ప్రత్యర్థులే కేసీఆర్ ను హైప్ చేస్తున్నారు!

బాగా బలంగా ఉండి, రాబోయే ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ఖచ్చితంగా మళ్లీ విజయం సాధిస్తారా? రాష్ట్ర ప్రజల్లో అలాంటి భావన ఉందా? అవునో కాదో గానీ.. తెరాస ప్రత్యర్థులు మాత్రం అలాంటి భావనతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, తెరాస ప్రత్యర్థులందరూ కలిసి అలాంటి భావనను ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రకంగా వారంతా కలిసి కేసీఆర్ విజయావకాశాల గురించి తామే, అప్రయత్నంగా హైప్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కేసీఆర్ ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి.. ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్లిపోతున్నారు. కానీ ప్రతిపక్షాలు ఇంకా ట్రాక్ మీదికి రావడానికి నానా పాట్లు పడుతున్నాయి. తెరాస అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తున్నా విపక్షాలు ఇప్పటిదాకా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకుండా సతమతం అవుతున్నాయి.

నిజం చెప్పాలంటే.. ఒంటరిగా కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఏ ఒక్క ప్రతిపక్షానికీ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే అందరూ పొత్తులు ఖరారయ్యే దాకా అడుగు ముందుకు వేసే పరిస్థితిలో లేరు. అందుకే ఇప్పటికీ పొత్తుల సంగతి తేల్చుకోడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. పొత్తులను ఫైనలైజ్ చేసే కీలక భేటీలు ఇవాళ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే.. ప్రతిపక్షాలు అన్నీ ఏకం అయితే గనుక... కేసీఆర్ ను ఓడించడం చాలా సులువు అని పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్లలో ఒకరు, రాజ్యసభ ఎంపీగానే సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉన్న వీ.హనుమంతరావు ఇలా చెబుతున్నారు. అంటే  దాని అర్థం ఎలా ఉన్నదంటే... అందరూ ఒక్కటి కాకపోతే... కేసీఆర్ ను ఓడించడం అసాధ్యం అన్నట్లుగా ఉంది. పరోక్షంగా కేసీఆర్ –తెరాస చాలా బలంగా ఉందని ఆయన ఒప్పుకున్నట్లుగానే కనిపిస్తోంది.

తెరాస చాలా చాలా బలంగా ఉన్నదని, అందుకే అందరూ కలిస్తే తప్ప ఎదుర్కోలేం అని ప్రత్యర్థులే భయపడుతున్నారని ప్రజలు భావించే పరిస్థితి ఉంది. ఈ రకమైన మాటలతో తెరాసకు హైప్ పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.