దెబ్బకు తెలుగు తమ్ముళ్లు దారికొచ్చారు

సినిమాని సినిమాలాగే ప్రమోట్ చేయాలి, రాజకీయాలు కలగలిపితే వచ్చే ఫలితం వేరేగా ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు విషయంలో అదే జరిగింది. రిలీజ్ ముందు నుంచీ టీడీపీ నేతలు, కార్యకర్తలు సినిమాని ఓన్ చేసుకున్నారు. అది టీడీపీ సినిమా అన్నట్టు కలరింగ్ ఇచ్చారు. 

నిజమైన ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ అతిని భరించలేకపోయారు. తొలిరోజు సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించ లేదు. మొదటి రోజు ఫలితంతో రెండో రోజు నుంచీ సినిమా చూడాలనే ఆశ కూడా పోయింది జనాలకు. కథానాయకుడు రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర టీడీపీ నేతల హంగామా, ర్యాలీలు, బహిరంగ సభలు.. అబ్బో ఒకటేంటి అన్నిరకాల ఫీట్లు చేశారు. రిజల్ట్ తేడా కొట్టడంతో ఇప్పుడంతా సైలెంట్ అయిపోయారు. 

మహానాయకుడు రిలీజ్ టైమ్ కి అందరకీ జ్ఞానోదయం అయింది. తొలి సినిమా పరాజయం ఎఫెక్ట్, రెండో సినిమాపై అంచనాలు లేకపోవడం.. ఇవన్నీ కలిపి మహానాయకుడిని ఎవరూ పట్టించుకోలేదు. ఏఎంబీ థియేటర్స్ లో వేసిన ప్రీమియర్ లో కూడా టీడీపీ నేతలు ఎవరూ కనిపించలేదు. బాలకృష్ణ, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమాలో నటించిన వాళ్లు, టెక్నీషియన్లు.. ఇలా అందరూ సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులే ప్రీమియర్ కు వచ్చారు. 

రాజశేఖర్  కూతుళ్ల హంగామా తప్ప థియేటర్ దగ్గర ఇంకే సందడీ కనిపించ లేదు. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి కూడా అమ్మ, నాన్నతో కలసి సినిమాకి వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అవడం ఆలస్యం.. బాలా మావయ్య సూపరో సూపరు అంటూ ట్వీటిన చినబాబు కూడా ప్రీమియర్ కి దూరంగా ఉన్నాడు. 

ఇక జిల్లాల్లో కూడా హంగామా లేదు. కథానాయకుడు రిలీజ్ ముందు రోజే హాల్స్ దగ్గర ఆర్భాటం చేసిన టీడీపీ నేతలు ఈ సినిమాకు మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు. కామ్ గా పక్కకు తప్పుకున్నారు. మొత్తానికి కథానాయకుడు సినిమా రిజల్ట్ తో మహానాయకుడు టైమ్ కి తెలుగు తమ్ముళ్లు చప్పబడిపోయారు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ ఏమైనా వస్తే, తెలుగు తమ్ముళ్లు మళ్లీ బయటకొచ్చే ఛాన్స్ ఉంది.