చైనా టాప్-20 లిస్ట్ లో చేరిన దంగల్

ఇండియాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన అమీర్ ఖాన్ ఇప్పుడు చైనాలో కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రపంచవ్యాప్త వసూళ్లలో ఇప్పటికే నంబర్ వన్ మూవీగా అవతరించిన అమీర్ దంగల్ సినిమా, చైనాలో ఇప్పుడు మరో రికార్డు సాధించింది. ఆ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 సినిమాల జాబితాలోకి దంగల్ కూడా ఎంటర్ అయింది.

చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి 20 సినిమాల జాబితాలో ప్రస్తుతం 15వ స్థానంలో కొనసాగుతోంది దంగల్. ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రానికి దక్కని గౌరవం ఇది. చైనా రూల్స్ ప్రకారం ఈ సినిమాకు ఇంకా 24 రోజులు టైం ఉంది. ఈ 24 రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

నిజానికి చైనాలో దంగల్ రన్ ఈ పాటికే ముగిసిపోవాలి. నిబంధనల ప్రకారం విదేశీ చిత్రాలు ఎక్కువ రోజులు ఆడడానికి ఆస్కారం లేదక్కడ. కానీ దంగల్ కు మాత్రం చైనా ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. అదనంగా మరో నెల రోజుల పాటు దేశంలో దంగల్ ను ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. మరో 24 రోజుల్లో ఆ గడువు కూడా పూర్తవుతుంది.

చైనా, తైవాన్ దేశాల్లో సూపర్ హిట్ అయిన దంగల్ సినిమా ఇప్పుడు హాంకాంగ్ పై కన్నేసింది. ఆగస్ట్ 31న ఈ సినిమాను హాంకాంగ్ అంతటా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. సినిమా ప్రచారం కోసం అమీర్ ఖాన్, ఆ దేశంలో కూడా పర్యటించబోతున్నాడు.

Show comments