మరోసారి త్రివిక్రమ్ కే క్రెడిట్ ఇచ్చిన ఎన్టీఆర్

అరవింద సమేత విడుదలకు ముందు ఇది తన సినిమా కాదన్నాడు ఎన్టీఆర్. ఇది పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ తో వస్తున్న సినిమా అని, అందులో తను నటించానని మాత్రమే చెప్పుకొచ్చాడు. ఆ టైమ్ లో ఎన్టీఆర్ అలా మాట్లాడినప్పుడు చాలామంది డౌట్స్ లేవనెత్తారు. అయితే సినిమా విడుదలైన తర్వాత కూడా ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్ కే ఆ క్రెడిట్ ఇచ్చాడు.

"నేను ఉండడం వల్లనే అరవింద సమేత హిట్ అయిందని త్రివిక్రమ్ అన్నారు. ఈ విజయం ఆయనది కాదని నా ఖాతాలో వేశారు. అది తప్పు. ఎందుకు తప్పని అంటున్నానంటే.. ప్రతి ఒక్కరికి త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుందంటే ఒక రకమైన ఆసక్తి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు త్రివిక్రమ్. మిమ్మల్ని (త్రివిక్రమ్) చూసి మేం బయల్దేరాం స్వామి. అరవింద సమేత విజయం మీ జర్నీలో భాగం. ఆ ప్రయాణంలో మేమంతా కలిశాం. ఇది ముమ్మాటికీ త్రివిక్రమ్ సినిమా. అతని విజయం."

ఇలా అరవింద సమేత విజయాన్ని త్రివిక్రమ్ ఖాతాలో వేశాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ తనకు 12 ఏళ్ల నుంచి తెలుసంటున్న ఎన్టీఆర్, అతడ్ని కేవలం తను ఓ స్నేహితుడిగా మాత్రమే చూడలేదని.. ఓ గురువుగా కూడా భావించానని అంటున్నాడు. 

"చాలా చిత్రాల్లో ఎమోషనల్ గా నేను నటించాను. కానీ ప్రతి ఎమోషన్ ను డ్రైవ్ చేసేది దర్సకుడే. ఓ నటుడికి మొదటి ప్రేక్షకుడు దర్శకుడే. అరవింద సమేత ఓపెనింగ్ సీన్ లో ఓ సన్నివేశం వద్ద ఎలా నటించాలో నాకు తెలియలేదు. నాకు దారి చూపించమని అడిగాను. ఆ రోజు త్రివిక్రమ్ నాకు ఇచ్చిన సమాచారం, నటుడిగా నాకు ఎంతో ఉపయోగపడింది."

ఈరోజు హైదరాబాద్ లో అరవింద సమేత సక్సెస్ మీట్ జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ కు సంబంధించి ఎన్టీఆర్ పాల్గొన్న ఆఖరి కార్యక్రమం ఇదే. కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లబోతున్నాడు ఎన్టీఆర్. తిరిగొచ్చి రాజమౌళి సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడు.

అరవింద సమేత ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments