మ‌రోసారి క‌విత విచార‌ణ‌...బీఆర్ఎస్‌లో ఆందోళ‌న‌!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో మ‌రోసారి ఎమ్మెల్సీ క‌విత ఈడీ విచార‌ణ ఎదుర్కోనున్నారు. ఈ నెల 11న మొద‌టి ద‌ఫా ఆమె ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈడీ విచార‌ణ‌పై స్టే విధించాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన‌ప్ప‌టికీ, క‌విత‌కు సానుకూల తీర్పు రాలేదు. ఈ నేప‌థ్యంలో క‌విత అరెస్ట్‌పై మ‌రోసారి పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో క‌విత‌ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. తీవ్రమైన బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్‌లో ఈడీ త‌న‌ను అరెస్ట్ చేస్తుంద‌నే ఆందోళ‌న క‌విత వ్య‌క్తం చేశారు. తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా సాక్షులను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని, కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామంటూ భయపెడుతున్నారని తెలిపారు.

త‌న‌కు వ్య‌తిరేకంగా కేంద్రంలోని అధికార పార్టీ చెప్పిన‌ట్టు ఈడీ విచారిస్తోంద‌ని క‌విత ఆవేద‌న‌. మొద‌టిసారి విచార‌ణ ఎదుర్కొన్న క‌విత‌, ఆ అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని, మున్ముందు త‌న‌ను ఇరికిస్తార‌నే ఆందోళ‌న‌తోనే స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. క‌విత న్యాయ పోరాటానికి దిగ‌డం, 24వ తేదీ విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు చెప్పిన నేప‌థ్యంలో, అంత‌కు ముందే క‌విత‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఈడీ దిగొచ్చ‌ని స‌మాచారం.

మ‌రోవైపు సుప్రీంకోర్టు ఈడీ విచార‌ణ‌పై స్టే ఇవ్వ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. దీన్నే అవ‌కాశం తీసుకుని ఈడీ దూకుడు ప్ర‌దర్శించే అవ‌కాశాలు లేకపోలేదు. మ‌రోవైపు తాజా ప‌రిణామాలు బీఆర్ఎస్‌లో ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌విత విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న నేప‌థ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్ల‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. కవిత విష‌యంలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌న్న‌ది వాస్త‌వం. 

Show comments