కేసిఆర్ కోసం బాబు అండ్ కో వ్యూహం

23వ తేదీ దగ్గరకు వస్తోంది. ఆంధ్రలో ఫలితాలు ఎలా వుంటాయి అన్నది పక్కన పెడితే కేంద్రంలో పరిస్థితి ఏమిటి? ఎలాగైనా రాహుల్ ను ప్రధానిని చేయాలి. అంతకన్నా కీలకం మోడీని గద్దెదించాలి. ఇదీ చంధ్రబాబు కీలక అజెండా. అంతకన్నా ముందు మరో బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ వుంది. తెలంగాణ సిఎమ్ కేసిఆర్ ను దారిలోకి తెచ్చుకోవాలి. ఇక కేసిఆర్ తో వైరం ఎంతమాత్రం పనికిరాదు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం కోసం బతికే, ఆపార్టీ అండతో బతికే జనాలు చాలామంది కేసిఆర్ ను బాబును కలపాలని తెగ ప్రయత్నించారు. ఆరాటపడ్డారు. బాబుగారు కూడా తాను చేయి కలపాలనుకుంటే కేసిఆర్ ముందుకురాలేదని పదే పదే చెప్పుకుంటే వచ్చారు.

అలాగే బాబుగారి ఆత్మీయ కాలమిస్టులు కూడా కేసిఆర్-బాబు కలిస్తే బాగుంటుందని తాము కలలు కన్నామని పదే పదే కలం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జెండా ఎత్తేసింది. లోకసభ ఎన్నికలకు ఒక్క సీట్లో కూడా పోటీ చేయలేదు. అలాగే జిల్లా పరిషత్, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా డుమ్మాకొట్టేసింది. అంటే ఇంక తెలుగుదేశం పార్టీ మరో నాలుగున్నరేళ్ల తరువాతే తెలంగాణలో ఏ రాజకీయాలు చేయాలన్నా? అప్పటి పరిస్థితి ఏమిటో? ఎవరికి ఎరుక?

మరి ఇలాంటి నేపథ్యంలో పొరపాటునో, గ్రహపాటునో ఆంధ్రలో జగన్ వచ్చేస్తే? ఇటు ఆంధ్రలోనూ తమకు అవకాశం లేక, అటు తెలంగాణలోనూ అవకాశం లేకపోతే ఎలా? పైగా ఆంధ్రలో సంగతి ఏమో కానీ, తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు తెరాసకే వెళ్తాయనే అనుకొవాలి. ఇలాంటి టైమ్ లో తెరాసతో మంచిగా వుండడం అన్నివిధాలా అవసరం. తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కేంద్రంలో అధికారం సాధించాలనుకుంటున్న కాంగ్రెస్ కు కావచ్చు, తెలుగుదేశాన్ని నమ్ముకున్న సామాజిక వర్గానికి కావచ్చు, దాని అనుకూల మీడియాకు కావచ్చు, ఇలా అందరికీ.

అందుకే మోడీకి ఏమాత్రం సీట్లు తగ్గినా, చాన్స్ తగ్గినా, కేసిఆర్ ను ఇటు లాగడం ద్వారా, తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాన్ని తెలుగుదేశం తరపున కొందరు పెద్దలు షురూ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే మోడీ హవా అయిపోయిందనే కథనాలు, తెగ వెలువడ్డాయి. ఇప్పుడు కేసిఆర్ మనసు మార్చగల మహానుభావులు ఎవ్వరు అనే ప్రయత్నంలో పడ్డారు. కేసిఆర్ ను మనవైపు తిప్పుకుంటే ముందు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కన్నా, ఆ పార్టీని నమ్ముకున్న మీడియా, బిజినెస్ వర్గాలు సేఫ్ అవుతాయి.

లేదూ అంటే కాస్త కష్టంగా వుంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే తెలుగుదేశం అధినేత చంధ్రబాబు నాయుడు హుటాహుటిన హేలికాప్టర్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రామోజీ మాత్రమే కేసిఆర్ ను కాస్త అయినా ఒప్పించగలరు అని నమ్మకంతో బాబు వస్తున్నట్లు బోగట్టా. కానీ కేసిఆర్ అంత సులువుగా మనసులో మాట బయటపెట్టే వ్యక్తి కాదు. 23 తరువాతనే ఏ నిర్ణయం అయినా? ఎవరికి ఎడ్జ్ వుంటుంది? వ్యవహారం ఏమిటన్నదే.

ఈ లోపు ఆయనేమీ తొందరపడి మాట ఇచ్చేసేరకం కాదు. కానీ బాబుగారికి మాత్రం ఎలాగైనా మోడీని రాకుండా చేయాలన్నదే తపన. ఆంధ్రలో తను వచ్చినా, కేంద్రంలో మోడీ వస్తే ఇబ్బందే, తను రాకున్నా కేంద్రంలో మోడీ వస్తే మరీ ఇబ్బందే. అందుకే ఈ హడావుడి అంతా.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!