ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 05

ఎన్టీయార్‌ గురించిన మరిన్ని ఉదంతాలు చెపుతున్నాను...
-''అల్లూరి సీతారామరాజు'' సినిమా గురించి ఎన్టీయార్‌కు, కృష్ణకు జరిగిన గొడవ చాలామందికి తెలుసు. ఆ సబ్జక్టు ఎన్టీయార్‌ తీద్దామనుకున్నారని, ఎప్పటికీ తీయకపోతే 1974లో కృష్ణ తీసేశారనీ, దానితో ఆయనకి కోపం వచ్చిందనీ బహిరంగ సత్యమే. ఎన్టీయార్‌ తీద్దామనుకుని ఆలోచన మాత్రమే చేశారా, లేదా స్క్రిప్టు రాయించి పెట్టుకున్నారా, ప్రారంభించి వదిలేశారా - అనే వివరాలు చాలామందికి స్పష్టంగా తెలియదు. వాటి గురించి తెలుసుకోవడానికి నేను పాత పత్రికలు తిరగేశాను. 1957 జనవరి 20 నాటి ఆంధ్రపత్రిక వీక్లీలో దీని గురించిన న్యూస్‌ దొరికింది. దానితో బాటు విజయా ప్రొడక్షన్స్‌వారు అప్పట్లో ప్రచురించే సినిమా మాసపత్రిక ''కినిమా'' (కొద్దికాలానికి దాన్ని మూసివేసి 1967 ప్రాంతంలో ''విజయచిత్ర'' పేరుతో మళ్లీ యింకో పత్రికను ప్రారంభించారు వారు) 1957 ఫిబ్రవరి సంచిక కూడా దొరికింది.

వాటి ప్రకారం జనవరి 17న ఆ సినిమా ఎన్‌ఏటి బ్యానర్‌పై ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు ఎన్‌ఏటి కార్యాలయంలో పూజ జరిగి, వాహినీ స్టూడియోలో ప్రారంభోత్సవం జరిగింది. 10 గంటల కల్లా వాహినీలో రికార్డింగుకు రిహార్సల్‌ పూర్తి చేసి, టేక్‌కు సర్వసిద్ధం చేశారు. నిర్మాత త్రివిక్రమరావు, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు, కెమెరామన్‌ రెహమాన్‌. కళాదర్శకత్వం తోట. సంగీతదర్శకుడు టివి రాజు సంగీతదర్శకత్వంలో ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, ఎంఎస్‌ రామారావు మరి 12 మంది యువకులూ కలిసి పడాల రామారావు రచించిన ఒక కోరస్‌ సాంగ్‌ పాడించారు ఆ రోజునే! పడాల రామారావుగారు అల్లూరి జీవితచరిత్రను ''ఆంధ్రశ్రీ'' పేర నాటకంగా రాశారు. సినిమా రచనకు ఆయనను, సముద్రాల జూనియర్‌ను తీసుకున్నారు. పడాల చేతనే యీ పాట కూడా రాయించారు.

''హర హరోం హర, మహా ఓంకార నాదాన

పొంగరా ఉప్పొంగి ఓ తెలుగుబిడ్డా...

స్వాతంత్య్ర విప్లవ సమరరంగాన ||హర||

పరప్రభుత్వపు నీడ, సీమ దొరల జాడ

కృంగుతూ బతుకుటే, జాతికి సిగ్గురా!

ముక్కోటి తమ్ములను ఒక్కటిగ నిలబెట్టి

మెడబట్టి తెల్లోళ్ల నెట్టిగెంటాలిరా ||హర||

పలనాటి చంద్రుని, భుగభుగల పొగఘాటు

రాణీరుద్రమ రౌద్ర, రోషానలజ్వాల

నీ మహాశక్తిరా, శ్రీరామ రక్షరా ||హర||

గోదావరీపరుగు, కృష్ణవేణీ ఉరక

పర్వతాలే రగులు, నివ్వాళులెత్త

తొడగొట్టి చేపట్టు, జయము మొనగాడా.. ||హర||

దీన్ని వాహినీ సౌండ్‌ ఇంజనీర్లు కృష్ణయ్యర్‌, వల్లభజోస్యుల శివరాం రికార్డు చేశారు. పాట వినడానికి రామారావు, త్రివిక్రమరావు, కమలాకర కామేశ్వరరావు, యోగానంద్‌, రెహమాన్‌, నిర్మాత డిబి నారాయణ, సముద్రాల సీనియర్‌ వగైరాలు కూర్చున్నారు. పాట పూర్తయ్యాక రామారావు ''టివి రాజు గారిది అల్లూరి సీతారామరాజు ప్రాంతమే. అందుకని మరింత ఉత్సాహంగా యీ వరస కూర్చారు.'' అన్నారు.

ముఖ్యపాత్రధారి రామారావు అని తప్ప వేరేవరి గురించి రాయలేదు. పాట కూడా రికార్డు చేసిన తర్వాత యీ సినిమా ఎందుకు ఆపేసినట్లు? అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది. అక్కడి దాకా వచ్చిందంటే   స్క్రిప్టు రెడీ అయిపోయి ఉంటుంది, రామారావు గారిది కెవి రెడ్డి గారి స్కూలు కాబట్టి! నిజానికి యీ సినిమా ప్రకటన ''జయసింహ'' పాటల పుస్తకంలోనే వేశారట. మా చిన్నప్పుడు '60లలో ప్రతీ పండగకు చిత్రనిర్మాణ సంస్థలు 'మా రాబోవు చిత్రాలు' అని యాడ్స్‌ యిస్తూ వుండేవి. ప్రతీసారీ ఎన్‌ఏటి వారి యాడ్‌లో ''అల్లూరి సీతారామరాజు'' పేరు ఉంటూ ఉండేది. కానీ సినిమా తీసే సాహసం ఎన్టీయార్‌ ఎప్పటికీ చేయలేకపోయారు. ఎందువలన?

సినిమాలో కథ, కమ్మర్షియల్‌ అంశాలు తక్కువగా ఉన్నాయని, వాటి కోసం లేనివి జోడిస్తే చరిత్ర దెబ్బ తింటుందని ఎన్టీయార్‌ జంకాడని అంటారు. అవి చూసుకోకుండానే పాట రికార్డింగు వరకూ వెళ్లిపోయారా? కృష్ణ మీద అలిగినపుడు, తర్వాత సినిమా తీద్దామని గట్టిగా అనుకున్నపుడు మరి యీ అభ్యంతరాలు గుర్తుకు రాలేదా? అప్పుడు కథ కొత్తగా పుట్టుకుని వచ్చిందా?

''పండంటి కాపురం'' 100 రోజుల ఉత్సవంలో  పాల్గొన్న రామారావు కృష్ణతో కలిసి సినిమా చేస్తానని ప్రకటించడంతో ''దేవుడు చేసిన మనుషులు'' సినిమా కథ తయారు చేసుకున్నారు. అంతలో ''జై ఆంధ్ర'' ఉద్యమం వచ్చి దానిలో కృష్ణ చురుకైన పాత్ర తీసుకోవడంతో కోపం తెచ్చుకున్నారు. అప్పట్లో ఎయన్నార్‌, ఎన్టీయార్‌ యిద్దరూ ఆ ఉద్యమాన్ని బలపరచలేదు. ఆర్టిస్టు అసోసియేషన్‌ నుంచి తప్పుకున్నారు కూడా. కానీ ఆ ఉదాసీనత వలన వారి సినిమాల కలక్షన్లపై ప్రభావం పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కుబడిగా ఉద్యమానికి 'జై' అన్నారంతే. ఈ గొడవల కారణంగా ఆయన సినిమా చేయరేమో అనుకుంటూండగా ఓ రోజు రామారావే పిలిచి వేషం వేస్తానన్నారు.

ఆ సినిమా సందర్భంగా కృష్ణతో స్నేహం బలపడింది. తర్వాతి సినిమాగా అల్లూరి తీస్తానని కృష్ణ ఆ సినిమా పాటల పుస్తకంలో ప్రచురించినప్పుడు ఎన్టీయార్‌కు కోపం వచ్చి 'అల్లూరి సినిమాలో కథ లేదు, ఆడదు, నువ్వు కురుక్షేత్రం తీయి, నేను కృష్ణుడు వేస్తాను, నువ్వు అర్జునుడు వేద్దువుగాని' అని ఆఫర్‌ యిచ్చారట. ''మా కథనంపై మాకు నమ్మకం ఉంది. మీరు తీస్తానంటే మానేస్తాం'' అంటే ''నేను తీయను, నువ్వూ తీయవద్దు'' అన్నారట. కాదని కృష్ణ ముందుకు వెళ్లడంతో కోపం వచ్చి ''దేవుడు చేసిన మనుషులు'' సినిమా విజయోత్సవ సభకు కూడా రాలేదు.

తర్వాత చాన్నాళ్లకు అల్లూరిని తీద్దాం రచన చేయమని పరుచూరి బ్రదర్స్‌ను అడిగినపుడు 'ఓసారి కృష్ణ సినిమా చూసి, అప్పుడు నిర్ణయం తీసుకోండి' అని వారంటే అప్పుడు కృష్ణ నడిగి ప్రత్యేకంగా షో వేయించుకుని చూసి, 'దీన్ని మించి తీయలేం' అనుకుని ఆ ప్రాజెక్టు అటకెక్కించారు. కానీ ఆ వేషంలో కనబడాలన్న కుతి తీరక, చాలా సినిమాల్లో ఆ వేషంలో కనబడ్డారు. ఎన్టీయార్‌ నటుడే కాదు, దర్శకుడు, నిర్మాత, రచయిత కూడా. ఆయన పేర మ్యూజియమంటూ వెలిసి, దానిలో సంపూర్ణ, అసంపూర్ణ స్క్రిప్టులన్నీ పెడితే ఆయన అల్లూరిని ఎలా తీద్దామనుకున్నాడో మనకు తెలుస్తుంది. అప్పట్లో స్క్రిప్టు రాయించారు కాబట్టి, యితర పాత్రలను కూడా బలంగానే తీర్చిదిద్ది ఉంటారని ఆశించేందుకు అవకాశం ఉంది. పోనుపోను, సినిమాల్లో ఆయన డామినేషన్‌ పెరిగిపోయింది కాబట్టి యితర పాత్రలను పనికి రానివాళ్లగానో, లేదా ద్వితీయశ్రేణి నటుల చేత వేయించడమో జరిగి వుండేది.

కృష్ణ సినిమా వచ్చినపుడే అనుకున్నా - 'కృష్ణ కాబట్టి రూథర్‌ఫర్డ్‌ పాత్రను జగ్గయ్య చేత వేయించారు, అదే రామారావు తీసి ఉంటే ఆ పాత్రను జగ్గారావు (బాపు ''సాక్షి''లో ప్రధాన విలన్‌గా పరిచయమై, తర్వాత చాలా సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు వేశారు) చేత వేయించేవారు'' అని. కృష్ణ తీశారు కాబట్టి ఆ సినిమాలో హేమాహేమీలను తీసుకున్నారు. వాళ్లు తనను డామినేట్‌ చేస్తారన్న భయమేమీ పడలేదు. రామారావైతే తనుండగా యితర వేషాలు ఎవరు వేసినా ఫర్వాలేదనే లెక్కతో చిన్న స్టార్లతో నింపేసేవారు. పైగా కృష్ణలా ఔట్‌డోర్‌లో తీసి వుండేవారు కాదు. చాలా భాగం స్టూడియోలోనే లాగించేసి ఉండేవారు. ఏది ఏమైనా ఆ సినిమా తీసి కృష్ణ చరిత్ర సృష్టించారు. బెదురు వలన, వాణిజ్యపరమైన లెక్కలు మరీ ఎక్కువగా వేయడం వలన రామారావు ఆ పాత్ర మిస్సయ్యారు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 02 

 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 03 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ - 04

Show comments