రీ-పోలింగ్‌: టీడీపీకి గుబులెందుకు.?

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాలకు రీ-పోలింగ్‌ జరగనుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇటీవల ఎన్నికల సంఘానికి నియోజకవర్గంలో పోలింగ్‌ సందర్భంగా చోటు చేసుకున్న అవకతవకలపై ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఓ వర్గానికి చెందినవారి ఓట్లు వేయనీయకుండా రాజకీయ ప్రత్యర్థులు కుట్ర పన్నారన్నది చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపణ. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, స్థానిక పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుని, అక్రమాలు నిజమేనని తేల్చి, రీ-పోలింగ్‌కి ఆదేశాలు జారీ చేసింది.

ఇక, రీ-పోలింగ్‌ విషయమై తెలుగుదేశం పార్టీ ఉలిక్కిపడింది. తాము గతంలో రీ-పోలింగ్‌ విషయమై ఫిర్యాదు చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదనీ, ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచిచ్రన సమయంలో ఇప్పుడు తీరిగ్గా వైఎస్సార్సీపీ ఫిర్యాదుపై స్పందించడమేంటని టీడీపీ నేతలు తమదైన స్టయిల్లో కంగారు పడుతున్నారు. 'ఇలాంటి చర్యల వల్లే కేంద్ర ఎన్నికల సంఘంపై అనుమానాలు పెరుగుతున్నాయి..' అంటూ ఏకంగా టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగడం, ఈ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకోవడం, ఈ క్రమంలో ఓసారి ఇప్పటికే రీ-పోలింగ్‌ కొన్ని చోట్ల ఎన్నికల సంఘం నిర్వహించడం తెల్సిన విషయాలే. అయినా, రీ-పోలింగ్‌ జరిగితే తమ జాతకాలు మారిపోతాయనీ.. అందునా ఒక్క నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీ-పోలింగ్‌కే ఏదో జరిగిపోతుందని టీడీపీ కంగారు పడ్తోందంటే.. అక్కడ అక్రమాలు నిజమేనని పరోక్షంగా టీడీపీ ఒప్పుకుంటున్నట్లేనేమో.!

టీడీపీ నేతలు బెదిరించి, ఓ వర్గానికి చెందిన ఓట్లను పడనీయకుండా చేశారని, కేంద్ర ఎన్నికల సంఘం చర్యతో టీడీపీ కంగారు పడ్తోందని వైఎస్సార్సీపీ అంటోంది.