ఎన్టీఆర్ బయోపిక్ పై సెంటిమెంట్ కార్డు?

ఎలాంటి సినిమా తీసినా, ఎలా తీసినా, ఎలాంటి బజ్ వున్నా, సోలో రిలీజ్ అనేదాని కోసం, సరైన పోటీలేకుండా విడుదల కావాలనే చూసుకుంటాయి. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా లోలోపల దాని కోసం ప్రయత్నాలు జరుపుతూనే వుంటారు. లేటెస్ట్ గా రాబోయే సంక్రాంతికి షెడ్యూలు అయిన ఎన్టీఆర్ బయోపిక్ కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ బాద్యతను తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు సన్నిహితుడు అయిన దగ్గుబాటి సురేష్ బాబు మీద వేసినట్లు తెలుస్తోంది. ఆయనకు ఈ సినిమతో మరో లింక్ కూడా వుంది. ఆయన కొడుకు రానా ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కూడా.

ఇప్పటికే వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుని డిసెంబర్ లోకి వచ్చేసాయి. ఇంక రెండు సినిమాలు పోటీగా వున్నాయి ఎన్టీఆర్ బయోపిక్ కు. ఒకటి డివివి దానయ్య-రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో తయారవుతున్న భారీ సినిమా సంక్రాంతికి విడుదల అని ఎప్పుడో ప్రకటించారు. 

అలాగే దిల్ రాజు-అనిల్ రావిపూడి-వెంకీ-వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 కూడా సంక్రాంతికే విడుదల వుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల డేట్ లు మార్పించాలనే ప్రయత్నం ప్రారంభమయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఓ సెంటిమెంట్ కార్డ్ వాడబోతున్నారట. ఎన్టీఆర్ అంటే టాలీవుడ్ మూల పురుషుల్లో ఒకరు. అలాంటి మహానుభావుడి బయోపిక్ సినిమాకు ఎటువంటి పోటీ పెట్టకుండా వుండడం అన్నది ఆయనకు మనం ఇచ్చే సరైన నివాళి, గౌరవం అనే సెంటిమెంట్ కార్డ్ ను వాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

ఎఫ్ 2 సినిమాలో వెంకీ వున్నాడు. దిల్ రాజకు నైజాంలో థియేటర్లు కావాలి. ఇక్కడే ఆయనపై ప్రెజర్ వస్తోందని. కానీ దానికి ఆయన ఇప్పటికే, కుదరదని క్లారిటీ ఇచ్చేసారని తెలుస్తోంది. మరోపక్క బోయపాటి ద్వారా ఆ రామ్ చరణ్ సినిమా మీద కూడా ప్రెజర్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి, ఆ సినిమా టోటల్ రైట్స్ ను 70 కోట్లకు కొన్న యువి క్రియేషన్స్ సంస్థ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. ఆ సినిమా సంక్రాంతికి రాకపోతే, తాము ముందు అనుకున్నట్లు 70 కోట్లు ఇచ్చి, సినిమాను తీసుకోమని ఇప్పటికే నిర్మాత దానయ్యకు క్లారిటీగా చెప్పేసినట్లు తెలుస్తోంది.

దీంతో మిగిలిన వ్యవహారాలు ఎలా వున్నా, ఇటు రామ్ చరణ్ సినిమాకు, ఎఫ్ 2 సినిమాకు థియేటర్ల బుకింగ్ లు మాత్రం చాపకింద నీరులా సాగిపోతోంది. నైజాంలో మాత్రం ఆసియన్ సునీల్ థియేటర్లు ఇవ్వడానికి ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని, ఆయన ఎన్టీఆర్ సినిమా సోలో విడుదల వైపే మొగ్గుతున్నారని తెలుస్తోంది.

మరి ఈ వ్యవహారాన్ని దగ్గుబాటి సురేష్ బాబు ఎలా తెలివిగా డీల్ చేస్తారో చూడాలి? ఆయన సంగతి, ఆయన స్టయిల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలిసిన వారు, ఏదో విధంగా తెరవెనుక మంత్రాంగం చేసి, ఎన్టీఆర్ బయోపిక్ కు సోలో రూట్ సుగమం చేస్తారని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు ఎన్టీఆర్ బయోపిక్ కు సూపర్ ఆఫర్లు వస్తున్నాయని గ్యాసిప్ లే తప్ప, బిజినెస్ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ఈ డేట్ సంగతి తేలితే జనాలు కొనేందుకు పోటీ పడతారేమో?

Show comments