ఎమ్బీయస్‌: 14. ఎన్టీయార్‌కు ముందు రాష్ట్రరాజకీయాలు

రాజకీయాలలో గతానుభవం లేకపోయినా పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చేయడం ఎన్టీయార్‌కి ఎలా సాధ్యమైంది? అనే ప్రశ్నకు సమాధానంగా 'అప్పట్లో కాంగ్రెసు పూర్తిగా కుళ్లిపోయింది, ప్రజలకు మొహం మొత్తేసింది. రాజకీయ శూన్యత ఏర్పడింది. దాన్ని ఎన్టీయార్‌ భర్తీ చేశారు. ఆ స్థానంలో ఏ ఎల్లయ్య, పుల్లయ్య ఉన్నా గెలిచేసేవారు' అనేస్తారు కొందరు. తర్వాతి రోజుల్లో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి అనుకున్నంత విజయాన్ని అందుకోలేక పోవడానికి, యిప్పుడు పవన్‌ కళ్యాణ్‌ యింకా పుంజుకోలేకపోవడానికి ఈ వాదనను వాడుకుంటారు. వీళ్లు వచ్చేసరికి రాజకీయ శూన్యత లేదు కాబట్టి ఫలితం దక్కటం లేదంటారు. ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వచ్చేసరికి రాజకీయ శూన్యత ఉందా, కాంగ్రెసుది మరీ అంత అధ్వాన్న పరిస్థితా అనేది కరక్టుగా తెలుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల చరిత్ర గురించి కాస్తయినా తెలుసుకుని ఉండాలి.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయిన దగ్గర్నుంచి 1983 వరకు కాంగ్రెసే పాలిస్తూ వచ్చింది. అంతమాత్రం చేత ప్రతిపక్షాలు లేవని కానీ, వాటికి ఎన్నడూ ఓట్లు పడలేదని కానీ అనలేము. అయితే వాటి బలాబలాలు మారుతూ వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గది కమ్యూనిస్టు పార్టీ. ఈ మాట వినగానే యీనాటి యువతకు నవ్వు రావచ్చు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులేమిటి? అని. ఈ నాటి కమ్యూనిస్టు పార్టీల గతి చూస్తే అలా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఈనాడు కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి (పోనీ వైసిపి) లేదా తెరాస! కమ్యూనిస్టులనగానే ప్రతిపక్షంలో ఉన్నవాళ్లతో పొత్తు కోసం ఎగబడి తమ బలానికి పదిరెట్లు సీట్లు అడిగి, చివరకు ఒక్క సీటూ గెలవలేని విదూషకులే గుర్తుకు వస్తారు. ఆ రోజులు వేరు, అప్పటి కమ్యూనిస్టులు వేరు.

ప్రతిపక్షాల గురించి మాట్లాడేటప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటి వుంది. భారతస్వాతంత్య్ర పోరాటం కాంగ్రెసు ద్వారానే జరిగింది. అందువలన స్వాతంత్య్ర కాంక్ష ఉన్నవాళ్లందరూ ఆ పార్టీలోనే తొలుతగా చేరారు. అయితే దాని సభ్యులలో ఏకాభిప్రాయం లేదు. బ్రిటిషు వారితో సానునయంగా వ్యవహరించి తెచ్చుకోవాలని కొందరంటే, లేదు కొట్లాడి తెచ్చుకోవాలని కొందరు అనేవాళ్లు. మితవాదులు, అతివాదులు అనే చీలిక ఉండేది. దీనితో బాటు, స్వాతంత్య్రం వచ్చాక ఎటువంటి పాలన ఉండాలి అనే విషయంపై కూడా భేదాభిప్రాయాలు ఉండేవి. కొందరు కాపిటలిజం అంటే, మరి కొందరు సోషలిజం అనేవారు, యింకొందరు కమ్యూనిజం అనేవారు. కాంగ్రెసు ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న కొద్దీ, దాన్ని తమ మార్గానికి మళ్లించాలని వీరు ప్రయత్నించేవారు. కుదరకపోతే కాంగ్రెసులోంచి బయటకు వెళ్లిపోయేవారు. కొన్నాళ్లకు కాంగ్రెసు తన విధానాన్ని తమ ఆలోచనకు అనుకూలంగా మార్చుకుందని అనుకున్నపుడు మళ్లీ వచ్చి చేరేవారు. ఇవన్నీ చాలనట్లు వ్యక్తిగత అహంకారాలు, పదవీవ్యామోహాలు, పట్టుదలల కారణంగా పార్టీలు మారినవాళ్లున్నారు.

బ్రిటిషు హయాంలో రాజకీయ వ్యవహారాలు భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉండేవి. కాంగ్రెసు కారణంగా సాధారణ ప్రజలు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. వారు భూసంస్కరణలు తెచ్చి, సంపదను అందరికీ పంచాలని, ధనికులపై పరిమితులు విధించాలని వాదించేవారు. దాంతో జమీందార్లకు కాంగ్రెసంటే భయం పట్టుకుంది. స్వాతంత్య్రం వస్తే వినాశనమే, బ్రిటిషు అధికారం ఉంటేనే మేలు అనుకుని వాళ్లు జస్టిస్‌ పార్టీ అని పెట్టుకుని, ఎన్నికలలో కాంగ్రెసును ఓడించాలని చూసేవారు. ఉత్తరాదిన ముస్లిం జమీందార్లు ముస్లిం లీగులో చేరి, కాంగ్రెసును అడ్డుకున్నారు. కాంగ్రెసు నాయకుల్లో అప్పట్లో బ్రాహ్మణులే ఎక్కువమంది ఉండేవారు. దక్షిణాదిలో బ్రాహ్మణులంటే పడని వర్గాల వారు కాంగ్రెసుకు వ్యతిరేకంగా జస్టిస్‌ పార్టీలో చేరారు. స్వాతంత్య్రం వచ్చాక దీని అస్తిత్వం పోయింది. గాంధీకి సోషలిజమంటే ఖాతరు లేదు కానీ నెహ్రూకు మక్కువ ఎక్కువ. పార్టీలో తను బలపడగానే 1956లో ఆవడి (తమిళనాడు)లో జరిగిన కాంగ్రెసు సభల్లో మన ధ్యేయం సోషలిజమే అని ప్రకటింపచేశాడు.

దాంతో పాత జస్టిస్‌ పార్టీ వారు, జమీందార్లు, మాజీ సంస్థానాధీశులు, పారిశ్రామిక వర్గాల వారు పూర్తి రైటిస్టు విధానాలతో 1959లో స్వతంత్ర పార్టీ అని పెట్టుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెసు పార్టీలో ప్రధాన నాయకుడిగా వెలిగిన గాంధీ వియ్యంకుడు రాజాజీ యీ పార్టీకి వ్యవస్థాపకుడు. వీళ్లు రైతుల సంక్షేమం కోసం శ్రమిస్తున్నాం అని చెప్పుకుంటూ ధనిక రైతులను కూడగట్టేవారు. ఇలాటి సమయంలో కాంగ్రెసుకు అండగా నిలవాలంటూ ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన కొందరు సోషలిస్టులు వెనక్కి వచ్చి కాంగ్రెసులో చేరారు. కొందరు బయటే వుండిపోయారు. ఏవో రకమైన సిద్ధాంత విభేదాలతో పార్టీని చీల్చుకున్నారు. కమ్యూనిస్టులూ అంతే, మితవాదులుగా, అతివాదులుగా చీలిపోయారు. ఈ దేశరాజకీయాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రతిబింబించాయి.

కమ్యూనిస్టులు కూడా కాంగ్రెసు ద్వారానే ఉద్యమంలోకి వచ్చారు. 1930లలో గాంధీ శాంతియుత విధానంతో స్వాతంత్య్రం రాదని, వచ్చినా అది భూస్వాములకు మేలు చేస్తుందని భావించి 1934లో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఏర్పరచారు. తెలంగాణ నిజాం పాలనలో ఉండగా కాంగ్రెసు వారు, కమ్యూనిస్టులు కలిసి ఆంధ్రమహాసభ బ్యానర్‌ కింద నిజాంను వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. 1945 తర్వాత విడిపోయారు. స్వాతంత్య్రం వచ్చాక, 1948లో నిజాంపై పోలీసు చర్య తర్వాత కాంగ్రెసు పరోక్షంగా అధికారంలోకి వచ్చేసింది. భూస్వాములంతా కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. కమ్యూనిస్టులు సాయుధ పోరాట బాట పట్టారు. అనేకమంది కార్యకర్తలను పోగొట్టుకుని 1951 సెప్టెంబరులో పోరాటాన్ని విరమించింది. ఈ పోరాటం తెలంగాణలో జరిగినా నడిపించినవారిలో ఆంధ్ర కమ్యూనిస్టులు ఎక్కువ.

