బాబు పాలన అరాచకం.. ఇవిగో సాక్ష్యాలు

చంద్రబాబు పాలన ఎంత రాక్షసంగా సాగిందో.. ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేసిందో.. ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు నెత్తీనోరూ మొత్తుకున్నా.. బాబు తన అనుకూల మీడియా ద్వారా అన్నీ కప్పిపుచ్చుకున్నారు. కానీ ఆ రోజు రానే వచ్చింది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ పెత్తనం పోయి, ఎన్నికల కమిషన్ కు అధికారాలు రావడంతో బాబు తప్పిదాలన్నీ ఒక్కొక్కటే బైటపడుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎస్పీ స్థాయి అధికారులే బదిలీ అయ్యారు. ఎస్సైలు, సీఐలు కూడా తట్టాబుట్టా సర్దుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా వీరు బదిలీ అయ్యేంత తప్పులు చేశారంటే.. ఇక బాబు జమానాలో వీరి ఆగడాలు ఏ రేంజ్ లో ఉండేవో అర్థం చేసుకోవచ్చు.

సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సైతం వేటుపడింది అంటే అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఈ ఐదేళ్లూ చంద్రబాబు ఎంతలా ప్రజల్ని మభ్యపెట్టారో, మాయలు చేశారో అర్థమవుతోంది. బాబు పాలన అరాచకం అని తేలడానికి ఈ నెలరోజుల్లో జరిగిన సంఘటనలే ఉదాహరణ. ఇక సభాపతి వంటి పదవికి తొలిరోజు నుంచే మచ్చతెచ్చిన కోడెల శివప్రసాద్, రాజ్యాంగం పట్ల కనీస మర్యాదలేకుండా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు.

ఓటమి భయంతో పోలింగ్ బూత్ లోకి వెళ్లి కూర్చుని ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేయాలని చూసి, చివరకు తనపై దాడి జరిగిందనే డ్రామాను ఆడి, చొక్కాలేకుండా బయటకు వచ్చి సింపతీ కోసం ట్రైచేసి, మహిళల చీవాట్లు తిన్న ఘనత కోడెలది. పోలింగ్ రోజు టీడీపీ అనుకూల మీడియా కోడెల వంటి మనిషిపై దాడి చేశారంటూ కోడై కూసింది. వాస్తవాలు మరుగున పెట్టి అయ్యగారు చొక్కా చిరిగిన షాట్ ని పదే పదే చూపించి హడావిడి చేసింది.

తీరా పోలింగ్ బూత్ లో కోడెల చేసిన అరాచకం అంతా ఇప్పుడిప్పుడే వీడియోల ద్వారా బైటకొస్తుండే సరికి విస్తుపోవడం జనం వంతు అయింది. ఆరోజు లోపల జరిగిన సంఘటనకు, బైట కోడెల బీద చూపులకు ఎక్కడా పొంతనలేదు. నటనలో ఇంత సిద్ధహస్తుడని తెలిసుంటే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణకు బదులు కోడెలనే పెట్టి తీసి ఉండాల్సింది అంటూ ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.

అధికారాలు ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నెలరోజుల వ్యవధిలోనే బాబు అరాచకాలు అన్నీ ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ ఐదేళ్ల కాలంలో మీడియా చూపించని, అధికారంతో తొక్కిపెట్టిన దారుణాలు ఇంకెన్ని ఉన్నాయో తల్చుకుంటేనే సామాన్యుడి గుండె గుభేలుమంటోంది.

పవన్ పార్టీ అక్కడ ఎవరిని ముంచినట్లు?