సినిమా రివ్యూ: పడి పడి లేచె మనసు

రివ్యూ: పడి పడి లేచె మనసు
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌
తారాగణం: శర్వానంద్‌, సాయి పల్లవి, సునీల్‌, మురళి శర్మ, సంపత్‌ రాజ్‌, ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌, ప్రియా రామన్‌ తదితరులు
సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
నిర్మాతలు: సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
విడుదల తేదీ: డిసెంబర్‌ 21, 2018

హను రాఘవపూడి చెప్పినట్టు ప్రేమకథల్లో ఇక కొత్తదనం వుండదు. ఇప్పటికే కొన్ని వేల కొద్దీ ప్రేమ కథలు తెరకెక్కిన తర్వాత ఇంకా లవ్‌స్టోరీస్‌లో కొత్త కోణం చూపించడానికి ఏమీ వుండదు. అయితే 'కాన్‌ఫ్లిక్ట్‌' అనేది ఎలాంటి స్టోరీకి అయినా మస్ట్‌. ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేనపుడు ఎంత సుగర్‌ కోటింగ్‌ వేసినా కానీ ఆ పూత పోయినపుడు చప్పగా అనిపించినా తప్పు లేదేమో కానీ చేదుగా వుంటే గొంతు దిగదు. తన ప్రేమ జంట ప్రేమలో పడే ప్రాసెస్‌ని వినూత్నంగా, ఆహ్లాదభరితంగా చెప్పిన హను రాఘవపూడికి వారి మధ్య సంఘర్షణ ఎంత బలంగా వుండాలి, ఏ కారణం చేత వారి మధ్య దూరం పెరగాలి అనే దానిపై ఎక్కువ కసరత్తు చేసినట్టు లేడు.

లేదా తాను అనుకున్న కాన్‌ఫ్లిక్ట్‌ ఆల్రెడీ మరో సినిమాలో (తేజ్‌ ఐలవ్యూ) వచ్చిందని సినిమా తీస్తుండగా తెలిసి మార్పు చేర్పులు చేసుకుని ఉండొచ్చు. కారణం ఏదయినా కానీ విరామం వరకు విహంగంలా పైకి ఎగసి వెళ్లిన సినిమా కాస్తా ఒక్కసారి బ్రేక్‌ తీసుకున్నాక ఇక ఎగరనని మొరాయించడంతో ద్వితియార్ధం గమ్యమెటో తెలియని అయోమయంలో పడిపోయింది. ఆ ట్విస్టులు, ఈ ట్విస్టులు ఇచ్చి మళ్లీ లేపాలని చూసినా కానీ అంతిమంగా క్రాష్‌ ల్యాండ్‌ అయిపోయింది. అంత చక్కని ఫస్ట్‌ హాఫ్‌ తర్వాత ఇలా అంతు చిక్కని సెకండ్‌ హాఫ్‌ ఏమిటో, ఎందువల్లో హనుకే తెలియాలి.

అంత ఈజీగా ఎవరికీ పడని అమ్మాయిని (సాయి పల్లవి) తన వైపు తిప్పుకోవడానికి అబ్బాయి (శర్వానంద్‌) చేసే చర్యలు ఆహ్లాదంగా అనిపిస్తాయి. ఇద్దరూ మంచి నటులు కావడంతో సింపుల్‌ సీన్లు కూడా స్టాండ్‌ అవుట్‌ అయ్యాయి. హాస్యానికి జోడించిన ఇతరత్రా సరంజామాలు, జస్ట్‌ అలా టచ్‌ చేసి వదిలేసిన హీరో తాలూకు బ్యాక్‌గ్రౌండూ, హాయిగా అనిపించే పాటలు... ఫస్ట్‌ హాఫ్‌ ముందే చెప్పినట్టుగా విరామం వరకు విమానంలా దూసుకెళ్లింది. అయితే ఇంటర్వెల్‌కి ముందు ఈ ప్రేమకి కాన్‌ఫ్లిక్ట్‌ పాయింట్‌ ఏమిటో ఎస్టాబ్లిష్‌ చేయాలి.

సో... సడన్‌గా హీరో తన బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి ఒక త్రెడ్‌ పట్టుకొచ్చి ప్రేమ వరకు ఓకే కానీ పెళ్లి మాత్రం నాట్‌ ఓకే అనేస్తాడు. అంతలోనే కన్విన్స్‌ అయి 'ఇద్దరు కలిసుండడానికి పెళ్లి చేసుకోకూడదు, కలిసుండకపోతే బతకలేం అనిపించినపుడు పెళ్లి చేసుకోవాలి' అంటాడు. ఆ లెక్కన ఒక ఏడాది విడిపోయి మళ్లీ కలుద్దామని, అప్పటికీ కలవాలని లేకపోతే విడిపోయి బతకడానికి అలవాటు పడిపోయి వుంటాం కనుక పూర్తిగా విడిపోదామని అమ్మాయి చెప్పిన దానికి సరేనంటాడు.

ఏడాది తిరిగే సరికి ఈ ప్రేమికుల కలయికకి ప్రకృతి అడ్డు పడుతుంది. అక్కడ్నుంచీ అమ్మాయికి డిజార్డర్‌ పేరిట కథనంలోకి డిజార్డర్‌ చొరబడి ఇక మళ్లీ ఆర్డర్‌లోకి రానివ్వకుండా చేస్తుంది. ఈ సమస్యని ఏమి చేద్దామనే దానిపై దర్శకుడు టూ మైండ్స్‌తో వుండిపోయాడా అనే అనుమానం వస్తుంది. అసలు అమ్మాయికి నిజంగా సమస్య వుందా లేక నటిస్తోందా? వుందంటే 'తేజ్‌ ఐలవ్యూ' అనేస్తారా, లేదంటే ఈ అమ్మాయిని తేలిగ్గా చూస్తారా? అనే సందిగ్ధంలో పడి సమస్య ఉండీ లేనట్టుగా, అసలుంటే ఏంటన్నట్టుగా... ఫైనల్‌గా ఏదో 'మమ' అనిపించేస్తాడు.

ఒక ప్రేమకథకి కావాల్సిన చక్కని పెయిర్‌, లవ్‌స్టోరీలో వుండాల్సిన ఫ్రెష్‌ అప్పీల్‌, అలరించే మ్యూజిక్‌... లాంటి వనరులన్నీ సరిగ్గా సమకూరిన సినిమా సగం నుంచి సమతుల్యం మిస్‌ అవడం, ఒక్కసారిగా బేలగా మారి కాపాడమంటూ లీడ్‌ పెయిర్‌పై డిపెండ్‌ అయిపోవడం ఎంత మాత్రం సమంజసంగా లేదు. శర్వానంద్‌ ఎక్కువ ప్రయాస పడకుండా ఎలాంటి ఎమోషన్‌ని అయినా సింపుల్‌గా పలికించగలడు. ఈ చిత్రంలో నటుడిగా అతను ఫుల్‌ మార్కులు కొట్టేస్తాడు.

సాయి పల్లవి లాంటి అమేజింగ్‌ యాక్ట్రెస్‌ పక్కన వున్నపుడు సాటి నటులు కాస్త తడబడతారు. కానీ శర్వానంద్‌ ఏమాత్రం తొణక్కుండా కథానాయకుడిగా ఈ చిత్రానికి ఎంత అవసరమో అంతకు మించే ఇవ్వగలిగాడు. సాయి పల్లవికి నటనకి స్కోప్‌ వున్న క్యారెక్టర్‌ దక్కింది. రకరకాల షేడ్స్‌, ఎమోషన్స్‌ పలికించే వీలున్న అవకాశాన్ని ఆమె పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. సినిమాలో వున్న బలహీనతలు చాలా వరకు వీళ్లిద్దరూ తమ నటనతో కప్పిపుచ్చి, రాంగ్‌ ట్రాక్‌లోకి పోయినపుడు కూడా తమ స్క్రీన్‌ ప్రెజెన్స్‌, కెమిస్ట్రీతో హోల్డ్‌ చేసారు.

సునీల్‌ ఎంట్రీ ఇచ్చినపుడు సేవియర్‌లా అనిపించినా అతని క్యారెక్టర్‌ సరిగా డెవలప్‌ చేయలేదు. అతడనే కాదు వెన్నెల కిషోర్‌, మురళి శర్మ, ప్రియదర్శిలో ఎవరినీ సరిగా ఉపయోగించుకోలేదు. సంపత్‌ రాజ్‌, ప్రియారామన్‌ల త్రెడ్‌ కూడా బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితమయింది తప్ప డ్రామాకి హెల్ప్‌ అవలేదు. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది. ఛాయాగ్రహణం చాలా బాగుంది. ఇటు కోల్‌కతా అందాలతో పాటు అటు నేపాల్‌లో దృశ్యాలు కూడా కనువిందు చేస్తాయి.

సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ పరంగా కూడా ఎక్కడా రాజీ లేదు. దర్శకుడిగా హను రాఘవపూడి తన టాలెంట్‌ని చాలా సందర్భాల్లో చూపిస్తాడు. ముఖ్యంగా ప్రథమార్ధం చూస్తే మనకూ ఓ మణిరత్నం వున్నాడనినిపించేస్తాడు. అయితే మరోసారి టేకాఫ్‌ తీసుకుని ల్యాండింగ్‌ విషయంలో ఇబ్బంది పడ్డాడు. లై చిత్రానికి ఫౌండేషన్‌ అంతా స్ట్రాంగ్‌గా వేసుకుని దానిపై తన ఆలోచనల్ని ఎలాగయితే నిలబెట్టలేకపోయాడో, ఇక్కడా ఒక అందమైన ప్రేమసౌధాన్ని నిర్మించేసి రంగులద్దాల్సిన సమయంలో నలుపు నింపేసాడు.

రెండు గంటల నలభై నిమిషాల నిడివి తర్వాత ముగిసిన సినిమా సడన్‌గా అబ్‌రప్ట్‌గా ముగిసిపోయిందనిపిస్తే, ఇంకా తీయాల్సిన సినిమా చాలా వుందనిపిస్తే అంత కంటే లోటేమి వుంటుంది? ఎంత బాగుందీ లవ్‌స్టోరీ అని మెచ్చుకునేలోపే, ఎందుకొచ్చిందీ సోది అనిపించేంతగా టర్న్‌ తీసేసుకుంటే చేయగలిగేదేముంది?

బాటమ్‌ లైన్‌: పడి... మళ్లీ లేవలేదు!
- గణేష్‌ రావూరి

Show comments