ఎన్టీఆర్‌ని చూడండి.. చూపించండి

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితచరిత్ర గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందాలంటే ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మించిన 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' చూడాలట. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు ఇలాగే ఆదేశించారు మరి.! 'కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారు.. ఆ కుట్రల్ని తిప్పికొట్టాలి..' అంటూ పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు కూడా ఇచ్చేశారండోయ్‌. ఆ వక్రీకరించిన చరిత్ర.. అని చంద్రబాబు ఎవరి గురించి చెబుతున్నారో తెలుసుకదా.!

చంద్రబాబు ఆవేదన, ఆవేశం అంతా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా గురించే. అయితే ఆ ఆవేదన, ఆవేశం, ఆగ్రహం తనను ఆ సినిమాలో నెగెటివ్‌గా చూపించడమే తప్ప, ఎన్టీఆర్‌ మీద ప్రేమకాదని చంద్రబాబుకీ తెలుసు. నిజానికి, చంద్రబాబే 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు', 'ఎన్‌టిఆర్‌ మహానాయకుడు' సినిమాలకి సంబంధించి 'పర్యవేక్షణ' చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఆ సినిమా కథ రూపొందింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

లేకపోతే, దర్శకుడు క్రిష్‌ - చంద్రబాబుతో సమావేశమవడమేంటి.? చంద్రబాబు పాత్ర పోషిస్తోన్న రాణా, చంద్రబాబుని కలిసి సలహాల్ని స్వీకరించడమేంటి.? చరిత్ర ఏంటి.? ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ పేరుతో బాలకృష్ణ చూపిస్తున్నదేంటి.? అన్నదానిపై జనానికి ఓ క్లారిటీవుంది. రేప్పొద్దున్న వర్మ రూపొందించే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో ఎంత వాస్తవం.? ఎంత కల్పితం.? అన్నది కూడా ప్రజలే తేల్చుతారు. ఎందుకంటే, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితం తెరిచిన పుస్తకమే.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 'ఎన్టీఆర్‌ బయోపిక్‌' (బాలయ్య రూపొందించినది) తెలుగుదేశం పార్టీకి ఎంత ఉపయోగపడ్తుందన్నది పక్కనపెడితే, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' మాత్రం, తెలుగుదేశం పార్టీకి ఎంతోకొంత చేటు చేస్తుందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే ఆయన ఇంతలా ఉలిక్కిపడుతున్నారు. అయితే, స్వయంగా ఎన్టీఆర్‌ తాను వెన్నుపోటుకు గురైన వైనాన్ని చెప్పుకుంటూ కంటతడి పెట్టినా, ఆ వ్యవహారాన్ని తెరమరుగు చేయగలిగిన చంద్రబాబు, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ద్వారా ఎన్టీఆర్‌ అభిమానుల్లో ఆవేశం రగిలితే, దాన్ని చల్లార్చేయలేరా.? మరెందుకు, చంద్రబాబు అంతలా కంగారు పడుతున్నట్లు.?

'మీరు చూడండి, ఎన్టీఆర్‌ గురించి తెలుసుకోండి.. పదిమందికి సినిమా చూపించండి..' అంటూ చంద్రబాబు 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' సినిమా కోసం చేస్తోన్న పబ్లిసిటీ బాగానే వుందిగానీ, 'కథానాయకుడు' రిజల్ట్‌ చూశాక, 'మహానాయకుడి'పై ఎవరికైనా ఆశలుంటాయా.?

రాయలసీమ రైతుల పుండుపై కారం