విశ్వాసం కోల్పోయాక.. ఇవన్నీ దండగే!

ఒక పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే.. ఏం చేయాలి? ప్రజల్లో నమ్మకాన్ని నిర్మించుకోవాలి. అంతే తప్ప.. జేబులో డబ్బులున్నాయ్ కదాని పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటే సరిపోతుందా? విజయం వరిస్తుందా? ఈ విచక్షణ భాజపా నాయకులకు లోపించినట్లుగా కనిపిస్తోంది. ప్రజలకు ఎంతోకొంత మంచిచేసి... ఎన్నికల్లో వారి ముందుకు వస్తే ప్రజలు కూడా కాస్త ఆలోచిస్తారు. ఎంతో కొంత నమ్ముతారు. అలాకాకుండా వారికి ఇచ్చిన హామీలను, చేసిన ప్రమాణాలను తుంగలో తొక్కి, తగుదునమ్మా అంటూ ఎన్నికల బరిలోకి దిగితే... ప్రజలు కూడా అలాంటి వారిని ఎందుకు ఆదరిస్తారు? ప్రస్తుతం ఏపీలో భాజపా ఇదే పరిస్థితిలో ఉంది.

నవ్యాంధ్రలో భాజపా రాష్ర్ట కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం కేంద్రం హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతులమీదుగా జరగనుంది. అయితే కొత్త రాష్ర్టంలో పార్టీ నూతన కార్యాలయాన్ని నిర్మించినంత మాత్రాన, ప్రజల్లో భాజపా వర్గాలు ఏమాత్రం నమ్మకాన్ని కలిగించగలవో అర్థం కావడంలేదు. మంగళవారం రోజున రాజ్ నాధ్ సింగ్ డిజిటల్ పద్ధతిలో కార్యాలయానికి శంకుస్థాపన చేస్తే, మరునాడు భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భూమిపూజ చేసి పనులు ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీని  భాజపా జాతీయ నాయకత్వం ఎంత తీసికట్టుగా భావిస్తున్నదో తెలుసుకోవడానికి ఇదే తార్కాణం. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి వచ్చే ఖాళీ కూడా వారికి లేదనుకుంటే పొరబాటు. నిజం చెప్పాలంటే.. ఏపీకి రాగల దమ్ము వారికిలేదు. అందుకు వారికి మొహం చెల్లడంలేదు.

డబ్బు ఉందికదా అని ఎకరానికిపైగా భూమిలో పార్టీ ఆఫీసు కడితే ప్రజలు పార్టీని నమ్ముతారా? దీనివల్ల ఎన్నికల్లో ఏమైనా ఓట్లు పడతాయా అనే విషయాన్ని గురించి భాజపా ఆలోచించాల్సివుంది. రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆపార్టీకన్నా తాము ఏమేరకు ప్రజలకు మేలు చేయగలమనే విషయాన్ని భాజపా ప్రజలకు తెలియజేయాల్సివుంది.

తాము అధికారంలోకి వస్తే వారికి ఏవిధమైన మేలు చేస్తామనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి,,. ఆ మేరకు వారిని నమ్మించడం మానేసి పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నారు. ఇచ్చిన ప్రమాణాల్ని నిలబెట్టుకోవడం గాలికొదిలేశారు. భాజపా ఏపీ నాయకులు.. పార్టీ ఆఫీసును నిర్మించగలరు గానీ.. పార్టీని నిర్మించలేరని వారు తెలుసుకోవాలి.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments