6 నెలలు అన్నారు: అంత ఓపిక మాత్రం లేదు!

వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. విపక్షాల వారు చాలా కంగారుపడ్డారు. ప్రజలు తమను ఎంత దారుణంగా తిరస్కరించారో, జగన్ మీద ఎంతగా నమ్మకం పెట్టుకున్నారో పట్టించుకోకుండా.. వారంతా మనస్తాపం చెందారు. కాకపోతే పైకి మాత్రం.. జగన్ ప్రభుత్వానికి ఆరునెలల సమయం ఇచ్చి చూస్తాం. ఆయన పాలనలో ఒడిదుడుకుల్ని తట్టుకుని, నిలబడడానికి వ్యవధి ఇస్తున్నాం. ఆ తర్వాత.. నిర్ణయాల్లో లోపాలుంటే మాత్రం ప్రజా పోరాటాలు చేస్తాం.. అంటూ ప్రకటించారు. కానీ, రెండున్నర నెలలు గడిచేసరికెల్లా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తాళలేకపోతున్నట్లుంది. అర్జంటుగా జగన్ ను తీవ్రాతి తీవ్రంగా విమర్శించేయాలని ఉత్సాహపడిపోతున్నది.

జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద విపక్షాలు అన్నీ విమర్శలు, దాడిచేసే బాటపట్టాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ వరుసలోకి చేరింది. విజయవాడలో నిర్వహించిన పార్టీ సమావేశంలో జగన్ ప్రభుత్వంలో ఆత్రం, ఆవేశం కనిపిస్తున్నాయి గానీ... ఆలోచన ఆచరణ కనిపించడం లేదని ఆ పార్టీ విమర్శిస్తోది. ఇసుక విషయంలోగానీ, స్థానికులకు ఉద్యోగాలు అనే విషయంలో గానీ.. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను వారు తప్పుపడుతున్నారు.

పాలనపరంగా జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో... అవి ఎంతమేరకు ప్రజారంజకంగా ఉంటున్నాయో, ప్రజాకంటకంగా మారుతున్నాయో బేరీజు వేయడానికి ఆరునెలల వరకు ఆగిచూస్తామని తెదేపా, జనసేన, భాజపాల నాయకులు వేర్వేరు సందర్భాల్లో ప్రకటించారు. ఈ మూడు పార్టీల్లోనూ జనసేన అసలు తాళలేకపోయింది. పూర్తిగా ఒకటిన్నర నెల కూడా గడవకముందే.. ఏదో పనిగట్టుకుని సర్కారు మీద విమర్శలు చేయడం ప్రారంభించింది.

పవన్ కల్యాణ్.. ఆవేశ పూరితమైన మాటలతో ప్రభుత్వాన్ని తిట్టడం ప్రారంభించేశారు. ఆ వెంటనే చంద్రబాబుకు ఓపిక లేకుండా పోయింది. తనకు తోచిన రీతిలో ఆయన కూడా విమర్శలు చేస్తూపోయారు. తాజాగా భాజపా కూడా వారి సరసన చేరింది. అదే పాట పాడుతోంది. ఆరునెలలు టైం ఇవ్వాలనుకున్నాం. కానీ పరిస్థితి ఘోరంగా మారిపోతోంది.. అంటూ విమర్శల దాడి షురూ చేశారు. ఆరునెలలు సమయం ఇస్తాం అంటూ ఆగలేక దాడులు మొదలెట్టిన విపక్షాలు.. మళ్లీ ఎన్నికల కోసం అయిదేళ్లు కూడా ఆగగలుగుతాయో లేదో మరి!

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్

Advertising
Advertising