పరువు కాపాడుకున్న జూనియర్ ఎన్టీఆర్!

కూకట్ పల్లి కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. పదిహేను రౌండ్లు ముగిసే సరికి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి  సుహాసిని మీద తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు సాధించిన మెజారిటీ 36 వేలకు పైనే! కూకట్ పల్లిలో నమోదైనదే తక్కువ పోలింగ్ పర్సెంటేజీ. అయినప్పటికీ తెరాస అభ్యర్థి ఇప్పటికే ముప్పైవేలకు పైగా మెజారిటీని సాధించాడు. చివరాఖరుకు ఈ మెజారిటీ ఏ రేంజ్ కు చేరుతుందో అనేది ఆసక్తిదాయకమైన అంశం.

అంతవరకూ జనాలకు ఏ మాత్రం పరిచయం లేని నందమూరి సుహాసినిని అక్కడ రంగంలోకి దించి చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబానికి మరో దెబ్బకొట్టాడు. కామ్ గా ఉన్న వాళ్లను  కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ల పరువును తీశాడు.

నందమూరి వారిని చంద్రబాబు అంతగా ఉద్ధరించాలని అనుకుంటే వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వొచ్చు. తన తనయుడిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేసుకున్నట్టుగా నందమూరి వారసులనూ బాబు ఆదరించవచ్చు. అయితే అలా చేస్తే అక్కడ ఉన్నది చంద్రబాబు ఎందుకవుతాడు?

చంద్రబాబు ఇలాగే చేస్తాడు. బాబు చేతిలో చిత్తవ్వడం నందమూరి కుటుంబానికి కొత్త ఏమీకాదు. అందుకు సంబంధించిన తాజా కరివేపాకు నందమూరి సుహాసిని. ఇక మళ్లీ భవిష్యత్తు రాజకీయంలో ఈమె పేరు వినపడకపోవచ్చు. వాడేశాకా.. మళ్లీ వాడుకోవడానికి కరివేపాకుల్లో ఏమి ఉంటుంది?

అయితే ఈసారి నందమూరి కుటుంబాన్ని ఒక విషయంలో అభినందించవచ్చు. చంద్రబాబు నాయుడు సుహాసినికి టికెట్ ఇచ్చేశాడని.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ప్రచారానికి రాలేదు. లోలోపల ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రచారానికి అయితే తారక్ రాలేదు.

చంద్రబాబు నాయుడు పిలిచాడని అయినా తారక్ రానని స్పష్టం చేశాడని వార్తలు వస్తున్నాయి. బాబు పిలిచాడా, సుహాసినిని బరిలోకి దింపాడు కాబట్టి.. ఖాయంగా తారక్ వచ్చి తీరతాడని బాబు లెక్కలేశాడా.. అనేది తర్వాతి సంగతి. తారక్ అయితే ప్రచారానికి రాలేదు.

ఒకవేళ జూనియర్ ప్రచారానికి వచ్చి ఇళ్లిళ్లు తిరిగి ఉండినా.. కూకట్ పల్లి ఫలితం మారేది కాదు. టీడీపీకి వేసే కమ్మ వాళ్లు ఎలాగూ వేశారు. వేయకూడదని ఫిక్స్ అయిన వాళ్లు తారక్ వచ్చి ప్రచారం చేసినా వేసేవాళ్లు కాదు. తెరాస మెజారిటీ నంబర్ లో కూడా పెద్ద తేడా ఉండేది కాదు. 

అప్పుడే తారక్ బఫూన్ అయిపోయావాడు. అయితే ఎక్కడో కాస్త తెలివితేటలు  కలిగి.. కూకట్ పల్లికి ప్రచారానికి రాకుండా జూనియర్ ఎన్టీఆర్ తన పరువు పోకుండా చూసుకున్నాడు. ఈ తత్వాన్ని ఒంటపట్టించుకోని బాలయ్య కూకట్ పల్లి వెళ్లి అన్ని రకాలుగానూ నవ్వుల పాలయ్యాడు. అదీ కథ.

Show comments