1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో 140 అసెంబ్లీ స్థానాల్లో కమ్యూనిస్టులు 41 స్థానాల్లో, వారు బలపరచిన స్వతంత్రులు 8 స్థానాల్లో గెలిచారు. తెలంగాణలో 98 స్థానాల్లో కమ్యూనిస్టులు 36 చోట్ల కమ్యూనిస్టులు, వారు బలపరచిన స్వతంత్రులు గెలిచారు. తెలంగాణలో బూర్గుల నాయకత్వంలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడింది. 1953లో ఆంధ్ర విడిపోయాక మాజీ కాంగ్రెసు నాయకుడు ప్రకాశం కాంగ్రెసు మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు కానీ 13 నెలల తర్వాత అవిశ్వాస తీర్మానం కారణంగా ఓడిపోయారు. 1955లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చేస్తారని అందరూ అనుకున్నారు. వారికి వ్యతిరేకంగా అందరూ కలిశారు. చివరకు 196 స్థానాల్లో 15 వాటిల్లో మాత్రమే కమ్యూనిస్టులు గెలిచారు. కాంగ్రెసు కూడా సోషలిస్టు విధానాలను అమలు చేస్తానని అనడంతో మధ్యతరగతి ప్రజలు కమ్యూనిస్టుల కంటె కాంగ్రెసునే ఆదరించారు. బెజవాడ గోపాలరెడ్డి నాయకత్వాన కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడింది.

1956 లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1957లో తెలంగాణలో మాత్రం ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టులు 20 స్థానాల్లో మాత్రమే గెలిచారు. 1962లో రాష్ట్రమంతా ఎన్నికలు జరిగితే 51 స్థానాలు గెలిచారు. అక్కణ్నుంచి ఆ అంకె తగ్గుతూనే వచ్చింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలింది. ఆ తర్వాత నక్సలిజం వచ్చాక, లెక్కలేనన్ని ముక్కలైంది. దాంతో ఆంధ్ర రాజకీయాల్లో దాన్ని ఎవరూ పట్టించుకోవడం మానేశారు. 1978 అసెంబ్లీ ఎన్నికల పాటికి కాంగ్రెసు పార్టీ రెండుగా చీలింది - ఒకటి బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెసు, దీని తరఫున వెంగళరావు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో వర్గం ఇందిరా కాంగ్రెసు, దీని తరఫున చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ రెండూ కాకుండా 1977 ఎన్నికలలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ కూడా పోటీ చేసింది. కమ్యూనిస్టుల్లో సిపిఐ, రెడ్డి కాంగ్రెసుతో కలిసి పోటీ చేసి, 6 స్థానాలు గెలిచింది. సిపిఎం జనతాతో కలిసి పోటీ చేసి, 8 గెలిచింది.

1983 వచ్చేసరికి తెలుగుదేశం రంగంపైకి వచ్చింది. రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిసి, టిడిపితో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాయి. ఎన్టీయార్‌ కూడా స్వాగతించారు. అయితే సిపిఐ 60, సిపిఎం 30 అడగడంతో బేరం కుదరలేదు. ఎన్టీయార్‌ మేనకా గాంధీ ''సంజయ్‌ విచార్‌ మంచ్‌''కు 5 సీట్లు యిచ్చి వాళ్లతో పొత్తుతో ముందుకు వెళ్లారు. సిపిఎం 5, సిపిఐ 4 గెలిచాయి. అంటే వాళ్ల అసలు బలం అదన్నమాట. ఇప్పుడు యీ పార్టీలు పవన్‌ కళ్యాణ్‌ను ఎన్ని అడుగుతాయో, చివరకు ఏమవుతుందో తెరపై చూడాలి. కాంగ్రెసులో సోషలిస్టు భావాలున్నవారు దానిలో నుంచి బయటకు వచ్చి పార్టీలు పెట్టుకున్నారని చెప్పాను కదా. 1952 తర్వాత జాతీయ స్థాయిలో సోషలిస్టు పార్టీ, కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ కలిసి, ప్రజా సోషలిస్టు పార్టీ (పిఎస్పీ)గా ఆవిర్భవించింది. ప్రకాశం ఆ పార్టీ నాయకుడే. 1953లో కాంగ్రెసు వారు ముఖ్యమంత్రి పదవి యిస్తాననగానే ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి, కాంగ్రెసు మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు.  పిఎస్పీ ఆంధ్ర శాఖ ''ప్రజాపార్టీ'' పేరుతో విడిపోయి ప్రకాశానికి మద్దతు యిచ్చింది. మంత్రివర్గం పడిపోయి, 1955లో మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెసుతో, ఆచార్య రంగా గారి కృషిక్‌‌ లోక్‌ పార్టీతో కలిసి యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పరచి అధికారం చేజిక్కించుకుంది. 

1956లో సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక యీ రెండు పార్టీల వారిలో ఎవరికీ మంత్రి పదవి యివ్వలేదు. ప్రజాపార్టీ విడిగా మనుగడ సాగించింది కానీ ఆ పార్టీ నాయకులు తెన్నేటి విశ్వనాథం గారు ఒక్కరే గెలుస్తూ వచ్చారు. 1971 తర్వాత అసెంబ్లీలో దానికి ప్రాతినిథ్యమే లేదు. ఇక కృషికార్‌ లోక్‌ పార్టీ విషయానికి వస్తే 1959లో ఆచార్య రంగా, గౌతు లచ్చన్న స్వతంత్ర పార్టీలో చేరిపోయి ఆ పార్టీని మూసేశారు. మధ్య, ధనిక రైతులు, ఆచార్య రంగా అనుయాయులు ఆదరించిన స్వతంత్ర పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలం వెలిగింది. 1962లో 19 శాసనసభా స్థానాలను గెలుచుకుంది. 1967లో 29 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షమైంది. ఇందిరా గాంధీని పూర్తిగా వ్యతిరేకించి, పార్టీ ప్రజాదరణను కోల్పోయింది. 1971 పార్లమెంటు ఎన్నికలలో రంగా కూడా ఓడిపోయారు. మన రాష్ట్రంలో 9 స్థానాల్లో పోటీ చేసి అన్నిటా ఓడిపోయింది. దాంతో రంగా పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరిపోయారు. 1974లో స్వతంత్ర పార్టీ చరణ్‌ సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ లోకదళ్‌లో కలిసిపోయింది. ఆంధ్ర యూనిట్‌లో కొందరు కాంగ్రెసులో చేరిపోయారు. 1977లో జనతా పార్టీ ఏర్పడినపుడు తక్కినవాళ్లంతా ఆ పార్టీలో చేరారు.

సోషలిస్టు పార్టీ తరఫున పివిజి రాజు (అశోకగజపతి రాజు తండ్రి) పెద్ద లీడరుగా ఉండేవారు. 1955 ఎన్నికలలో తన జిల్లాలో 9 స్థానాలను గెలిపించుకోగలిగారు. 1959లో కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన చెన్నారెడ్డితో చేతులు కలిపారు. కొన్నాళ్లకు కాంగ్రెసులో కలిసిపోయారు. 1967లో సంయుక్త సోషలిస్టు పార్టీ తరఫున బద్రీ విశాల్‌ ఒక్కరే నెగ్గారు. జనతా పార్టీ ఏర్పడ్డాక వీళ్లంతా దానిలో చేరారు. బిజెపికి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్‌ 1962 ఎన్నికలలో 70 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కరు తప్ప తక్కినవారందరూ డిపాజిట్లు కోల్పోయారు. 1967లో మూడు అసెంబ్లీ స్థానాలు గెలిచారు కానీ 1972లో మళ్లీ ఒక్కటీ గెలవలేదు. 1977లో జనతాపార్టీ ఏర్పడినపుడు దానిలో యిది విలీనమై పోయింది.

రాష్ట్రంలో ప్రతిపక్షాల బలాబలాలు యిలా ఉంటూ వచ్చాయి. అధికార పక్షంగా ఉన్న కాంగ్రెసులో ఎప్పుడూ లుకలుకలు ఉంటూ ఉండేవి. నాయకుల మధ్య పేచీలతో కొందరు విడిగా వచ్చి పార్టీలు పెట్టడాలు, మళ్లీ కాంగ్రెసులో చేరిపోవడాలు జరుగుతూ ఉండేవి. వాటి గురించి వచ్చే వ్యాసంలో చెపుతాను. ఇక్కడ గ్రహించవలసినది ఏమిటంటే - కాంగ్రెసు పట్ల తెలుగు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా దాన్ని సరిగ్గా ఎన్‌క్యాష్‌ చేసుకోగల సత్తా ఏ ప్రతిపక్ష పార్టీకి లేకపోయింది. ఆ పని ఒక్క ఎన్టీయార్‌ వలననే సాధ్యమైంది. ఈ కొత్త పార్టీ కాంగ్రెసును ఓడించగలదు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించిన ఘనత ఆయనదే. ఆ నమ్మకాన్ని వేరెవ్వరూ కలిగించ లేకపోయారన్నది పై గణాంకాలు చూస్తే అర్థమౌతుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 02  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 03

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 04 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 05  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 06

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 07 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 08   ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 09

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 10  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 11  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 12

ఎమ్బీయస్‌:  ఎన్టీయార్‌ - 13

Show comments