పాపం పొన్నాల.. టిక్కెట్‌ దక్కేనా.?

మాజీమంత్రి.. పైగా, మాజీ పీసీసీ అధ్యక్షుడు.. అయినా, టిక్కెట్‌ దక్కించుకోలేని దుస్థితి. పొన్నాల లక్ష్మయ్య ఇకపై కాంగ్రెస్‌ కార్యకర్తల ముందు తలెత్తుకు తిరిగేది ఎలా.? పొన్నాల లక్ష్మయ్య ఆశించిన జనగామ టిక్కెట్‌ని తెలంగాణ జన సమితికి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం దాదాపుగా 'ఓకే' చేసేసింది. తొలి లిస్ట్‌లో పొన్నాల లక్ష్మయ్య పేరు కన్పించకపోవడంతో, కాంగ్రెస్‌లో ఆయన 'షో' ముగిసినట్లేనని ప్రచారం జరుగుతోంది.

మరోపక్క, పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్ర సమితితో టచ్‌లోకి వెళ్ళారనీ, ఈ కారణంగానే ఆయన్ని కాంగ్రెస్‌ అధిష్టానం పక్కన పెట్టిందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. పొన్నాల గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యనేతగా వెలిగిన మాట వాస్తవం. పీసీసీ అధ్యక్షుడిగానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. అయితే, గత కొంతకాలంగా పార్టీ ముఖ్యమైన కార్యక్రమాల్లో కన్పించడంలేదు పొన్నాల. తెరవెనుక, టీఆర్‌ఎస్‌తో వ్యవహారాల్ని ఆయన చక్కబెడ్తున్నారంటూ కాంగ్రెస్‌ శ్రేణుల్లోనే అసహనం వ్యక్తమవుతోంది.

ఇదిలా వుంటే, పొన్నాల హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. కాంగ్రెస్‌ అధిష్టానంతో చివరి దఫా మంతనాలు జరపనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి, ఆయన తన భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తారట. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఇప్పటికే సన్నాహాలు చేసుకున్న పొన్నాల, ఢిల్లీలో చర్చలు వికటిస్తే.. ఆ వెంటనే, హైద్రాబాద్‌కి చేరుకుని, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ అవుతారంటూ గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి.

కాగా, ఇప్పటికైతే ఇంకా జనగామ టిక్కెట్‌ని అధికారికంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌కి అప్పగించినట్లు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. పొన్నాల, కాంగ్రెస్‌ని వీడేందుకు నిర్ణయం తీసుకుంటే, ఆ వెంటనే జనగామ విషయమై కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ప్రకటన రాబోతోందని తెలుస్తోంది.

కొసమెరుపు: పొన్నాల ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడినా.. టీఆర్ఎస్ ఆయనకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీగానో, ఇంకో నామినేటెడ్ అవకాశమో గులాబీ బాస్, పొన్నాలకు ఆఫర్ చేస్తారేమో వేచి చూడాల్సిందే.

టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్‌!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments