ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 12

1957 నవంబరులో ''పాండురంగ మహాత్మ్యం'' విడుదలయ్యాక గురుతుల్యులైన కెవి రెడ్డి గారి దర్శకత్వంలో ఎన్టీయార్‌ తన సొంత బ్యానర్‌లో సీతారాముల కళ్యాణ గాథను సినిమాగా తీద్దామని అనుకున్నారు. కెవి సరేనన్నారు. ఎన్టీయార్‌ రాముడిగా, ఎస్వీయార్‌ రావణుడిగా నటిస్తారని కెవి ప్రకటించారు కూడా. సరిగ్గా అదే సమయంలో ఎన్టీయార్‌కు సన్నిహితుడైన దనేకుల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి వైజాగ్‌ ఆంధ్ర యూనివర్శిటీ లైబ్రరీ నుంచి ఓ పుస్తకం తెచ్చారు. శివపురాణం మొదలైన గ్రంథాల నుంచి సేకరించిన సమాచారంతో రావణకథను చెప్పారు దానిలో. దానితో ఎన్టీయార్‌కు రావణ పాత్రపై మక్కువ పెరిగి, కెవిని కలిసి తను ఆ పాత్ర వేస్తాననడంతో ససేమిరా వీల్లేదన్నారు కెవి. రాముడిగా, కృష్ణుడిగా పేరు తెచ్చుకున్న నిన్ను రాక్షసపాత్రలో చూడరన్నారు. ఎన్టీయార్‌ మొండిపట్టు పట్టడంతో కెవి తప్పుకున్నారు, ''సీతారామ కళ్యాణం'' (1961)కు ఎన్టీయార్‌ తనే దర్శకత్వం చేపట్టారు.

పులగం చిన్నారాయణ అనే జర్నలిస్టు, రచయిత రాసిన 'ఆనాటి ఆనవాళ్లు' పుస్తకంలో యిలా రాశారు. దీన్ని చూసి యిన్‌స్పయిరై కాబోలు, ఎన్టీయార్‌ బయోపిక్‌లో అది పెట్టేశారు. కానీ అదే పుస్తకంలో 6 పేజీల తర్వాత ఉంది - ''భూకైలాస్‌'' (1958)లో అందమైన రావణుడిని చూసి ప్రేక్షకులు అమితంగా ఆదరించారని, ఆ పాత్ర మీద ఎన్టీయార్‌కి మోజు తీరక యీ సినిమాలో కూడా వేశారని! 1958లో భూకైలాస్‌ రిలీజైందంటే 1957 లో షూటింగు జరిగినట్లేగా! పై సంభాషణ 1957 నవంబరులో జరిగింది. ఎన్టీయార్‌ అప్పటికే రావణ పాత్ర వేసేశాక, రాక్షస పాత్రలో నిన్ను చూడరని కెవి ఎలా అంటారు? అంటే మాత్రం ఎన్టీయార్‌ వాదించకుండా ఉంటారా?  అందువలన పై సంఘటన కేవలం కల్పితమనుకోవచ్చు. ఎన్టీయార్‌ను ఎలివేట్‌ చేసే ప్రయత్నంలో బయోపిక్‌ రచయిత తారీకులు సరిగ్గా చూసుకున్నట్లు లేదు.

''సీతారామ కళ్యాణం'' సినిమాతో ఎన్టీయార్‌ మనకొక అద్భుతమైన ఛాయాగ్రాహకుణ్ని పరిచయం చేశారు. అది కూడా మరో ఛాయాగ్రాహకుడి వ్యసనం వలన. ఎన్టీయార్‌ తన సినిమా లన్నిటికీ రహమాన్‌నే కెమెరామన్‌గా పెట్టుకునే వారు. ఈ సినిమాకీ ఆయనే. అయితే రహమాన్‌కు గుర్రపు పందాల పిచ్చి. షూటింగ్స్‌ ఎగ్గొట్టి, ఏ ఊళ్లో రేసులుంటే ఆ ఊళ్లకు వెళ్లిపోయేవారు. ''సీతారామకళ్యాణం'' ఓపెనింగ్‌ రోజు కూడా అలాగే చేశాడు. ఎన్టీయార్‌కి ఏం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా అదే సమయానికి రవికాంత్‌ ఆయన దగ్గరకు వచ్చాడు. అతను బాబూభాయ్‌ మిస్త్రీ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తూ తనకు కెమెరామన్‌గా ఛాన్సివ్వమని  చాలా రోజులుగా వెంటపడుతున్నాడు.

వెంటనే అతన్ని కారెక్కించుకుని స్టూడియోకి తీసుకెళ్లి ఆనాటి దృశ్యాన్ని షూట్‌ చేయమన్నారు. అది సంతృప్తికరంగా రావడంతో అతన్నే తన సినిమాకి కెమెరామన్‌గా ప్రకటించారు. ఆ సినిమాలో అనేక ట్రిక్‌ షాట్స్‌ను అద్భుతంగా తీశాడతను. ఇక అప్పణ్నుంచి ''వరకట్నం'' వరకు ఎన్టీయార్‌ సొంత సినిమాలన్నిటికీ అతను పనిచేశాడు. మరెన్నో సినిమాలలో కూడా తన పాటవాన్ని చూపాడు. ట్రిక్‌ ఫోటోగ్రఫీకి మారుపేరుగా వన్నెకెక్కాడు. తర్వాత హిందీ సీమకు వెళ్లి దర్శకుడిగా కూడా రాణించాడు. ''సీతారామకళ్యాణం''లో ఎన్టీయార్‌ కాంతారావుకు నారదుడిగా, శోభన్‌బాబుకి లక్ష్మణుడిగా అవకాశం యిచ్చారు. తర్వాత ఆయన ప్రోద్బలంతో ఆయన బంధువు పుండరీకాక్షయ్య తీసిన ''కృష్ణావతారం'' (1967) సినిమాలో కాంతారావుకు నారదుడిగా వేషం యిచ్చారు. అయితే ఆయన కేదో అవాంతరం వచ్చి చెప్పకుండా హైదరాబాదు వెళ్లిపోయారు.

దాంతో నిర్మాత పుండరీకాక్షయ్య ఆ పాత్రకు శోభన్‌బాబు లేదా హరనాథ్‌ను తీసుకుందామన్నారు. ఎన్టీయార్‌ శోభన్‌బాబుకి యిమ్మనమని అన్నారు. కానీ నారద పాత్ర అనగానే శోభన్‌బాబు యిష్టపడలేదు. కావాలంటే అర్జునుడు వేస్తానన్నారు. అది రామకృష్ణ కిచ్చాం, యిది నువ్వు వెయ్యి అని నిర్మాత ఒప్పించారు. మొదటి రోజు షూట్‌ తర్వాత డైరక్టరు కూడా మెచ్చుకోవడంతో శోభన్‌కు ధైర్యం వచ్చింది. ఇక అప్పటినుంచి తన పాత్ర లెంగ్త్‌ పెంచమని కోరసాగాడు. పెంచారు కూడా. కృష్ణరాయబారం సీనుకై దర్బారు సెట్టులో 15 రోజుల షూటింగు ప్లాన్‌ చేశారు. శోభన్‌బాబు 'నన్నూ యీ సీన్స్‌లో యిరికించండి' అని పోరితే మునుల పక్షాన కూర్చున్నట్లు కల్పించారు. కృష్ణుడిగా వేస్తున్న ఎన్టీయార్‌ ధృతరాష్ట్రుడితో డైలాగ్స్‌ చెప్పి కాసేపు అటూయిటూ చూసి నారదుడి వంక తిరిగి 'ఆ...ఆ... నారద మునీంద్రులు' అని డైలాగ్‌ చెప్పారు. నిజానికి ఆ డైలాగ్‌ స్క్రిప్టులో లేదు, కానీ తోటి ఆర్టిస్టును ఎలివేట్‌ చేసి, ప్రేక్షకుడి దృష్టి వారిపై పడేట్లా చేశారు ఎన్టీయార్‌.

ప్రతిభా పిక్చర్స్‌ దర్శకనిర్మాత ఘంటసాల బలరామయ్య ఎయన్నార్‌కు గాడ్‌ఫాదర్‌. నిజానికి ఎయన్నార్‌ తెర మీద కనబడినది ''ధర్మపత్ని'' (1941) ఐనా దానిలో అది నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా కనబడతాడు. ఎవరికీ గుర్తుండదు. బలరామయ్య తీసిన ''సీతారామజననం'' (1944)లో రాముడి పాత్రతో గుర్తింపు వచ్చింది. ''ముగ్గురు మరాఠీలు'' (1946)తో ప్రాముఖ్యత వస్తే, ''బాలరాజు'' (1948)తో హీరో స్టేటస్‌ వచ్చింది. ఆ తర్వాత ఆయన తీసిన ''శ్రీ లక్ష్మమ్మ కథ'' (1950) హిట్‌ సినిమా ''స్వప్నసుందరి'' (1950) లలో ఎయన్నారే హీరో. వీటి తర్వాత ''చిన్న కోడలు'' (1952) అనే సాంఘిక సినిమాలో జిఎన్‌ స్వామిని హీరోగా పెట్టి తీస్తే అది బాగా ఆడలేదు. దాంతో మళ్లీ జానపదాల వైపు మళ్లి ''రేచ్కు'' ప్లాను చేశారు.

ఎయన్నార్‌ను పిలిచి చెపితే తప్పకుండా చేస్తాను అయితే ఎవిఎం వారికి కాల్‌షీట్స్‌ యిచ్చాను. మీరు షూటింగు ఎప్పుడో చెపితే దానికి తగ్గట్టు అడ్జస్టు చేసుకుంటాను అన్నారు. ''నా యిష్టం వచ్చినపుడు షూట్‌ చేస్తాను. ముందుగా చెప్పలేను.'' అన్నారు బలరామయ్య. ''మరీ ఎప్పుడనుకుంటే అప్పుడే షూట్‌ చేయండి, కానీ అదెెప్పుడో కాస్త ముందు చెప్పండి. వేరెవ్వరికీ యివ్వకుండా ఆ డేట్స్‌ మీకే యిస్తాను.'' అన్నారు ఎయన్నార్‌. ఆయన మాటలో లాజిక్‌ ఉన్నా, తను పెంచిన మొక్క యిలా మాట్లాడడంతో బలరామయ్య అహం దెబ్బ తింది. వెంటనే ఎయన్నార్‌ను పంపించివేసి ఎన్టీయార్‌కు కబురు పెట్టారు. ప్రతిభా గురించి తెలిసిన ఎన్టీయార్‌ వెంటనే సరేననేశారు. అయితే ఆ సినిమా మూడు రీళ్లు తీశాక బలరామయ్య గుండెపోటుతో మరణించారు. పి.పుల్లయ్య గారు సినిమాను పూర్తి చేశారు. తనకు లైఫ్‌ నిచ్చిన నిర్మాత ఆఖరి చిత్రంలో ఒక దృశ్యంలోనైనా కనబడాలనే  ఉద్దేశంతో అక్కినేని ఒక అతిథి పాత్ర వేశారు. ''కన్యాశుల్కం''లో గిరీశం పాత్ర, ''చింతామణి''లో బిల్వమంగళుడి పాత్ర కూడా ఎయన్నార్‌ తిరస్కరించిన తర్వాతనే ఎన్టీయార్‌కు వచ్చాయి. ఎలాటి సంకోచం పెట్టుకోకుండా యీయన ఆమోదించారు.

''చాణక్య-చంద్రగుప్త'' సినిమాకు ఎన్టీయార్‌ మొదట అనుకున్న పేరు ''చాణక్య శపథం''. తను చాణక్యుడిగా, బాలకృష్ణ చంద్రగుప్తుడిగా చేద్దామని తీయాలని అనుకుని స్క్రిప్టు అలాగే రాయించారు. అయితే అనుకోకుండా దానిలోకి ఎయన్నార్‌ వచ్చారు. దాంతో స్క్రిప్టు మారిపోయింది. తమ మధ్య విభేదాలు సమసిపోయిన తర్వాత తన సొంత సినిమాలో ఎయన్నార్‌కు పాత్ర నివ్వాలనుకున్నారు ఎన్టీయార్‌. ''కర్ణ'' సినిమా తీస్తూ  కృష్ణుడి పాత్ర ఆఫర్‌ చేశారు. ఎయన్నార్‌ వద్దన్నారు. పోనీ కర్ణ వేస్తారా? అంటే అదీ వద్దన్నారు. మరెలా? అంటే 'మీ చాణక్య శపథంలో వేస్తా' అన్నారు ఎయన్నార్‌. 'నేను చాణక్యుడు, మీరు చంద్రగుప్తుడు వేస్తే వెరైటీగా వుంటుంది' అన్నారు ఎన్టీయార్‌. 'ఆ ప్రయోగాలు వద్దు, నేను చాణక్యుడు, మీరు చంద్రగుప్తుడు' అన్నారు ఎయన్నార్‌. అయితే స్క్రిప్టు మార్పించాలి, దానికి టైము పడుతుంది అనుకుని, ''కర్ణ''ను ముందుకు తెచ్చారు. కృష్ణ ''కురుక్షేత్రం'' తీస్తున్నారని తెలిసి 1977 సంక్రాంతి కల్లా విడుదల చేయాలన్న పట్టుదలతో 4 గంటల 7 ని.ల సినిమాను 43 రోజుల్లో షూట్‌ చేశారు. ''కర్ణ'' సూపర్‌ హిట్టయినా, అదే ఏడాది వచ్చిన ''చాణక్య చంద్రగుప్త'' అంతంత మాత్రంగానే ఆడింది. ఈ విశేషాలన్నీ పులగం చిన్నారాయణ గారి పుస్తకంలో ఉన్నాయి.

ఆయనలాగే జర్నలిస్టు, సినిమా పిఆర్‌ఓ అయిన వి.ప్రమోద్‌ కుమార్‌ ''తెర వెనుక తెలుగు సినిమా'' పుస్తకంలో ''సర్దార్‌ పాపారాయుడు'' సినిమా గురించి ఒక విశేషం రాశారు. దాసరి దర్శకత్వంలో క్రాంతికుమార్‌ నిర్మించిన ఆ సినిమాలో ఎన్టీయార్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా ఆయనకు బాగా నచ్చింది. షూటింగు చివరకు వస్తూండగా తనే నిర్మిస్తే బాగుండునని అనిపించింది. ''ఇప్పటిదాకా అయిన షూటింగుకు 40 లక్షలు యిస్తాను, పిక్చర్‌ పూర్తి చేసుకుంటాను. ఇస్తారా?'' అని నిర్మాతకు కబురు పంపారు. క్రాంతి కుమార్‌ విని నవ్వేసి ఊరుకున్నారు. మర్నాడు షెడ్యూల్‌ ఆఖరి రోజు. ఇక స్వయంగా చెప్పాలి కాబోలు అనుకుని ఎన్టీయార్‌ రేటు 4 లక్షలు పెంచి ''44 లక్షలిస్తానన్నా నిర్మాత ఏమీ చెప్పటం లేదు'' అని జోక్‌గా అన్నట్లు అన్నారు. వెంటనే క్రాంతి ''సార్‌, ఓ రెండు మూడు రోజుల్లో హైదరాబాదులో యింటికి వచ్చి  యీ విషయం మాట్లాడతాను.'' అని చెప్పి, అలాగే వెళ్లి ''మీతో కనీసం ఒక సినిమా ఐనా చేయాలని ప్రతి నిర్మాతకు ఉంటుంది. ఆ క్రెడిట్‌ నాకుండాలని కోరిక. సినిమా బాగా వస్తోంది. నా కిద్దరు కొడుకులు. పాపారాయుడు నెగటివ్‌ వారికి ఓ స్థిరాస్తిగా ఉంటుంది, మీరు నా బిడ్డలను ఆశీర్వదిస్తే...'' అన్నారు. అనేక మంది బిడ్డలున్న ఎన్టీయార్‌ ఒక్క క్షణం ఆలోచించి ''సరే, అలాగే కానీయండి.'' అని తేల్చేశారు.

లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటానని ఎన్టీయార్‌ సభాముఖంగా చేసిన ప్రకటనకు యీ ప్రమోద్‌ కుమార్‌ ప్రత్యక్షసాక్షి. ఆ విషయాన్ని కూడా ఆయన ఆ పుస్తకంలో రాశారు. ''మేజర్‌ చంద్రకాంత్‌'' శతదినోత్సవ సభను మోహన్‌బాబు తిరుపతిలో ఏర్పాటు చేశారు. హిందీ నటుడు సునీల్‌ దత్‌ అధ్యక్షుడు. వేదికపై చంద్రబాబు నాయుడు, దేవీ వరప్రసాద్‌, మోహన్‌బాబు ఉన్నారు. ప్రజల చప్పట్ల మధ్య ఎన్టీయార్‌ వేదికపైకి రాగానే అప్పటికే కూర్చున్నవారిలో ఆందోళన కనబడింది. వేదికపై ఓ మూల చేరి ఎన్టీయార్‌ను చుట్టుముట్టి కాస్త సీరియస్‌గానే మాట్లాడారు. ఎన్టీయార్‌ అసహనం ప్రదర్శిస్తూనే ఉపన్యాసం యివ్వడానికి మైకు ముందుకు వచ్చారు. ''నేను తీసుకున్న నిర్ణయాన్ని మీ అంగీకారం కోసం మీ ముందుంచుతున్నాను. ఇటీవల నేను సుస్తీపడి ఆస్పత్రిలో ట్రీట్‌మెంటు కోసం చేరిన సమయంలో ఓ స్త్రీ మూర్తి కంటికి రెప్పలా కాపాడి, సపర్యలు చేసి నన్ను స్వస్థుణ్ని చేశారు. ఆమెకు నేనెంతో ఋణపడి ఉన్నాను. జీవిత చరమాంకంలో ఉన్న నాకు తోడుగా నిలిచిన ఆ వ్యక్తిని..'' అంటూ ఆవేశంతో మైకు వదిలి స్టేజి చివరివరకూ నడిచారు. మోహన్‌బాబు ఆయన్ని పట్టుకుని మళ్లీ మైకు వరకూ నడిపించారు.

ఎన్టీయార్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ''ఆ స్త్రీమూర్తి యిక్కడే ఉన్నారు. ఆమె పేరు లక్ష్మీపార్వతి. ఆమెను నా జీవిత భాగస్వామిగా చేసుకోదలిచాను.. మీ అంగీకారంతో, మీ ఆశీస్సులతో' అంటూ కింద స్టేజి ముందు మొదటి వరుసలో ఉన్న లక్ష్మీపార్వతిని లేచి నిలబడమన్నారు. సభలో ఒక్క క్షణం నిశ్శబ్దం.. మరు నిమిషంలో కరతాళధ్వనులు. జై ఎన్టీయార్‌ అనే కేకలు వినబడ్డాక ఆయనకు ఆవేశం తగ్గి నెమ్మదించారు. తర్వాత సభ ప్రారంభమైంది. మర్నాడే హైదరాబాదు యింటికి ఎన్టీయార్‌, లక్ష్మీపార్వతి కలిసి వెళ్లారు. షిరిడీ సాయిబాబా విగ్రహం సమక్షంలో పెళ్లి చేసుకోవడం, మారేజి రిజిస్ట్రేషన్‌ పూర్తి కావడం జరిగాయి. ఇక అప్పణ్నుంచి ఎన్టీయార్‌ జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 02  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 03

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 04 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 05  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 06

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 07 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 08   ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 09

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 10  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 11

Show comments