సినిమా రివ్యూ: ఎన్‌ జి కె

రివ్యూ: ఎన్‌ జి కె
రేటింగ్‌: 1/5
బ్యానర్‌: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
తారాగణం: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, దేవరాజ్‌, పొన్‌వణ్ణన్‌, నిళల్‌గళ్‌ రవి, ఉమా పద్మనాభన్‌, బాలాసింగ్‌ తదితరులు
కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌.
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
ఛాయాగ్రహణం: శివకుమార్‌ విజయన్‌
నిర్మాత: ఎస్‌.ఆర్‌. ప్రభు
రచన, దర్శకత్వం: శ్రీ రాఘవ
విడుదల తేదీ: మే 31, 2019

తెరపై ఏమి జరుగుతోందనేది అర్థం చేసుకోవడం కంటే అసలు సూర్య, సాయిపల్లవి లాంటి యాక్టర్లు ఏమి విని దీనిని ఓకే చేసి వుంటారనేదే ఎక్కువగా తొలిచేస్తుంది 'ఎన్‌జికె' చూస్తున్నంత సేపు. బహుశా సెల్వ రాఘవన్‌ (శ్రీ రాఘవ) ట్రాక్‌ రికార్డ్‌ చూసి సైన్‌ చేసేసి వుండాలి. లేదంటే ఇలాంటి పాయింట్‌లెస్‌ చిత్రంలో, క్యారికేచర్స్‌ని తలపించే క్యారెక్టర్స్‌లో అలాంటి టాలెంటెడ్‌ యాక్టర్లు నటించే అవకాశమే లేదు. పొలిటికల్‌ డ్రామాలు కాసులు కురిపిస్తోన్న ట్రెండ్‌లో సెల్వ రాఘవన్‌ తన ఆలోచనలతో ఒక పొలిటికల్‌ హీరోని వెండితెరపై ఆవిష్కరించాలని భావించినట్టున్నాడు. అయితే ఆ పొలిటికల్‌ హీరోని ఎలా తీర్చిదిద్దాలి? మిగిలిన పొలిటికల్‌ సినిమాల మధ్య దీనిని ప్రత్యేకంగా ఎలా నిలబెట్టాలి? అనే దానిపై పూర్తిగా ఐడియా ఫ్రేమ్‌ అవకముందే చిత్రీకరణ మొదలు పెట్టేసినట్టున్నాడు.

కథ, కథనాలే కాదు... పాత్రలు, వాటి ప్రవర్తనలు ఎలా వుండాలనే దానిపై కనీస అవగాహన లేకుండా తోచింది తీసుకుంటూ పోయిన భావన అడుగడుగునా కలుగుతుంది. ఆరంభంలో కథానాయకుడికి రాజకీయ నాయకుల పలుకుబడి, పవర్‌ ఏమిటో అర్థమయ్యే సన్నివేశాలని చూపిస్తోంటే ఒక రసవత్తరమయిన పొలిటికల్‌ డ్రామాకి తెర లేస్తోందనే భావన కలుగుతుంది. ఒక సాధారణ పార్టీ కార్యకర్తలని నేతలు ఎంత హీనంగా చూస్తారు, వారికి ఎలాంటి పనులు చెబుతారు లాంటివి చూపిస్తోంటే సబ్జెక్ట్‌పై బాగా రీసెర్చ్‌ చేసేసి వచ్చారనే భ్రమ పుడుతుంది. ఆ భ్రమలు, భావనలు పటాపంచలు అయిపోయి ఒక్కసారిగా కథ గందరగోళంగా మారి, కథనం అగమ్యగోచరం అయిపోతుంది.

ప్రశాంత్‌ కిషోర్‌ రేంజ్‌ పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ అన్నట్టు పరిచయం చేసే వనిత (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) క్యారెక్టర్‌ రాకతో డ్రామా చిక్కబడుతుంది అనుకుంటే టోటల్‌ స్టోరీనే చిక్కుబడిపోతుంది. అక్కడి వరకు భర్తని అర్థం చేసుకుని, అతని ఆలోచనలని గౌరవించే అతని భార్య (సాయి పల్లవి) సడన్‌గా అనుమానంతో రగిలిపోతూ సైకో మాదిరిగా రియాక్ట్‌ అవుతుంటుంది. అంతవరకు ఎమ్మెల్యే ఇంట్లో బాత్రూమ్‌లు కడిగి, బట్టలు ఉతికి, వంట చేసిన హీరో సడన్‌గా పొలిటికల్‌గా ఒక హాట్‌ టాపిక్‌ అయిపోతాడు. ఒకవైపు అపోజిషన్‌ స్ట్రాటజిస్ట్‌తో మంతనాలు జరుపుతూ మరోవైపు ఛీఫ్‌ మినిస్టర్‌తోను వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేస్తుంటాడు. అంతవరకు ఎమ్మెల్యే బాత్రూమ్‌ దాటి బయటకే పోయినట్టు కనిపించని వాడు ఒక్కసారిగా ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు అయిపోతాడు. కథనం ఎంత అతుకుల బొంతలా ముందుకి సాగుతుందంటే... కళ్లార్పకుండా తెరకేసే చూస్తున్నా మనకి తెలీకుండానే ఫోన్‌ చూస్తూ ఏదైనా సీన్‌ మిస్‌ అయ్యామా? మధ్యలో కునుకు తీసేసామా? అనే భ్రమలకి గురి చేస్తుంది.

సాధారణంగా ఇంటర్వెల్‌ సీన్‌కి ఎలాంటి చెత్త చిత్రంలో అయినా తదుపరి ఏమి జరుగుతుందనే ఆసక్తి కాస్తయినా బతికే వుంటుంది. కానీ ఎన్‌జికె ఇంటర్వెల్‌ టైమ్‌కే కంప్లీట్‌ హోప్‌లెస్‌ అనిపిస్తుంది. ఆ హోప్‌లెస్‌నెస్‌తో, సెకండ్‌ హాఫ్‌పై మినిమమ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా లేని మైండ్‌సెట్‌తో వెళ్లినా 'ఎన్‌జికె' ఊహించిన దానికంటే ఘోరమైన సన్నివేశాలతో చిత్రవధకి గురి చేస్తుంది. ఎన్‌జికె ఏమి చేసాడని అతను జనాల్లో హీరో అయ్యాడో, ఎందుకని అతడిని అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా కత్తి కట్టాయో, అతడిలో ఏమి చూసి పెళ్లయిన వాడని తెలిసినా కానీ నెలకి కోటీ ఇరవై లక్షలు ఆర్జించే వనిత వెంట పడుతోందో, ఎన్‌జికెని భార్య అకారణంగా ఎందుకని అంతగా అనుమానిస్తోందో ఏదీ అర్థం కాదు. ఇది చూడడానికి వచ్చి తప్పు చేసామంటూ ఫస్ట్‌ హాఫ్‌కే హ్యాండ్సప్‌ అని సరెండర్‌ అయిపోయిన వారిని, అంతా తెలిసీ ఇంటర్వెల్‌ అయ్యాక మళ్లీ లోనికెందుకు వచ్చావ్‌ అన్నట్టుగా తోలు తీసేస్తుంది.

మంచి ట్యూన్‌ ఏది ఇచ్చినా దండగ అయిపోతుందని గ్రహించిన యువన్‌ శంకర్‌ రాజా పాటొచ్చినపుడు ఫోన్‌ చూసుకోవడానికి లేదా పక్కవారితో బాధ చెప్పుకోవడానికి అవకాశమిచ్చేలా బాణీలిచ్చాడు. ఇంత టార్చర్‌ తర్వాత వీళ్లకో బ్రేక్‌ అవసరం అనుకున్నపుడల్లా అవసరం లేని పాటకి స్పేస్‌ ఇచ్చి సెల్వ రాఘవన్‌ కాస్త కనికరం చూపించాడు. సినిమాటోగ్రాఫర్‌ ఈ అర్థం లేని సన్నివేశాలకి ప్రాణం పోసేందుకు శాయశక్తులా కృషి చేసాడు కానీ 'స్వర్ణఖడ్గం' మాత్రం ఎడిటర్‌కి ఇవ్వాల్సిందే. ఇలాంటి కాంటెంట్‌ తెచ్చి చేతిలో పెడితే దానినో దారికి తేవడానికి పడ్డ కష్టమెంతో ఏమిటో?

తన పాత్రకి తగిన ప్రాధాన్యత లేకపోతే సాయి పల్లవి ఏ సినిమా సైన్‌ చేయదనే టాక్‌ వుంది. ఆమె ప్రెజెన్స్‌ని జస్టిఫై చేయడానికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ క్యారెక్టర్‌ని సృష్టించి, ఈ అనుమానపడే సీన్‌లో ఫుల్‌ టాలెంట్‌ చూపించుకోమని చెప్పినట్టున్నారు. భర్త చొక్కాకి సెంటు వాసన చూసి అతనికి మరో స్త్రీ సాంగత్యం వుందని కనిపెట్టే క్యారెక్టర్‌ చేసిన సాయి పల్లవి ఒకసారి ఈ స్క్రిప్టు పేపర్ల వాసన చూసినట్టయితే తనని ఇలాంటి పాత్రలో చూసే యాతన తన అభిమానులకి తప్పించి వుండేది.

సీన్‌లో ఏమీ లేకపోయినా కానీ ఏదైనా చేసి దీనిని నిలబెట్టాలని సూర్య పడ్డ తపనకి నెక్స్‌ట్‌ సినిమాతో అతనికి హిట్‌ వస్తే తలనీలాలు ఇస్తామని మొక్కుకోవాలనిపిస్తుంది. విపరీతమయిన బిల్డప్‌తో ఎంటర్‌ అయ్యే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ క్షణాల్లో కరివేపాకుగా మారిపోవడం బాధిస్తుంది. ప్రతి దానికీ హీరోని తిడుతూ వుండే తల్లి పాత్రలో ప్రేక్షకులు తమని తాము చూసుకుంటూ ఆ డైలాగులన్నీ సెల్వరాఘవన్‌కి చెబుతున్నట్టుగా ఊహించుకున్నట్టయితే కాస్త ఉపశమనం లభిస్తుంది.

సెల్వ రాఘవన్‌ కంఫర్ట్‌ జోన్‌ లవ్‌స్టోరీస్‌ అయినప్పటికీ అడపాదడపా వేరే జోనర్లని కూడా టచ్‌ చేస్తుంటాడు కానీ తన 'టచ్‌' వుండేట్టు చూసుకుంటాడు. పొలిటికల్‌ డ్రామా పరంగా తనకున్న జీరో నాలెడ్జ్‌ డామినేట్‌ చేయడంతో పాటు రియలిస్టిక్‌గా తీయాలా లేక మురుగదాస్‌లా కమర్షియల్‌గా తీయాలా అనే కన్‌ఫ్యూజన్‌ కూడా తోడవడంతో తననుంచి అసలు ఊహించ సాధ్యం కానంత నిరర్ధకమైన చిత్రాన్ని అందించాడు. ఫైనల్‌ కట్‌ అయిన తర్వాత కూడా నటీనటులు దీనికి ప్రచారం చేసారంటే ఖచ్చితంగా వారికి ఫుల్‌ సినిమా చూపించి వుండడని అనుకోవచ్చు. లేదంటే ఎంత సొంత సినిమా అయినా కానీ ఇలాంటి సినిమా చూడమంటూ బద్ధ శత్రువులని కూడా ఎవరూ అడగరు!

బాటమ్‌ లైన్‌: గందరగోళం కృష్ణా!
- గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: ఏబిసిడి    సినిమా రివ్యూ: సీత

Show comments