ఫైబర్ గ్రిడ్ కాదిది.. పక్కా ఫేక్ గ్రిడ్

860 కోట్ల రూపాయల ప్రాజెక్టు
కార్పొరేట్ సంస్థలన్నీ 'రంగం'లోకి దిగిన మెగా వెంచర్
రాష్ట్ర ప్రగతికి ఇదే నిదర్శనం అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్న ప్రాజెక్టు

ఇప్పుడీ ప్రాజెక్టుకు టీడీపీ నేతలు చెదలు పట్టించారు. ఆర్భాటంగా ప్రారంభమైన పైలెట్ ప్రాజెక్టులో డొల్లతనం జగన్ పాదయాత్ర సందర్భంగా బయటపడింది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ కు అడుగడుగునా చంద్రబాబు సర్కార్ పాలనలో చీకటి కోణాలే కనిపిస్తున్నాయి. ఫైబర్ గ్రిడ్ జాడలు వెదికినా కనిపించలేదు.

విశాఖ కేంద్రంగా ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు చంద్రబాబు. ఇప్పుడు అదే విశాఖకు కూతవేటు దూరంలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఏ పల్లెలకైతే ప్రపంచాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని బాబు ఘనంగా చెప్పుకుంటున్నారో, ఏ పల్లెలకైతే బ్రాండ్ బాండ్ (ఇంటర్నెట్)ను అత్యంత చవక ధరకు అందించామని టీడీపీ సర్కార్ బాజాలు కొట్టుకుంటుందో.. అదే పల్లెల్లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు. 

నెట్ వర్క్ అంటే ఏంటో కూడా తెలియని పల్లెలు అవి. ఆశ్చర్యకరంగా ఫైబర్ గ్రిడ్ అనేది ఒకటి ఉందనే విషయం కూడా ఆ పల్లె జనాలకు తెలీదు. పల్లెల్లో ప్రతి ఇంటికీ ఫైబర్ గ్రిడ్ ద్వారా 149 రూపాయలకే టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తామంటూ గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అదే పైలెట్ ప్రాజెక్టును గాలికి వదిలేసింది. అసలు అలాంటి పథకం ఒకటి ఉందనే విషయమే తమకు తెలియదని గ్రామస్తులు చెబుతుంటే ఆశ్చర్యపోవడం జగన్ వంతయింది. 

ఫైబర్ గ్రిడ్ పైలెట్ ప్రాజెక్టు కోసం కేటాయించిన కోట్ల రూపాయలు నిధులు ఏమయ్యాయో చెప్పాలని, అసలు ఈ పథకం కోసం నిర్దేశించిన బడ్జెట్ ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు జగన్. ఆంధ్రప్రదేశ్ కు సాంకేతిక విప్లవం తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేని కొన్ని గ్రామీణ ప్రాంత వాసులకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కో, పోలీస్ స్టేషన్ కో ఫోన్ చేయాలంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్న కొన్ని పల్లెల్లో జగన్ పాదయాత్ర చేశారు. గర్భిణిలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న జనాలకు చూసి చలించిపోయారు. దేశానికి సెల్ ఫోన్లు తనే పరిచయం చేశానని చెప్పుకునే చంద్రబాబు.. విశాఖకు కొద్దిదూరంలో ఉన్న ఇలాంటి పల్లెలకు ఎందుకు సెల్ ఫోన్ సౌకర్యం కల్పించలేకపోయారో చెప్పాలని, కనీసం బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని జగన్ విమర్శించారు. 

ఈరోజు జగన్ పాదయాత్ర ఆనందపురం, పెందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల మీదుగా సాగుతోంది. త్వరలోనే విశాఖ జిల్లాను దాటి విజయనగరం జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు జననేత. జిల్లాలో జగన్ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా సాగింది. ప్రతి బహిరంగ సభ సూపర్ హిట్ అయింది. విజయనగరం జిల్లాలో కూడా జగన్ కు అదే స్థాయిలో జనాదరణ లభిస్తుందని వైసీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

Show comments