ని, తను పరువుగా భావించిన కుటుంబాన్ని కూడా ఆ వ్యక్తి నాశనం చేసుకున్నాడు. ఇదంతా వారి వ్యక్తిగతం. అయితే ఈ పరువు హత్యను మొత్తం సమాజానికి అన్వయించేసి, సమాజమంతా ఇలాగే ఉందని.. అనడం కూడా దారుణమే.

అసలు ఈ వ్యవహారంలో కులసంఘాలు తలదూర్చడం, కొన్ని కులాలపై దాడిగా దీన్ని అభివర్ణించడం కేవలం చలికాచుకోవడమే. ఇక రాజకీయ నేతలు సరేసరి. మారుతిరావును ఎన్‌కౌంటర్‌ చేయాలని ఒకరు, నిలువునా నరకాలని మరొకరు అంటున్నారు. మరి వీరి ఇళ్లలో కులాంతర వివాహాలు జరుగుతున్నాయా? చట్టం అనేది ఒకటుందనే విషయాన్ని మరుస్తున్నారా?
-ఎల్.విజయలక్ష్మి 

Show comments