నిప్పు చంద్రుడు మళ్ళీ తప్పులో కాలేశాడు.!

సీబీఐ.. భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇది. దీన్నిప్పుడు 'ఛీబీఐ' అని చాలామంది ఎగతాళి చేస్తున్నారంటే, దానిక్కారణం.. సీబీఐ మీద కేంద్రం చెలాయిస్తున్న పెత్తనమే. ఈ రాజకీయ పెత్తనం గతంలో కూడా చూశాం. కాంగ్రెస్‌ హయాంలో సీబీఐని పంజరంలో చిలకలా మార్చేశారంటూ అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానమే అసహనం వ్యక్తంచేసింది. రాజకీయ పార్టీలు వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం కొత్తేమీకాదు. అలాగని, ఆయా వ్యవస్థలపై ప్రభుత్వాలకు విశ్వాసం లేకపోతే ఎలా.?

మన వేలితో మన కంట్లోనే పొడుచుకోవడమంటే ఇదే మరి. సీబీఐ మీద ఎలాగూ నరేంద్రమోడీ సర్కార్‌ 'రాజకీయ మరక' వేసేసింది గనుక, ఆ సీబీఐని మరింత నవ్వులపాలు చేసేందుకు, తద్వారా రాజకీయంగా తాను పబ్బం గడుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌ 'చీప్‌ ట్రిక్స్‌' ప్రయోగించింది. సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో సోదాలు నిర్వహించే అవకాశం లేకుండా చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

ఇలాంటి 'తప్పుడు నిర్ణయాలు' తీసుకోవడం చంద్రబాబుకి కొత్తేమీకాదు. ఏంచేసినా, తానే 'రైట్‌' అని నిరూపించుకునేందుకు చంద్రబాబుకి ఎప్పుడూ ఏదో ఒక 'కుంటి సాకు' దొరుకుతుంటుంది. సీబీఐ మీద చంద్రబాబు సర్కార్‌ ఈ 'అస్త్రాన్ని' ప్రయోగించడానికి అసలు కారణం వేరే వుంది.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేతృత్వంలో జరిగే విచారణ మీద తమకు నమ్మకం లేదని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఆరోపించడమే కాదు, న్యాయస్థానాన్నీ ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశిస్తే, ఆ సీబీఐ విచారణకు అవకాశం లేకుండా చేయడానికే చంద్రబాబు సర్కార్‌, అత్యంత వ్యూహాత్మకంగా 'సీబీఐలో లుకలుకలు' అనే సాకు చూపి, సీబీఐ మీద 'నిషేధాస్త్రం' ప్రయోగించిందన్నమాట.

పైగా, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని బట్టబయలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో వున్న ఏసీబీతో దాడులు చేయించాలన్నది చంద్రబాబు సంకల్పం. తద్వారా ఆదాయపు పన్నుశాఖ ఉద్యోగుల్ని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు సర్కార్‌ భావిస్తోందన్నమాట.

అలా చేయడం ద్వారా, ఆంధ్రప్రదేశ్‌లో ఐటీదాడులు తగ్గుతాయని చంద్రబాబు అనుకుంటున్నారేమో.! ఈ తరహా తలతిక్క రాజకీయ వ్యూహాలు పన్నడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. రాష్ట్రానికీ కేంద్రానికీ మధ్య 'ఫైట్‌' కోసం చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాలు మొత్తంగా ఫెడరల్‌ స్ఫూర్తికే విఘాతం కలిగించేలా వున్నాయన్నది నిర్వివాదాంశం.

'దేశ ప్రయోజనాల కోసం..' అంటూ జాతీయ దర్యాప్తు సంస్థ మీద 'నిషేధం' ఏమిటో చంద్రబాబుకే తెలియాలి.

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments