పుట్టా.. అవినీతి చిట్టా

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులంతా ఒక్కొక్కరే రాజీనామా చేస్తున్నా.. చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం ససేమిరా అన్నారు. కావాలంటే నన్ను తొలగించండి కానీ, నాకై నేను రాజీనామా చేయనని మొండికేశారు. దేవ దేవుడి గుడిలో సెంటిమెంట్ ప్రకారం తనంత తాను రాజీనామా చేయడం కుదరదని భీష్మించుకు కూర్చున్నారు.

దేవుడంటే ఎంత భక్తో.. పదవి నుంచి దిగిపోయే రోజుల్లో కూడా స్వామివారి సేవ చేసుకోవాలనుకున్నారో ఏమో అని కొంతమంది సింపతీ చూపించారు. కానీ పుట్టా అవినీతి చిట్టా ఇప్పుడిప్పుడే బైటపడుతోంది. అసలు ఆయన నియామకమే తెలుగుదేశం పార్టీలో చాలామందికి ఇష్టంలేదు. మాజీమంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన వారన్న కారణాలతో పాటు.. భారీగానే పార్టీకి ఆర్థిక లబ్ది చేయడంతో పుట్టాకు ఆ పదవి వరించింది.

పదవిలోకి రాగానే అవినీతి అవతారం ఎత్తారు పుట్టా. కాంట్రాక్ట్ పనులు, ఉద్యోగాల నియామకాల్లో చేతివాటం చూపించారు. తాజాగా స్విమ్స్ ఉద్యోగ నియామకాల్లో ఆయన అక్రమాలపై ఏకంగా ప్రభుత్వానికే ఫిర్యాదు అందింది. స్వయానా టీటీడీ బోర్డ్ ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. అనేది స్వతంత్ర సంస్థే అయినా.. టీటీడీ జోక్యం అనివార్యంగా మారింది. స్విమ్స్ లో జరిగే ఉద్యోగ నియామకాల్లో టీటీడీ చైర్మన్ సహా బోర్డ్ మెంబర్ల మాట కొంతవరకు చెల్లుబాటు అయ్యేది.

అయితే పుట్టా సుధాకర్ యాదవ్.. ఈ మధ్య జరిగిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని చూశారు. గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలకు వ్యతిరేకంగా పనిచేయాలని స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ పై ఒత్తిడి చేశారు. ప్రభుత్వ పెద్దలతో కూడా ఒత్తిడి చేయించారు. దీంతో కొన్నాళ్లు ఇబ్బందిపడ్డ స్విమ్స్ డైరెక్టర్.. ప్రభుత్వం మారిన తర్వాత ధైర్యంగా టీటీడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ జరిపి.. నిజమేనంటూ దేవాదాయ శాఖ అధికారులకు నివేదికనిచ్చారు. ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు.

దీంతో పుట్టావారి నిజస్వరూపం బయటపడింది. ఇన్నాళ్లూ తన పదవికి రాజీనామా చేయకుండా ఎలాగోలా ఈ విషయాన్ని మేనేజ్ చేసుకోవాలని చూశారు పుట్టా. అవకాశం ఉంటే వైసీపీ హయాంలో కూడా కొనసాగేందుకు పథకం రచించారు. కానీ అవేవీ సాధ్యపడకపోవడంతో ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. బోర్డును కూడా భ్రష్టుపట్టిస్తోన్న.. తెలుగుదేశం అక్రమాలన్నీ త్వరలోనే సాక్ష్యాధారాలతో బైటపడబోతున్నాయి.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం