అప్పుడు లేచిన నోరు.. ఇప్పుడు మూగబోయింది

ఈవీఎంల మీద ఎన్నెన్ని మాటలన్నారు. ఏ గుర్తు నొక్కినా చివరకు కమలానికే ఓటు పడుతోందని, అలా ఈవీఎంల ప్రోగ్రామ్ సెట్ చేశారని నానాయాగీ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా నా ఓటు ఎవరికి పడిందో నాకే తెలియదు, ఈవీఎంలు మోసం చేశాయని నోరు పారేసుకున్నారు చంద్రబాబు. కోర్టుల్లో కేసులు వేసి చీవాట్లు తిన్నారు. ధర్మాసనం వీల్లేదని చెప్పినా కూడా ఢిల్లీ వీధుల్లో వీరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఈ ఓవర్ యాక్షన్ చూసినోళ్లంతా ఫలితాలు తేడాకొడితే ప్రతిపక్షాలన్నీ మరింత రెచ్చిపోతాయని అంచనా వేశారు. ఇప్పుడా ప్రమాదం లేదని తేలిపోయింది. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత అందరి నోళ్లకూ తాళం పడింది. ఈవీఎంలు, వీవీప్యాట్ లు, మోసం ద్రోహం అని ఢిల్లీలో గొంతు చించుకున్నవాళ్లు కూడా మోడీ జాతకం బాగుందని తోకముడిచారు.

నింద ఎవరి మీద వేయాలో తెలియనంతగా ఘోర పరాభవం ఎదురవడంతో చంద్రబాబు సైతం రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నింద ఈవీఎంలపై వేయలేమని స్పష్టంచేశారు. అటు మమతా బెనర్జీ, కుమారస్వామి కూడా మౌనందాల్చారు. ఊహించని విజయం దక్కడంతో స్టాలిన్ అస్సలు నోరు తెరవడంలేదు.

ఇక కాంగ్రెస్ నేతలు ఈవీఎంల ఊసే ఎత్తడంలేదు. యాభైశాతం వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనంటూ కోర్టు మెట్లెక్కిన ప్రతిపక్ష నేతలు బొత్తిగా మాట్లాడ్డం మానేశారు. ఎన్నికలకు ముందు ఎగిరెగిరిపడ్డోళ్లంతా.. ఫలితాలొచ్చాక మన్నుతిన్న పాముల్లా పడుకున్నారు. అప్పుడు లేచిన నోర్లు ఇప్పుడు మూగబోయాయి.

సినిమా రివ్యూ: సీత