ఓ కొండను తవ్వి... ఓ కొండను దువ్వి...!

చినరాజప్ప హయాంలో అక్రమాలు
పెద్దాపురం కేంద్రంగా చెలరేగిన గ్రావెల్‌ మాఫియా
వైకాపా వ్యూహంపై జనంలో చర్చ

మాజీ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సహకారంతో గత టీడీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన మట్టిమాఫియా ఇపుడు ఆజ్ఞాతవాసంలో ఉంది. మాఫియా జాడ కాగడాపట్టి గాలించినా కానరావడం లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్దాపురం నియోజకవర్గం కేంద్రంగా గ్రావెల్‌, మట్టి మాఫియా చెలరేగిపోయింది. చినరాజప్ప అండ దండలతో బరితేగించి కొండలనే పిండిచేసి కోట్లు గడిచిందన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి.

పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్టు అప్పట్లో చినరాజప్ప మంత్రి హోదాలో పదే పదే చెప్పుకున్నారు. అయితే తన నియోజకవర్గం పరిధిలో మట్టి మాఫియా చెలరేగిపోయినా పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. మాఫియా జోలికి అధికారులను వెళ్ళకుండా చేసి అక్రమ గ్రావెల్‌, మట్టి తవ్వకాలకు రాచబాట వేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పెద్దాపురం పట్టణానికి సమీపంలోని రామేశంపేట మెట్టకు చినరాజప్ప హయాంలో అక్రమార్కులు తవ్విపారేశారు.

రామేశంపేట మెట్టను చట్టవిరుద్ధంగా తవ్వి కోట్ల విలువచేసే మట్టి, గ్రావెల్‌ను మాఫియా తరలించింది. రేయింబవళ్ళు వేలకొద్ది లారీల్లో ఇక్కడి మట్టిని తరలించి కోట్లు దండుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ అవసరాలకు, ఇళ్ళస్థలాల నుండి కర్మాగారాల స్థలాలను లెవెలింగ్‌ చేసేందుకు ఇక్కడి మట్టిని తరలించారు. చినరాజప్ప సహకరంతో మాఫియా పెద్దఎత్తున ఇక్కడి మట్టిని స్థానిక, స్థానికేతర ప్రాంతాల్లో కావల్సిన వారికి విక్రయించారు. ఈ అక్రమ మట్టి తవ్వకాల వ్యవహారంలో గత ఐదేళ్ళలో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్టు తెలుస్తోంది.

అప్పటి ప్రజా ప్రతినిధులు, అధికారులకు వాటాలందినట్టు చెప్పుకున్నారు. హోంమంత్రితో సన్నిహితంగా మెలిగిన కొంతమంది బడాబాబులు ఆధ్వర్యంలో మట్టి మాఫియా నడిచింది. మరోవైపు రామేశంపేటలో అక్రమ తవ్వకాలను నిరసిస్తూ ప్రజా సంఘాలు అనేక పోరాటాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కమ్యూనిస్ట్‌ పార్టీల నాయకులు రామేశంపేట తవ్వకాలను నిరసిస్తూ జిల్లాస్థాయిలో చేసిన పోరాటాలనూ పోలీసులచే అణచివేయించడం గమనార్హం!

ఇదిలావుంటే పెద్దాపురంలో అభివృద్ధి పేరుతో ఇక్కడి పాండవుల మెట్టను పర్యాటకపరంగా తీర్చిదిద్దేందుకు చినరాజప్ప కృషిచేశారు. శతాబ్ది పార్క్‌ పేరుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. పిల్లల ఆట స్థలాలు, జలపాతాలు, ట్రైన్‌ విహారం, కేంటిన్లు, వాటర్‌ పౌంటేన్లు వంటివి ఏర్పాటు చేశారు. కొండ దిగువన బోట్‌ క్లబ్‌ను తీర్చిదిద్దారు. అన్ని హంగులతో పాండవుల మెట్ట ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. ఈ కొండను చూపిస్తూ తాము అభివృద్ధి కార్యక్రమాలు సైతం చేపట్టినట్టు గత ఎన్నికల్లో చినరాజప్ప అనుచరులు ప్రచారం చేసుకున్నారు.

కాగా గ్రావెల్‌, మట్టి తవ్వకాలు సహా మైనింగ్‌, ఇసుక మాఫియాకూ గత ఐదేళ్ళలో తూర్పు గోదావరి జిల్లాలో అడ్డులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకునే చర్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీ హయాంలో జరిగిన అక్రమ గ్రావెల్‌, మట్టి తవ్వకాలపై విచారణ జరిపిస్తే అనేక వాస్తవాలు వెలుగుచూస్తాయని పలువురు సూచిస్తున్నారు. అవినీతి రహితపాలన అందిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌ ఇటువంటి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని జనం డిమాండ్‌ చేస్తున్నారు.

ఇసుక అక్రమ తవ్వకాలు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అక్రమ గ్రావెల్‌, మట్టి, మైనింగ్‌ తవ్వకాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?

Show comments