ఓదేలు బలి బాల్క కోసం కాదు... మరి?

సీట్లు దక్కించుకోగలిగిన ఇతర సిటింగు ఎమ్మెల్యేలతో పోల్చినప్పుడు... చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మరీ టికెట్ నిరాకరించవలసినంత అవినీతిపరుడు గానీ, అసమర్థుడు గానీ కాదనేది తెరాస పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి కేసీఆర్.. అంత నిర్దాక్షిణ్యంగా ఎందుకు ఆయనను పక్కనపెట్టారు? అనేది ఎవ్వరికీ అర్థంకాని సంగతి. నిజానికి నల్లాల ఓదేలు మీద సహచర తెరాస ఎమ్మెల్యేలకు కూడా సదాభిప్రాయమే ఉంది. ప్రస్తుతం సానుభూతి కూడా ఉంది. అయితే పార్టీలోని అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. నల్లాల ఓదేలుకు టికెట్ దక్కకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం పార్లమెంటులో ఎంపీగా ఉన్న బాల్క సుమన్ ను, ఓదేలు స్థానంలో చెన్నూరు అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ నిర్ణయం వల్ల బాల్క కోసమే ఓదేలుపై వేటు పడిందని అనుకుంటే పొరబాటే. ఎందుకంటే బాల్క సుమన్ ఎటూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది గనుక. అదే సమయంలో.. ఓదేలుపై వేటు తప్పనిసరి అని.. ప్రత్యామ్నాయం లేక బలవంతంగా బాల్క సుమన్ ను తీసుకొచ్చి ఇక్కడ బరిలో దింపుతున్నారని కూడా కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇవేవీ నిజంకాదని తెలుస్తోంది.

విషయం ఏంటంటే.. తెరవెనుక మూడో వ్యక్తి కూడా ఉన్నారు.. ఆయనే మాజీ ఎంపీ జి.వివేక్. 2019లో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా జి.వివేక్ పోటీచేయాలని ముచ్చటపడుతున్నారు. అయితే ఆయనకు కేటాయించడానికి ప్రస్తుతం నియోజకవర్గం ఖాళీగా లేదు. ఆయన సొంత సీటు అయిన పెద్దపల్లిలో బాల్క సుమన్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు.

జి.వివేక్ కు అవకాశం కల్పించాలంటే.. బాల్క సుమన్ ను అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. కాకపోతే ఆయన సిటింగు ఎంపీ గనుక.. ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలోకి దించితే.. ఆయన అడ్డు తొలగుతుంది. ఆ రకంగా వచ్చే ఎంపీ ఎన్నికల్లో జి. వివేక్ కు లైన్ క్లియర్ అవుతుంది.

ఇలాంటి వ్యూహంతోనే.. బాల్కసుమన్ ను ఎమ్మెల్యేగా దింపడానికి.. నల్లాల ఓదేలును బలిచేశారని పార్టీలో చెప్పుకుంటున్నారు.

RELATED ఐక్యరాజ్యసమితిలో ఆవు కథ చెప్పిన చంద్రబాబు