నెక్ట్స్ ఏంటి?

సుమారు ఏడు దశాబ్దాలుగా... భారతదేశ సార్వభౌమాధికారానికి నిలువెత్తు ప్రశ్నార్థకంగా.. అవమానంగా.. ‘ఒకేదేశం ఒకటే ప్రజ’ అనుకునే భావనకు వెక్కిరింతగా ఉన్నటువంటి 370వ అధికరణం రద్దయిపోయింది. కేవలం అప్పట్లో రాజా హరిసింగ్ ఏలుబడిలో ఉన్న భూభాగం కావడం మినహా జమ్మూ-కాశ్మీర్ ప్రాంతంతో ఎలాంటి సామాజిక సారూప్యత లేని లడాఖ్ సొంత అస్తిత్వాన్ని సంతరించుకుని.. ప్రత్యేకమైన కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. ఇది మామూలు పరిణామం కాదు. గత ఇరవైపాతికేళ్ల భారత చరిత్రను లెక్కలోకి తీసుకున్నా.. ఇంతకు మించిన ఘట్టం మరొకటి లేదు. ఇది నిర్వివాదాంశం.

స్థూలంగా చెప్పాలంటే భాజపాకు తమ పార్టీకంటె కూడా 370 రద్దు అనేది గొప్పది. ఆ పార్టీ పుట్టడానికంటె ముందే, ఆ లక్ష్యం పుట్టింది. ఆ లక్ష్యం కోసం పోరాటంలోనే ఆ పార్టీ పితామహుడు దుర్భరమైన రీతిలో బలిదానం చేశారు. కాబట్టి, శషబిషలు లేకుండా తమ మాట నెగ్గే రాజకీయ బలం సంతరించుకోగానే... మోడీ నేతృత్వంలోని భాజపా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిద్వారా రేగగల సంచలనాలను ఖాతరు చేయకుండా నడవదలచుకున్నది.

40ఏళ్ల వయసున్న పార్టీకి 70 ఏళ్ల వయసున్న లక్ష్యం గనుక దీనిని నెరవేర్చుకున్నారు. ఇంతటితో ఆగుతారా? ఇది చాలా పెద్ద ప్రశ్న. వరుసగా రెండోసారి.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల బలం కూడా అవసరం లేనంత సంపూర్ణమైన మెజారిటీతో గద్దె ఎక్కిన నరేంద్రమోదీ- భాజపా సర్కారు.. ఇంకా ఎలాంటి లక్ష్యాలను తమ అమ్ములపొదిలో దాచుకుని ఉన్నది! ఏ వరుస క్రమంలో వాటిని దేశం మీదికి సంధించబోతున్నది... విశ్లేషించే ప్రయత్నమే ఈ వారం ‘గ్రేట్ ఆంధ్ర’ ప్రత్యేక కథనం.

స్వతంత్ర భారత చరిత్రలో బహుశా కించిత్ సంచలనం కలిగించగలిగిన ఏ రాజకీయ నిర్ణయం కూడా  ఇంత ‘నిశ్శబ్దం’గా జరిగిపోలేదు. దేశాన్ని ప్రభావితం చేయగల ఏ బిల్లు కూడా పార్లమెంటులో వ్యతిరేకత తప్ప, బాహ్య ప్రపంచంలో ఇంత ‘స్మూత్’గా ముగిసిపోలేదు. నరేంద్రమోడీ పాలన చాతుర్యం, అమిత్ షా సాహసం, రెండు సభల్లోను ఒకేరోజు బిల్లు ఆమోదం పొందగలిగేలాగా చాకచక్యంగా నిర్వహించిన వెంకయ్యనాయుడు కౌశలం మాత్రమే ఇందుకు కారణం కాదు. వీటన్నింటినీ మించి.. ఈ అంశాన్ని దేశం కోరుకున్నది. అందువల్లనే ప్రజాభిప్రాయానికి విలువ ఇచ్చి, విపక్షంలోని వారు కూడా దీనికి దన్నుగా నిలిచారు. ఆ రకంగా మోడీ సర్కారు అన్ని రకాలుగానూ సక్సెస్ లనే నమోదు చేస్తోంది. ఇది హటాత్తుగా ఇవాళ వచ్చినది కాదు.

ఆనాటినుంచి అదే వ్యూహం
2014లో మోడీ సర్కారు తొలిసారిగా కేంద్రంలో అధికారం చేపట్టినప్పుడే.. ఇప్పుడిలా.. సంచలన నిర్ణయాలను, సానుకూల వాతావరణంలోనే చక్కబెట్టేయడానికి అవసరమైన వ్యూహాన్ని అమల్లో పెట్టేశారేమో అనిపిస్తోంది. మోడీ ప్రధాని కాగానే.. పార్టీ పరంగా కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వయస్సు మళ్లిన- కీలక నాయకులు ఎవరినీ కేబినెట్ వైపు రానివ్వకుండా పక్కన పెట్టడం అందులో ముఖ్యమైనది. పార్టీకి మూలస్తంభం వంటి లాల్ కృష్ణ అద్వానీని కూడా పక్కన పెట్టడం అప్పట్లో చాలా విమర్శలకు గురైంది. సొంత పార్టీలోనే అద్వానీ భక్తులు కాని వారు అసలంటూ ఉండని రోజులు అవి. అయినాసరే మోడీ అమిత్ షా ద్వయం కఠిన నిర్ణయాలనే తీసుకుంది. అప్పటి కాఠిన్యం.. ఇప్పుడిలా వ్యవహారాలను మృదువుగా చక్కబెట్టడానికేనేమో అనిపిస్తోంది.

సీనియారిటీ ముదిరిపోయిన నాయకులు కీలక పదవుల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. ఏదో ఒక కీలక నిర్ణయం... ఎవరినీ ఖాతరు చేయకుండా తీసుకోవాల్సి వచ్చిన రోజున... దాన్ని ఇష్టపడని ఇతర నాయకులు, అలాంటి సీనియర్లను సంప్రదించే ప్రమాదం ఉంటుంది. అటువైపు నుంచి ‘బార్గెయినింగ్’కు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది. మోడీ తన మాటకు విలువ ఇవ్వకపోయినా సరే, చంద్రబాబు లాంటి వాడు అద్వానీ లాంటి నేతను పట్టుకుని ఒత్తిడి చేయించగల అవకాశం ఉండొచ్చు. అందుకే వ్యూహాత్మకంగా అప్పటినుంచే సీనియర్లను పక్కన పెట్టేశారా అనిపిస్తోంది.

నిర్వచనాలు మార్చేశారు..
ప్రధానంగా ‘ఎంపీ పదవి’ అనే పదానికి ఉండే నిర్వచనాలను మోడీ జమానా మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. మోదీకి ముందు- తర్వాత... ఎంపీల పనితీరు, వ్యవహార సరళి మొత్తం మారిపోయింది. ఇదివరకటి రోజుల్లో ఎంపీలుగా గెలిచిన వారు ఎప్పుడూ తిరిగి ప్రజల వద్దకు రాకుండా... ఢిల్లీలోంచి కదలకుండా కూర్చుని.. ఏదో వ్యాపారాలు చేసుకుంటూ రోజులు వెళ్లబుచ్చేవారు. ప్రజలతో మమేకమై పనిచేయాలనే ఆలోచన కూడా వారిలో ఉండేది కాదు. ఢిల్లీలో ఉంటూ తమ వ్యాపారాలు చక్కబెట్టుకోవడం, పైరవీలు చేసుకోవడం.. మాత్రమే జరిగేది. ఎంపీలంటే.. పార్టీ ముద్రతో గెలిచేవారే తప్ప.. ప్రజల్లోంచి తయారయ్యే వారు కాదనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడంతా మారిపోయింది. ఇప్పుడు ఎంపీలు కూడా వీధివీధికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు పట్టించుకుంటూ ఉండవలసిన పరిస్థితులు వచ్చేశాయి. ఒకప్పట్లో బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు మాత్రమే ఉంటారనుకునే ఈ పదవుల్లో ఇప్పుడు సామాన్య ప్రజల్లోంచి వచ్చిన వారు కూడా నిలుస్తున్నారు.

రాష్ట్రాలకు కత్తెర వేస్తున్నారు...
సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్ ఒక వాదన లేవనెత్తారు. ‘రాష్ట్రంలో ఏం జరుగుతున్నదనే విషయం ఢిల్లీలో కూర్చున్న నీకెందుకు? రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు లాంటి కొన్ని మాత్రం మీరు చూసుకోండి. సంక్షేమంతో ముడిపడ్డ ప్రతిదీ రాష్ట్రాలకు విడిచిపెట్టండి...’ అనేది ఆ వాదన. ఒక రకంగా చెప్పాలంటే.. పౌరసత్వం గొడవ తప్ప.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు జమ్మూకాశ్మీరు తరహా పరిపాలన స్వేచ్ఛను కేసీఆర్ ప్రతిపాదించారు. ఆయన వాదనకు, తలపెట్టిన కూటమికి ఎక్కడా మద్దతు దొరకలేదు.

కానీ మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రాల అధికారాలకు, విశృంఖలతకు మరింతగా కత్తెర వేసే నిర్ణయాలు తీసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాల సొమ్మును ఇన్నాళ్లూ రాష్ట్రప్రభుత్వాల చేతిలోనే పెట్టేస్తుండేది. కానీ ఇప్పుడు నేరుగా కేంద్రంనుంచి లబ్ధిదార్ల అకౌంట్లలోకి వేసేస్తున్నారు. రాష్ట్రాలకు ఇది కంటగింపే. కానీ.. ఒక పథకానికి వచ్చిన నిధులను ఇతర రాష్ట్ర పథకాలకు దారి మళ్లించడం, వాటి వితరణలో భారీ అవినీతికి పాల్పడడం చాలా రాష్ట్రాల్లో రివాజు అయిపోయింది. గత తెదేపా పాలనలో ఉపాధి హామీ పనుల్లో వందల కోట్ల కేంద్ర నిధులను స్వాహా చేసినట్లుగా అనేక విమర్శలు వచ్చిన సంగతి గుర్తుంటుంది. ఇలాంటి విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది. క్రమంగా రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే మరిన్ని నిర్ణయాలు పురుడుపోసుకున్నా ఆశ్చర్యం లేదు.

ఇంకేం చేయదలచుకున్నారు..?
భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి రహస్య ఎజెండాలు లేవు. వారి ఎజెండా స్పష్టం. విపక్షాలే వాటిని రహస్యంగా చూస్తున్నాయి! అవి రహస్యాలనే భ్రమలో ఉన్నాయి. మొత్తానికి మోడీ సర్కారు ముందున్న లక్ష్యాలలో బినామీ నియంత్రణ చట్టం, అవినీతి నిర్మూలన, వ్యవసాయానికి పెద్దపీట, మరిన్ని స్మార్ట్ సిటీలు, పొరుగుదేశాలతో మైత్రి, అందరికీ సమాన విద్యావకాశాలు, మరింత వేగంగా పారిశ్రామికీకరణ వంటి అనేకం అనివార్యంగా ఉంటాయి.

ఇలాంటివి మామూలు అంశాలు కాగా, సంచలనం కలిగించగల అజెండా అంశాలు మరికొన్ని ఉన్నాయి. రామమందిర నిర్మాణం, యూనిఫార్మ్ సివిల్ కోడ్, రిజర్వేషన్లలో క్రీమీ లేయర్, మరిన్ని చిన్న రాష్ట్రాల ఏర్పాటు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ వంటివి ఈ కోవకు చెందుతాయి. వీటిలో ఏయే అంశాలను ఎప్పుడెప్పుడు చేపడతారన్నది ఆసక్తి దాయకం. నా ఉద్దేశంలో ఈ ఎజెండా అంశాలను మోడీ రెండు రకాలుగా విభజించుకుంటారు. ఫేజ్ 1, ఫేజ్ 2 లుగా ఈ అయిదేళ్లలో ఇవన్నీ కూడా పూర్తవుతాయి.

రెండు దశల మధ్య విభజన రేఖ..
కీలకాంశాలను మోడీ చేపట్టడానికి రాబోయే నాలుగున్నరేళ్లలో మధ్యలో ఒక విజభన రేఖ ఉంది. రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి (ఎన్డీయేకు) సంపూర్ణమైన మెజారిటీ రావడం అనేది  ఆ హద్దు రేఖ. ఆ హద్దు దాటేంత వరకు మోడీ సర్కారు పనితీరు ఒక రకంగా ఉంటుంది. ఆ నియంత్రణ రేఖను దాటేసిన తర్వాత.. మోడీ అసలు దూకుడు అంటే ఏమిటో ప్రజలకు అప్పుడు కనిపిస్తుంది. ఒక ఏడాదిలోగా అంటే, 2020లో రాజ్యసభలో కూడా భాజపాకు పూర్తి మెజారిటీ దక్కగల అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి దాకా ప్రభుత్వం కాస్త నెమ్మదిగానే ఉండొచ్చు.

పైన చెప్పుకున్న సంచలనాంశాల్లో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) అనేదానిని ఈ ఏడాదిలోగానే చట్టంగా మార్చడానికి మోడీ సర్కారు ప్రయత్నించవచ్చు. ఇతర మతాల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం గనుక.. 370లోలాగా వీరికి సార్వజనీన మద్దతు దక్కకపోవచ్చు. కొన్ని ఇబ్బందులతోనే ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాగే రామమందిర నిర్మాణం కూడా. ఇప్పటికే దాదాపుగా ఈ వివాదం చివరి అంకానికి చేరుకుంది. ప్రభుత్వం గట్టిగా పట్టుపడితే ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఈ రెండు అంశాలు ‘పూర్తి మెజారిటీ- హద్దురేఖ’కు ముందే సభలో పెట్టినా ఆశ్చర్యం లేదు.

రేఖ దాటిన తర్వాత మాత్రం... దేశంలోని చాలా రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టే అంశాలు చట్టరూపం సంతరించుకోవడానికి సిద్ధం అవుతాయి. రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ కు చాలా వ్యతిరేకత ఎదురవుతుంది. రిజర్వేషన్ ద్వారా సంతులన అభివృద్ధి అనే స్వప్నం సాకారం కావాలంటే.. ఏదో ఒక నాటికి ఇది తప్పనిసరి. కానీ డెభయ్యేళ్ల భారతేశంలో ఆ ‘సంతులన అభివృద్ధి’ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. మోడీ సర్కారు ఆ పర్వం పూర్తి చేస్తుంది. మరిన్ని చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేది మరో కీలకమైనది. భాజపా సిద్ధాంతరీత్యా చిన్న రాష్ట్రాలకు అనుకూలం.

ఆంధ్రప్రదేశ్ తమను ఈసడిస్తుందని తెలిసినా... తెలంగాణకు వారు జైకొట్టింది అందుకే. ఇప్పుడికి జమ్మూకాశ్మీర్ విభజన కూడా పూర్తయింది. ఇక గూర్ఖాలాండ్ ఏర్పాటు కూడా వారి మదిలో మెదలుతుంటుంది. ఇటీవల మమతా బెనర్జీ చెన్నైలో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌కు, తమిళనాడుకు విభజన ముప్పు పొంచి ఉన్నదని వ్యాఖ్యానించడం విశేషం. అలాగే ‘చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్’ను కూడా మోడీ సర్కారు పూర్తి చేస్తుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ బిల్లు సభలో చర్చకు వచ్చిన ప్రతిసారీ.. ఎన్ని పార్టీలు ఎంతగా గోలచేసి.. దీన్ని కార్యరూపం దాల్చకుండా చేస్తున్నాయో అందరికీ తెలుసు. అలాంటి శక్తులకు కళ్లెం వేసి.. దేశంలోని మహిళల కలలు నెరవేర్చగల సత్తా.. ‘హద్దు రేఖ’ దాటిన తర్వాత మోదీ సర్కారుకు దక్కుతుంది.

ప్రస్తుతానికి భిన్నంగానే..
కాశ్మీర్ సంగతి వేరు.. ఈ విషయంలో అసంతృప్తి రేగినా.. ఆ ఒక్క ప్రాంతానికి పరిమితం. అక్కడ బలగాలను ఉంచి, కేంద్ర పాలనలో ఉంచుకుని నిరసనలు రేగకుండా, రేగినా బాహ్య ప్రపంచానికి తెలియకుండా సర్దేస్తున్నారు. కానీ, మిగిలిన ఎజెండా అంశాలు అంత సులువైనవి కాదు. అవి యావత్ దేశంతోనూ ముడిపడినవి. వేర్వేరు పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు, భావజాలాలు ఉంటాయి. ప్రతిఒక్కరూ ప్రతిసారీ మోడీ నిర్ణయానికి జై కొడతారనుకోకూడదు.

ఇలాంటి నేపథ్యంలో నరేంద్రమోదీ సర్కారు రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోదలచుకుంటున్నదో.. వాటన్నింటినీ ఇదే గాటన కట్టేయడం అవివేకం అనిపించుకుంటుంది. కానీ వారు ఇంకా ఏమేం చేయదలచుకుంటున్నారో తెలుసుకోవడం మాత్రం మంచిది. వివాదాలు రేగినా వాటిని అనునయిస్తూ.. అణచివేస్తూ మోడీ సర్కారు నిర్ణయాత్మకంగా సాగుతుందని అనుకోవచ్చు.

