నారావారి పునాదిరాళ్లు.. బాబు కొత్త రికార్డు

కాంక్రీటు పనులతో పోలవరం ప్రాజెక్ట్ ని గిన్నిస్ రికార్డ్ ల్లోకెక్కించిన చంద్రబాబు, తాను కూడా అదే ఫీట్ సాధించేందుకు సిద్ధమయ్యారు. అత్యథిక శంకుస్థాపనలు చేసిన సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నారు. అందుకే ఎన్నికల ఏడాది వరుసబెట్టి ఫౌండేషన్ స్టోన్ లు పడేస్తున్నారు. అసలు పనులు మొదలవుతాయా, ఆ తర్వాత పూర్తవుతాయా అనే విషయాలను పట్టించుకోకుండా కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు.

కడపలో ఉక్కు ప్రాజెక్ట్, రామాయపట్నం పోర్ట్, నెల్లూరులో ఎయిర్ పోర్ట్.. ఇలా వరుసబెట్టి చంద్రబాబు శంకుస్థాపనలు చేసుకుంటూ పోతున్నారు. అభివృద్ధి అనే ముసుగులో జనాన్ని మరోసారి బుట్టలో వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నాలుగేళ్లూ చంద్రబాబు చేసిన పనులు ఒకెత్తు.. ఐదో ఏడాది ఆయన చేస్తున్న పనులు మరో ఎత్తు.

ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు బాబులో ఇంత జోరు లేదు. విడిపోయిన తర్వాత, కేంద్రం సహకరించకపోయినా, రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు లేకపోయినా పునాదిరాళ్లు వేసుకుంటూ పోతున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు వీలైనన్ని శంకుస్థాపనలు చేసి రికార్డ్ ల కెక్కాలనేది చంద్రబాబు ఆలోచన.

దీనికి తగ్గట్టుగానే జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా ప్రతిజిల్లానూ చుట్టేస్తున్నారు. సీఎంకి పోటీగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ పునాది రాళ్ల వ్యవహారంతో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శిథిలావస్థకు చేరుకున్న తహశీల్దార్ కార్యాలయాలన్నిటినీ కొత్త భవనాల్లోకి మార్చబోతున్నారు.

ఈ బిల్డింగులన్నిటికీ సరిగ్గా ఎన్నికల కోడ్ వస్తున్న తరుణంలోనే శంకుస్థాపనలు జరుగుతున్నాయంటే టీడీపీ నేతలు ఎంత ముందుచూపుతో ఉన్నారో అర్థమవుతుంది. జగన్ ప్రజాసంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తి కావడంతో బాబు గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి.

2014 ఎన్నికల హామీలే ఇంతవరకు సరిగా అమలు చేయలేదు. ఈసారి కొత్త హామీలంటే జనాలు తరిమికొట్టేలా ఉన్నారు. అందుకే చంద్రాబాబు ఈ శంకుస్థాపన జిమ్మిక్కు మొదలుపెట్టాడు. అభివృద్ధిని ఆరంభించాం.. దాన్ని కొనసాగించాలంటే మరోసారి టీడీపీయే అధికారంలోకి రావాలంటూ వితండవాదం చేస్తున్నారు.

అయితే చంద్రబాబు నయవంచనని మరోసారి నమ్మేందుకు ఏపీ ప్రజలేమంత అమాయకులు కాదు. ఇప్పుడు బాబు వేస్తున్న ఈ పునాది రాళ్లే.. ఆయన రాజకీయ జీవితానికి సమాధి రాళ్లుగా మారబోతున్నాయని పలువురు విశ్లేషించుకుంటున్నారు.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

Show comments