ఈశాన్య భయాలకు డొంకతిరుగుడు జవాబులు

కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వలన దేశంలో అన్నిచోట్ల కంటె ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. వారి భయాలన్నీ సహేతుకమైనవి. ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను బుల్‌డోజ్ చేసేస్తూ చెలరేగుతున్న మోడీ సర్కారు.. ప్రజల్లో వాస్తవంగా పుడుతున్న ఆందోళనలను కూడా మాయ చేయడానికి ప్రయత్నిస్తోంది. వారి అనుమానాల విషయంలో డొంక తిరుగుడు జవాబులు చెబుతోంది.

అసోం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఆందోళనలు మిన్నుముడుతున్నాయి. అయితే కేంద్రం వాటిని తొక్యేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ఇలాంటి చట్టం వల్ల బెంగాలీ హిందువులు పౌరసత్వం పొందితే అసోంలో వారి ఆధిపత్యం పెరుగుతుందని, స్థానికంగా ఉండే గిరిజన జాతులు  భయంతో బతికే పరిస్థితి ఏర్పడుతుందని వారిలో భయాలున్నాయి. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎక్కువగా అసోం ప్రాంతంలో ఉండడడం కూడా  ఇందుకు ఒక కారణం.

అయితే ప్రభుత్వం వారి భయాల్లో దేనికీ సూటిగా సమాధానం చెప్పకుండా.. మాయ చేస్తోంది. మా పరిస్థితి ఏమిటో అని వారు ఆందోళన చెందుతోంటే.. ఇది మీ ఒక్కరి పరిస్థితి కాదులే.. దేశానికి అంతా వర్తించే చట్టం ఇది. మీ రాష్ట్రం కోసం చేసిన చట్టం కాదు అని నర్మగర్భంగా చెబుతోందే తప్ప.. వారి ఆందోళనలో నిజముందా లేదా సూటిగా మాట్లాడడం లేదు. అసోం ఒప్పందానికి కూడా ఈ బిల్లు అనేక రకాలుగా దెబ్బతీసేలా కనిపిస్తున్నా.. మభ్యపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.

వారి వైఖరిలో తేడా ఉన్నదనడానికి మరో కారణం కూడా ఉంది. ఆఫ్గన్, పాక్, బంగ్లా నుంచి మతవిద్వేషాల కారణంగా వలసవచ్చిన ముస్లిమేతర అల్ప సంఖ్యాక వర్గాలకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ చట్టం తెచ్చారు. ముస్లింలను వేరుచేస్తున్నట్లుగా ఇది ఉందని విమర్శలు వచ్చాయి. అయితే ఈ బిల్లులో పేర్కొన్న మతాలు కాకుడా.. ఇతరులకు పౌరసత్వం కావాలంటే.. వారు ఇప్పుడున్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చునని కేంద్రం చెబుతోందే తప్ప.. ఇప్పుడున్న చట్టాలను వీరందరికీ కూడా వర్తింపజేయవచ్చు కదా అనే మాటకు జవాబు చెప్పడం లేదు.

లోపల ఏదో ఉద్దేశ్యాలు పెట్టుకుని.. పైకి మభ్యపెట్టే మాటలు చెబుతూ.. పౌరసత్వ సవరణ బిల్లులో కేంద్రం ఏకపక్ష ధోరణితో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

Show comments