సైంధవులు కాదు.. నమ్మించి గొంతుకోసే రకాలు!

ఈ రాష్ట్రం పాలిట భారతీయ జనతాపార్టీ నాయకులు సైంధవులు అని అన్నందుకు ఆ పార్టీ నాయకులకు కోపం పొడుచుకు వచ్చేసింది. ఆ ‘సైంధవులు’ అనేమాటను రికార్డుల నుంచి తొలగించాలంటూ.. వారు తీవ్రంగా పోరాడారు. ‘అవును సైంధవులే... అంటే తప్పేంటి’ అంటూ గట్టిగా ఎదురు నిలిచేసరికి తోకముడిచి పలాయనం చిత్తగించారు. ఇదీ.. ఏపీ శాసనమండలిలో సోమవారం నాడు జరిగిన రచ్చోపరచ్చల తీరు!

అవును ఇంతకూ రాష్ట్రం పాలిట భారతీయ జనతా పార్టీ నాయకులు సైంధవులా కాదా? అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది. సైంధవుడంటే.. ముందుకు దూసుకువెళుతున్న వాడిని అడ్డుకునే వాడు మాత్రమే. అంటే అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకుపోతున్నప్పుడు అడ్డుకుంటే మాత్రమే సైంధవుడని అనాలి. కానీ వాస్తవంలో ఇక్కడ ఏపీ సర్కారు మాయమాటలు చెప్పడమే తప్ప అభివృద్ధి పథంలో దూసుకుపోవడం కూడా లేదు. అలాంటప్పుడు ఇక అడ్డుకోవడం ఎక్కడుంది? వారు సైంధవులు ఎలా అవుతారు? ఎట్టి పరిస్థితుల్లోనూ కారు!

కానీ భాజపా అగ్ర నాయకులు ఏపీ పాలిట నమ్మించి గొంతుకోసే నయవంచకులు మాత్రం ఖచ్చితంగా అవుతారు- అని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. సైంధవులు అన్నమాట అన్నందుకే అంతగా బాధపడిపోతున్న భాజపా వారికి, వారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో గుర్తురావడం లేదా? అని ప్రజలు నిలదీస్తున్నారు. సాక్షాత్తూ తిరుపతి సభలో.. తమ ప్రభుత్వం రాగానే పదేళ్లపాటూ ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతాం అన్న విషయాన్ని ప్రధాని మోడీ విస్మరించి పాపానికి ఒడిగట్టలేదా అనేది ప్రజల ప్రశ్న.

ఓట్ల భిక్షమెత్తుతున్న వేళ మోడీ, ఢిల్లీని మించిన రాజధాని నగర నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందంటూ ప్రకటనలు గుప్పించి... అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తోంటే.. ఓ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి మన మొహాన కొట్టి.. వంచించింది నిజం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రానికి కేంద్రం ఏదో ఒరగబెట్టేసినట్లు ప్రచారం చేసుకోవాలంటే.. రాష్ట్ర భాజపా నాయకులు దెబ్బతింటారని... అలా కాకుండా.. చంద్రబాబు ప్రభుత్వంలో ఏం లోపాలున్నాయో అంతవరకు విమర్శించడానికి పరిమితం అయితే పరువు దక్కించుకుంటారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

RELATED తప్పదు.. హరీష్‌రావుకి వేరే ఛాన్స్‌ లేదు.!