సినిమా రివ్యూ: ఓ బేబి

సమీక్ష: ఓ బేబి
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్‌ పిక్చర్స్‌
తారాగణం: సమంత అక్కినేని, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్‌, నాగశౌర్య, జగపతిబాబు, రావు రమేష్‌, అడివి శేష్‌, తేజ సజ్జా, సునయన, ఊర్వశి, ప్రగతి, ఐశ్వర్య తదితరులు
మాటలు: లక్ష్మీ భూపాల్‌
కూర్పు: జునైద్‌ సిద్ధికీ
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌
నిర్మాతలు: సురేష్‌ బాబు, సునీత తాటి, టి.జి. విశ్వప్రసాద్‌, హ్యున్వూ థామస్‌ కిమ్‌
దర్శకత్వం: నందిని రెడ్డి
విడుదల తేదీ: జులై 05, 2019

జీవితాన్ని మళ్లీ బ్రతికే అవకాశమొస్తే...? ఈ ఆలోచన చాలామందికి చాలాసార్లు వచ్చి వుండొచ్చు. ఇదే ఆలోచనలోంచి పుట్టిందే 'మిస్‌ గ్రానీ' అనే కొరియన్‌ సినిమా కథ కూడా. జీవితంలో కోల్పోయిన ఆనందాల గురించి బాధ పడుతూ చుట్టూ వున్న సంతోషాలని గుర్తించలేని వ్యక్తుల కథలు కొన్నిసార్లు సినిమాలయ్యాయి. అయితే అదే కథకి కాస్త ఫాంటసీని జోడించి కొరియన్‌ రచయితలు, దర్శకుడు తెరకెక్కించిన 'మిస్‌ గ్రానీ' మానవ సంబంధాలని హృద్యంగా, వినోదభరితంగా చూపిస్తుంది. అందుకే ఈ కథ భాషలకి, దేశాలకి అతీతంగా పలు భాషలలోకి రీమేక్‌ అయి అందరినీ మెప్పిస్తోంది. తెలుగులోకి రీమేక్‌ అయిన 'మిస్‌ గ్రానీ'కి నందిని రెడ్డి చేసిన మార్పు చేర్పులు పెద్దగా లేకపోయినా ఈ కథ, ఆ ఎమోషన్స్‌ మనసుని స్పృశిస్తాయి. చూడ్డానికి సింపుల్‌ సెట్టింగ్‌లానే అనిపించినా కానీ డెబ్బయ్‌ ఏళ్ల బామ్మ... ఇరవై నాలుగేళ్ల యువతిగా మారే కాన్సెప్ట్‌ లీడ్‌ రోల్‌ చేసిన సమంతకి పెద్ద పరీక్షే పెట్టింది.

సమంత మంచి నటి అనేది ఇదివరకే పలు చిత్రాల్లో తెలిసింది. అయితే ఓ బేబీ ఆమెకి అతి పెద్ద సవాల్‌ విసిరింది. ఇరవై నాలుగేళ్ల యువతిగా కనిపించడం కష్టం కాదు.. డెబ్బయ్‌ ఏళ్ల బామ్మలా అనిపించడం, అందుకు తగ్గ హావభావాలు, నడవడిక చూపించడం ఎంతటి నటికయినా క్లిష్టమైన పరీక్షే అవుతుంది. కానీ సమంత తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది. ఎంతగా అంటే... ఆరంభంలో 'బేబి' పాత్రని పరిచయం చేసి వెళ్లిన లక్ష్మి నిజంగా పడుచు ప్రాయంలో ఇలాగే వుండేదా అనిపించేంత గొప్పగా 'సావిత్రి' అలియాస్‌ 'స్వాతి'గా సమంత మెప్పించింది. లీడ్‌ క్యారెక్టర్‌ చేసిన ఎవరు కాస్త తడబడినా కానీ ఈ ఫాంటసీ రక్తి కట్టే అవకాశం లేదు. లక్ష్మి, సమంత లాంటి యాక్టర్లకి ఆ క్యారెక్టర్‌ దక్కడంతో 'ఓ బేబీ' ఏ దశలోను కల్పిత కథలా అనిపించకుండా తెరపై నిజంగా జీవితమే ఆవిష్కృతం అవుతోన్న భావన కలిగించింది.

ఆరంభంలో ఫ్యామిలీ డ్రామా చక్కని బేస్‌ సెట్‌ చేయగా, ఒక్కసారి సమంత రాకతో ఓ బేబీ స్వరూపమే మారిపోయింది. డెబ్బయ్‌ ఏళ్ల బామ్మ... ఇరవై నాలుగేళ్ల యువతిగా మారిన వైనంలోంచే బోలెడంత వినోదం పండింది. ఇక ఆ పాత్ర తన వాళ్లతో ఇంటరాక్ట్‌ అయ్యే సీన్లు, తను ఎవరో తెలియక తన ముందు తనవాళ్లు చేసే పనులకి ఆమె రియాక్ట్‌ అయ్యే సందర్భాలు, కొడుకుని చూడగానే... తన ప్రస్తుత రూపం గురించి మరచిపోయి కుర్చీలోంచి ఎగిరి దూకేసే తల్లి మనసుని చూపించే సన్నివేశాలు... ఒకటేమిటి 'బేబీ' జర్నీ రసవత్తరంగా అనిపిస్తుంది. బేబీ లోకంలో పడి సమయం మరచిపోయి ఇంటర్వెల్‌ పడితే కానీ గంటకి పైగా సమయం తెలియకుండా గడిచిపోయిన సంగతి కూడా గుర్తించలేదు మది.

