గోదావరి జిల్లాల్లో టీడీపీ అంత చిత్తుగానా!

గత ఎన్నికల్లో టీడీపీని నిలబెట్టింది గోదావరి జిల్లాలే అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు గోదావరి జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని కూడా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అధ్యయన సంస్థ ఈ జిల్లాల్లో రాజకీయ పరిస్థితి గురించి సంచలన సర్వేను ప్రకటించింది. ఇది ఏ మేరకు నిజమో కానీ.. గోదావరి జిల్లాల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది.

ఎంతగా అంటే.. ఉభయ గోదావరి జిల్లాల్లో కలిసి టీడీపీ మూడంటే మూడు అసెంబ్లీ సీట్లలో మాత్రమే నెగ్గే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. టీడీపీ ఇలా చిత్తు అయిపోతుందని.. అక్కడ మిగిలిన సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు దాదాపు సగంగా పంచుకుంటాయని ఈ అధ్యయనం అంటోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు జిల్లాల్లోనూ కలిసి పదహారు అసెంబ్లీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని, జనసేన పదిహేను సీట్ల ను నెగ్గుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. మెజారిటీ సీట్లు వైసీపీ దక్కించుకుంటుందని, పవన్ కల్యాణ్ బాగా ఆశలు పెట్టుకున్న ఈ జిల్లాల్లో జనసేన పదిహేను సీట్లను గెలుస్తుందని.. ఈ అధ్యయనం అంటోంది. పూర్తి శాస్త్రీయంగా తమ అధ్యయనం జరిగిందని సదరు సంస్థ పేర్కొంటోంది.

సాధారణంగా గోదావరి జిల్లాల్లో ఎవరిది పైచేయి అయితే వారికే అధికారం దక్కుతూ ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ రెండు జిల్లాల్లో పదహారు సీట్లే గనుక వస్తే.. అధికారం దాదాపు హస్తగతం అయినట్టే. ఎలాగూ జనసేన అధినేత గోదావరి జిల్లాల్లో మాత్రమే పని చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలను దాటి పవన్ బయటకు రావడంలేదు. మిగతా రాష్ట్రంతో తనకు పనిలేదన్నట్టుగా పవన్ వ్యవహరిస్తూ ఉన్నాడు.
ఒకవేళ ఈ అధ్యయనమే నిజమై టీడీపీ మూడంటే మూడు సీట్లకే పరిమితం అయిపోతే.. బాబుకు అంతకు మించి షాక్ ఉండదు!

Show comments