న్యాయపరంగా కాదు... నైతికంగా ఉండాలి

ఇప్పుడు దేశం మొత్తాన్నీ ఊపేస్తున్న విషయం ’మీ టూ‘. ఈ అంశంకింద పలువురు మహిళలు గొంతెత్తి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి వినిపిస్తున్నారు. ఈనేపధ్యంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎం.జె.అక్బర్ తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలని తోసిపుచ్చుతున్నారు. తనపై వచ్చినవన్నీ కల్పితాలని, అలాంటి ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెబుతున్నారు.

తనపై వచ్చిన ఆరోపణలకు తాను న్యాయపరంగా పోరాటం చేస్తానని అక్బర్ చెబుతున్నారు. కానీ పోరాటం జరగాల్సింది న్యాయపరంగాకాదు... నైతికంగా జరగాల్సివుంది. ఒకప్పుడు ఆయన మీడియా రంగంలో ఉన్న సమయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ పలువురు మహిళలు అక్బర్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

అయితే తాను ఒకవేళ వారితో అలా అసభ్యంగా ప్రవర్తించినా... తర్వాత కూడా సదరు మహిళలు తనతో కలసి పనిచేశారని అక్బర్ చెబుతున్నారు. అంటే... ఆయన చేసిన అనుచిత ప్రవర్తనకు భయపడివారు తమ ఉద్యోగాలను మానివేయాలా... అప్పుడు వాళ్లు మంచివాళ్లు అయినట్టేనా... లేదా తాను ఎలా ప్రవర్తించినా భరిస్తూ తనతోపాటు పనిచేస్తూ వుంటే... అప్పుడు ఈయన మంచివాడు అయినట్టేనా...

ఏ రంగంలోనైనా మహిళలకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరినుండి ఎదురుకాకుండా పోదు. అలాంటి పరిస్థితుల్లో వారు పరిస్థితులకు భయపడి తమ ఉద్యోగాలను వదిలేసి పారిపోవాలా...? అలా కాకుండా కొనసాగుతూవుంటే... వారికి తమ విధినిర్వహణలో ఎదురయ్యే ఇలాంటి పరిస్థితులు ఇష్టమయ్యే కొనసాగుతున్నట్టా...?

అక్బర్ చెబుతున్న విషయాలు కూడా ఇలానే ఉన్నాయి. తనపై ఆరోపణలు చేసిన మహిళలు తర్వాత కూడా తనతోపాటు కలసి పనిచేశారని ఆయన చెబుతున్నారు. అంటే ఈయన ప్రవర్తనకు భయపడి వారు పారిపోకుండా తట్టుకొని ఉంటే... ఈయన మంచివాడికింద చెలామణి అయిపోయినట్టేనా...?

తనకు ఈత రాదని... అలాంటి తాను ఈత కొలనులో విందులు చేసుకున్నట్టు అంజుభారతి చేసిన ఆరోపణలు అర్థరహితం అని ఆయన చెబుతున్నారు. ఈత కొలనులో దిగాలి అంటే... ఈత వచ్చివుండాలి కాని... విందు చేసుకోవాలి అంటే ఈత రావాలనే అర్థంకాదు. ఎవరైనా ఈతకొలనులో విందులు చేసుకోవచ్చు. ఈవిషయం ఆయనకు బోధపడినట్టు లేదు.

తనపై వచ్చన ఆరోపణలన్నీ నిరాధారమైనవనీ... దానికి తాను న్యాయపరమైన పోరాటం చేస్తాననీ అక్బర్ చెబుతున్నారు. అంతేతప్ప తాను మగువల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదని ఏవిధంగానూ నిరూపణ చేసుకునే ప్రయత్నం ఆయన చేయడంలేదు.

అంటే న్యాయపరంగా అయితే ఎలాగో ఓలాగ బయటపడవచ్చు... అనే ధీమాతో ఉన్నారు. నైతికపరంగా తాను మంచివాడిననే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేయడంలేదు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆయన ఆలోచించుకోవాల్సివుంది.

అయినా ఒకవ్యక్తిపై మరోవ్యక్తి ఆరోపణ చేస్తే అది వ్యక్తిగతమైన కారణాల వల్ల కావచ్చు అని మనం అనుకుంటాం. అలాకాకుండా ఒకరికి మరొకరు ఎలాంటి సంబంధం లేని పలువురు వ్యక్తులు ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేస్తే దాన్ని ఏమనాలి...?

సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలాంటివాడైనా శంకించాల్సి ఉంటుంది.  ఇకనైనా అక్బర్ తనపై వచ్చిన ఆరోపణలకు న్యాయపరంగా కాకుండా నైతికపరంగా జవాబు చెబితే మంచిదేమో!

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి