బాబు ఒంటరైపోతున్నారా?

తెల్లవారితే పత్రికల ఫస్ట్ పేజీల్లో బాబుగారే కనిపిస్తున్నారు. పత్రికలు తిరగేస్తే బాబుగారి స్టేట్ మెంట్ లు తప్ప మరోటి కనిపించడంలేదు. మరో నాయకుడు ఎవరూ బాబుగారి సాయంగా వస్తున్న దాఖలా కనిపించడం లేదు. 70 ఏళ్ల వయసులో చంద్రబాబే రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నాయకులు అని తెలుగుదేశంలో చెప్పుకునే ప్రతిఒక్కరు ఎన్నికల బరిలో వున్నారు. కొందరు నాయకులు అయితే తమకు, తమ వారసులకు కూడా టికెట్లు ఇప్పించుకున్నారు.

దాంతో తమ కోసమో, తమ వారసుల కోసమో తమ తమ నియోజక వర్గాల్లో ఫైట్ చేస్తూ బిజీగా వుండడం తప్ప, మరో అభ్యర్థి కోసం ప్రచారం చేసేంత వ్యవహారం ఎవరికీ కనిపించడం లేదు. రాష్ట్రం ఈ మూల నుంచి ఆ మూల వరకు చంద్రబాబే తిరగాల్సిన పరిస్థితి వుంది.

బ్యాక్ ఎండ్ లో మాత్రం సుజనాచౌదరి, లోకేష్ నాయుడు పని చేస్తున్నారు. వీళ్లంతా ఎక్కడ ఎవరిని మేనేజ్ చేయాలి? ఎక్కడకు ఎలా డబ్బులు పంపాలి వంటివి చూసుకుంటున్నారు. ప్రచారం బాధ్యతలు మాత్రం పూర్తిగా చంద్రబాబు మీదే వున్నాయి.

వైకాపా అంటే పిల్ల పార్టీ. అందులో అంత అనుభవం పండిన నాయకులు లేరు. అందువల్ల జగన్ ఒక్కడే తిరుగుతున్నాడు అంటే అర్థం వుంది. కానీ తెలుగుదేశం అలాకాదు. అక్కడ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జనాలు చాలామంది వున్నారు. కానీ అందరూ కూడా వారి వారి నియోజకవర్గాలకే పరిమితం అయిపోయినట్లు కనిపిస్తోంది.

ఇక ప్రచారంలో సాధారణంగా కనిపించే సినిమా జనాలు కూడా ఈసారి బాబు కోసం కనిపించే దాఖలాలు వున్నట్లు లేవు. చాలామంది టాలీవుడ్ జనాలు బాబుకు అనుకూలమే కానీ, ప్రచారానికి వచ్చేదిలేనట్లే వుంది. ఇక బాబు బామ్మర్ది బాలయ్య కూడా తన నియోజక వర్గానికి మహా అయితే తన అల్లుళ్ల నియోజక వర్గాలకు వస్తారేమో? అంతకు మించి ఆయన కూడా చేసేదిలేదు.

ఇక చంద్రబాబు కూడా తనవ్యూహం విషయంలో తడబాటు పడుతున్నారు. ఎంతసేపూ తన అనుభవం, తన సమర్థత అనే స్వంతడబ్బానే కొడుతున్నారు. జగన్ చేతిలో రాష్ట్రం పెట్టకూడదని తప్ప, తనచేతిలో అయిదేళ్లు పెడితే సాధించినది ఏమిటో చెప్పడంలేదు. పైగా జగన్ అంటే జనాలు ముచ్చటపడుతున్న సంగతి కనిపిస్తూనే వుంది. అది తెలిసి కూడా చంద్రబాబు దానికి అనుగుణంగా తన విరుగుడు వ్యూహం ఏమీ పన్నడంలేదు. కాస్సేపు జగన్ ను తిట్టడం మినహా మరో కార్యక్రమం తీసుకోవడం లేదు.

చూస్తుంటే ఫలితం తేడావస్తే, తెలుగుదేశం జనాలు అంతాకలిసి బాబుగారిదే బాధ్యత అని ఆయనకే అంటగట్టేలా వున్నారు. గెలిచినా, ఓడినా బాబుదే బాధ్యత అన్నరీతిలో వుంది తెలుగు తమ్ముళ్ల వ్యవహారం.

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?

Show comments