బేబీ ఒకసారి గాయని కావాలనే తన కలతో పాటు తన మనవడి కలని కూడా తీర్చే పనిలో పడ్డప్పుడు, ఆమె ప్రస్తుత రూపంతో ప్రేమలో పడిన ఓ యువకుడు, తనకి దొరికిన కొత్త జీవితానికి గీత ఎక్కడా గీయాలో తెలియని అయోమయంలో బేబి చిక్కుకున్నప్పుడు అంతవరకు సాఫీగా సాగిన కథనం భారమనిపిస్తుంది. సన్నివేశాలు భారంగా ముందుకి కదలడంతో పాటు అనేక విషయాలపైకి (రాజేంద్రప్రసాద్‌తో సమంత ఈక్వేషన్‌, అతని కూతురి రియాక్షన్‌ లాంటి అనవసర విషయాలు) ఫోకస్‌ షిఫ్ట్‌ అవుతూ వుండడంతో పాటు సంగీత ప్రధానంగా సాగుతోన్న చిత్రంలో ఒక్క పాట కూడా ఆకట్టుకోకపోవడం బేబి ఇస్తోన్న ఫన్‌ని దాదాపు హరించినంత పని చేసాయి. కానీ సమంత ఎక్కడా తడబడకపోవడం, దాదాపు ద్వితియార్థం అంతా ఆమె కనిపించడం వల్ల కొన్ని బలహీనతలు కవర్‌ అయ్యాయి.

రాజేంద్రప్రసాద్‌, నాగశౌర్యలతో సమంత సన్నివేశాలు హిట్‌ ఆర్‌ మిస్‌లా వున్నా కానీ తల్లీ కొడుకుల అనుబంధాన్ని హైలైట్‌ చేసే సన్నివేశాలన్నీ బుల్స్‌ ఐని కొట్టాయి. అమ్మ లేనపుడు ఆ లోటు ఎంతగా తెలుస్తుందనే రావు రమేష్‌ సన్నివేశం గుండెని మెలితిప్పి వదిలితే... 'నీ బతుకు నువ్వు బతుకమ్మా... నీ కోసం నువ్వు బతుకమ్మా' అంటూ వారిద్దరి మధ్య జరిగే కాన్‌ఫ్రంటేషన్‌ కంటతడి పెట్టిస్తుంది. అవసరానికి మించిన రన్‌ టైమ్‌, బ్యాడ్‌ మ్యూజిక్‌, కొన్ని ఫోర్స్‌డ్‌ ఎమోషన్స్‌ బేబిని ఇబ్బంది పెట్టినా కానీ కీలకమైన సమయాల్లో పండిన ఎమోషన్స్‌తో పాటు సమంత అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ బేబిని జనరంజకంగా మార్చింది.

సమంత పెళ్లి తర్వాత కమర్షియల్‌ చిత్రాలకి దూరం కావడం అటు నటిగా ఆమెతో పాటు ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులకి కూడా అదృష్టంగా మారింది. కమర్షియల్‌ ఫార్ములాకి అతీతంగా తన పొటెన్షియల్‌ తెలియజేసే కథలని ఆమె ఎంచుకుంటోంది. ఓ బేబీలో ఆమె పర్‌ఫార్మెన్స్‌ తన కెరీర్‌లో ఒక మరపురానిది నిలిచిపోతుంది. అంతా సమంత అయి నడిపించిన ఈ చిత్రంలో సహాయ తారాగణం కూడా తమ వంతు సాయం చేసింది. లక్ష్మీ, రాజేంద్రప్రసాద్‌, నాగశౌర్య, రావు రమేష్‌ల అభినయం ఈ చిత్రానికి అదనపు బలమయింది.

తెరవెనుక మిగతా అన్ని విభాగాలు మంచి అవుట్‌పుట్‌ ఇచ్చినా కానీ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ ఆకట్టుకునే బాణీలు ఇవ్వడంలో విఫలమయ్యాడు. కొరియన్‌ చిత్రంలోని ఆత్మని క్యాచ్‌ చేసి, ఎమోషన్స్‌ని అద్భుతంగా మళ్లీ పండించగలిగిన దర్శకురాలు నందిని రెడ్డి తన టాలెంట్‌ని మరోసారి నిరూపించుకుంది. హాయిగా నవ్వించి, అలాగే కాస్త ఏడిపించే ఏ సినిమా అయినా సక్సెస్‌ అయినట్టే. చిన్నపాటి లోపాలున్నా కానీ బేబీతో కావాల్సినంత కాలక్షేపమయితే గ్యారెంటీ.

బాటమ్‌ లైన్‌: ఓ బేబీ... సమంత షో ఇది!
-గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: కల్కి       సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా

Show comments