నిక్కచ్చిగా... నిర్దయగా..
నరేంద్రమోదీ ప్రభుత్వపు గత అయిదేళ్ల పాలన మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు అయినా ఉండొచ్చు గాక. నోట్లరద్దు వంటి కీలక అంశాల్లో దుడుకుతనం పట్ల అభ్యంతరాలు కూడా ఉండచ్చు గాక. కానీ... ఈ అయిదేళ్లలో అవినీతికి అక్రమాలకు పాల్పడిన దాఖలాలు రచ్చకెక్కలేదు. భాజపాను అడ్డం పెట్టుకుని, కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నదని కొమ్ములు మొలిచినట్లుగా చెలరేగుతూ.. పార్టీ వారు ఎడాపెడా దందాలు చేసిన ఘటనలు కూడా లేవు.

మోదీ సర్కారు ముక్కుసూటిగా నిక్కచ్చిగా వ్యవహరించడం మాత్రమే కాదు, నిర్దయగా కూడా ఉండిపోయిందని తెలియజెప్పే సంఘటన ఒకటుంది. కాఫీడే వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఆయన, ప్రస్తుత భాజపా నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు స్వయానా అల్లుడు. ఆ పరిచయాలతో ఎస్ఎం కృష్ణతో కలిసి గతంలో అమిత్ షాను సంప్రదించారు. తమ సంస్థ ఉన్న ఇబ్బందులను ఏకరవు పెట్టి,‘బయటపడేయాల్సిందిగా’ విన్నవించుకున్నారు. మోడీని కలిసి వేడుకుంటామని అన్నారు.

అయితే అమిత్ షా వారితో సూటిగా ఒకటే మాట చెప్పారు. ‘చట్టపరంగా ఎలా ఉంటే అలా జరుగుతుంది. చట్టానికి భిన్నంగా ఏం చేయడానికీ మోడీ ఒప్పుకోరు. మిమ్మల్ని అనుచితంగా, చట్టం పరిధిని మించి ఎవరైనా ఇబ్బంది పెడుతోంటే చెప్పండి.. ఖచ్చితంగా ఆ విషయంలో మీకు మేం సాయం చేస్తాం’ అన్నారుట. ఇది కర్ణాకర్ణిగా తెలిసొచ్చిన విషయం. మోదీ సర్కారుగా నిక్కచ్చిగా మాత్రమే కాదు. తమ సొంత మనుషుల విషయంలో కూడా ఎంత నిర్దయగా ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనం.

తీర్థం పుచ్చుకుంటే ‘విముక్తి’ రాదు!
రెండోసారి భాజపా సర్కారు వచ్చింది. గత అయిదేళ్లలో తమ తమ ఆస్తులు, వ్యాపారాల మీద ఐటీ, ఈడీ దాడులను ఎదుర్కొని, ఆ నేపథ్యంలో మోడీ సర్కారు మీద నిప్పులు చెరగిన వాళ్లంతా ఇప్పుడు ఆ పంచకు చేరారు. భాజపా తీర్థం పుచ్చుకున్నారు, కుంటున్నారు. అయితే ఇలా భయంతో, దురాశతో, వ్యూహంతో తీర్థం పుచ్చుకున్నంత మాత్రాన... ‘విముక్తి’ వచ్చేస్తుందని అనుకోవడం భ్రమ. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల కీలక నాయకుల్లో ఒకడు సుజనా చౌదరి విషయమే తీసుకుందాం. తనతో పాటూ మరో ముగ్గురిని కూడా పోగేసుకుని ఆయన కమలతీర్థం పుచ్చుకున్నారు.

ఆర్థిక వనరులను భరాయించడంతో సహా... ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని నిలబెట్టే బాధ్యతను తానే తీసుకుంటానని మాట ఇచ్చినట్లుగా ఉన్నారు. అలాంటి కృషిలో తల మునకలై ఉన్నారు. ఆయన పార్టీకి ఇంత చేస్తున్నా.. పార్టీ ఆయన మీద, చట్టాన్ని కాలదన్ని ప్రేమ చూపిస్తుందని అనుకోలేం. ఎందుకంటే.. సుజనాకు అత్యంత సన్నిహితుడైన ఈడీ మాజీ అధికారి గాంధీని కేంద్రం వదలిపెట్టలేదు. ఆయన చేసిన అరాచకాల పట్ల కఠినంగానే స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోవడాన్ని.. మోడీ సర్కారు- పక్కన ఉండి నిర్లిప్తంగా చూస్తున్నదనడానికి మరో నిదర్శనం ఇది.
-కపిలముని
kapilamuni.a@gmail.com

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్