చంద్రబాబు పోరాటానికి పార్టీ నుంచినే సహకారం లేదా!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద యుద్దం చేస్తూ ఉన్నారు. కనపడని శత్రువు మీద బాబు ఫైర్ అయిపోతూ ఉన్నారు. ఎవరిని ఏమనాలో తెలియక సీఈసీ మీద బాబు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. అయితే కొందరు మాజీ సీఈసీలు బాబుకు ఘాటు సమాధానాలు ఇస్తున్నారు. ‘ఓడిపోయేవారు ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం కొత్త కాదు..’ అని మాజీ సీఈసీ సంపత్ లాంటి వాళ్లు కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారని, ఎలాగూ ఓటమి  తప్పదనే లెక్కలతోనే బాబు అలా మాట్లాడుతూ ఉన్నారనేది సామాన్యుల నుంచి వినిపిస్తున్న మాట. సరిగ్గా పోలింగ్ పూర్తికాదానే.. ఈవీఎంల మీద బాబు పోరాటం మొదలుపెట్టడం చూస్తుంటే.. ఓటమి తప్పదనే సంకేతాలతోనే ఆయన అలా చేస్తున్నారని సామాన్య జనాలు చర్చించుకుంటున్నారు.

ఇక ఈవీఎంల మీద బాబు చేస్తున్న యుద్దంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతగా కలిసిరాకపోవడాన్ని గమనించవచ్చు. మొన్నటివరకూ చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక స్టేట్ మెంట్ ఇస్తే దానిపై తెలుగుదేశం నేతలు ఈగల్లా స్పందించేసేవారు. అందరూ అదే టాపిక్ ను మాట్లాడుతూ.. హడావుడి చేసేవాళ్లు.

అయితే ఈవీఎంల మీద బాబు వ్యాఖ్యలపై స్పందిస్తున్న టీడీపీవాళ్లు తక్కువమందే! బుద్ధా వెంకన్న, కోడెల శివప్రసాద్ రావు వంటి వాళ్లను, మరి కొందరు వీర విధేయులను  పక్కనపెడితే.. టీడీపీ నేతలు ఈ అంశంపై మాట్లాడటం లేదు. బాబు పోరాటం అంటుంటే.. వాళ్లెవ్వరూ పచ్చచొక్కాలు వేసుకుని బాబుకు సంఘీభావంగా రావడంలేదు.

ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ నుంచి బాబు పిలుపుకు, పోరాటానికి నేతలు పెద్దగా కలిసి రావడం లేదని మాత్రం స్పష్టం అవుతోంది. అలా వ్యవహరించడంలో టీడీపీ నేతల లెక్కలు వారికి ఉన్నాయట. పార్టీ అధికారంలోకి రాకపోతే.. చాలామంది తెలుగుదేశం నేతలు బాబుకు బై బై చెప్పే అవకాశాలున్నాయి. అందులో సందేహం ఏమీలేదు.

అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న పోరాటాలకు వత్తాసు పలికినా కంఠశోష తప్ప మరేందక్కదు అనేది తెలుగుదేశం నేతల లెక్కగా తెలుస్తోంది. అందుకే మే ఇరవై మూడోతేదీ వరకూ కామ్ ఉండి, సమ్మర్ వెకేషన్లతో సేదతీరి.. ఫలితాల అనంతరం ఒకేసారి స్పందించాలని చాలామంది నేతలు అనుకుంటున్నారని టాక్!

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?