అవకాశవాదులు, స్వార్థపరులు, బలహీనులు!

మొన్న వైఎస్సార్సీపీ నుండి తెలుగుదేశంలోకి పోయిన 23 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలైనా, నేడు తెలుగుదేశం నుండి వైఎస్సార్సీపీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు ఎంపిలైనా కోవర్టులు అనుకోలేము అవకాశవాదులు, స్వార్థపరులు, బలహీనులు అని మాత్రమే అనుకోవాలి! వాళ్ళ పరిస్థితి, సమాజ పరిస్థితి ఆలోచించండి నిజాయితీగా! 1970ల నుండీ రాజకీయాలను గమనిస్తున్న నేను చూసిన విషయాలు, నాకు తట్టిన ఆలోచనలతో నేను ఈ విధంగా అర్ధంచేసుకున్నాను.

తాతలు ఊరి ప్రెసిడెంటులుగా, అక్కా మేనమామలు మండల ప్రెసిడెంటులుగా, సమీప బంధువులు సమితీ ప్రెసిడెంటులుగా, ఎమ్మెల్యేలుగా రాజకీయం చేస్తున్నపుడు దగ్గర్నుండి చూసా. ఊరి కోసం, సమాజం కోసమే కాకుండా పేరు కోసం గౌరవం కోసం రాజకీయం చేశారు. నాకు తెలిసి ఒకరిద్దరు తప్ప అందరూ ఆస్తులను కరగదీసుకున్నారు. ఓట్లు అస్సలు కొనని టైం నుండి ఎంతోకొంత డబ్బు పెట్టాల్సి వచ్చే టైం వరకు ఉండేది 1970ల నుండి 1990ల వరకు.

సారాయి క్యాన్ ఒక వేటనో ఒక బర్రెనో ఇచ్చేవాళ్ళు పోలింగ్ ముందురోజు, లేకపోతే చర్చి గొడో కప్పో కులిపోతున్నదని మా కుర్రోళ్ళు కష్టపడతారు సిమెంటు ఇసుకకు పదివేలివ్వండనే వాళ్ళు. అంతదాకా ఎందుకు 1987లో మా మేనమామ వెల్దుర్తి మండల ప్రెసిడెంటుగా గెలిచినప్పుడు ఆయనకు వచ్చిన చందాలు మూడులక్షలు ఖర్చు రెండున్నర లక్షలు. మిగిలిన యాభైవేలు ఆయనకున్న ఇంతకముందు అప్పు తీర్చుకున్నాడు.

1974లో వరసకు పెదనాన్న అయ్యే వెల్దుర్తి జూలకంటి నాగిరెడ్డి గారు, మామయ్యే కాకిరాల వెన్నా లింగారెడ్డి గార్లు ఏ ఊరికి ప్రచారానికి వచ్చినా భోజనాలు పెట్టీ డీజిల్ ఖర్చులకి అంటూ ఎంతోకొంత మొత్తం వాళ్ళకి చందాలిచ్చేవాల్లే గాని ఓటుకి నోటు అడగకపోవడం ఆనాటి రాజకీయాలు ఉన్నతంగా ఉండటానికి దోహదపడ్డాయి. 2004లో నేను గురజాలలో నిలబడడానికి వైఎస్సార్ గారు అవుద్దని చెప్పిన ఖర్చు కోటి రూపాయలు మాత్రమే. ఎక్పోనెన్షియల్గా పెరిగిన ఖర్చులకి రాజకీయాలు డబ్బున్నొడి ఆట అవ్వడానికి మనమంతా భాద్యులమే కాదా?

పార్టీలు ఫీరాయించడం అవకాశవాదం, అధికారవాంచ, విలువలలేమి, పోరాటలేమే కానీ కోవర్తులు అవ్వడంవల్ల కాదనేది నా వాదన! ఎన్నికల్లో ఈరోజు ఒక్కో ఊరికి పాతిక లక్షలకు తక్కువ కాకుండా 30 కోట్ల పైనే ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి అవుతున్నది, చాలామందికి యిది తలకమించిన భారం. గెలిచి ప్రతిపక్షంలో ఉంటే అధికారపక్షం పగబట్టినట్టు అష్ట దిగ్బధనం చెయ్యడంతో, ఏమాత్రం సంపాదన లేకపోవడమే కాక ప్రజలకు చివరికి తన అనుచరులకు కూడా ఏమీ చెయ్యలేని స్థితిలో దిక్కుడోచక పార్టీలు ఫిరాయిస్తున్నారు.

నేటి ఎమ్మెల్యేలకు పాతకాలపు వాళ్ళలాగా విలువలు, మాట మీద పార్టీ కోసం నిలవటం ప్రజల కోసం బతకడం అన్నది మామూలుగానే తక్కువ. దీనికితోడు విపరీతమైన ఖర్చు వీళ్ళని రాజకీయ నాయకులలాగా కాకుండా వ్యాపారస్థులలాగా చేసి భవిష్యత్తు ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే పరిస్థితి! వ్యవస్థలను పూర్తిగా నాశనం చెయ్యడంతో బాటు దేశ రాజకీయాలను మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను డబ్బుమయం, నేరమయం చేసిన ఘనత మాత్రం తప్పకుండా శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడిదే!

ఇక నేటి రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని తుడిచేయ్యాలని అంతం చేయాలనే అధికార పార్టీల ఆలోచనలు, పెట్టే అలవికాని వత్తిడి! కాంగ్రెస్ పార్టీకి ఇవే ఆలోచనలు 1947 నుండీ ఉంటే అసలు వేరే రాజకీయ పార్టీలు మనగలిగేవా? ఇందిరాగాంధీ 1975 ఎమర్జెన్సీ కాలంలో తప్ప ఎదుటి రాజకీయ పార్టీలను వేధించిన సందర్భాలు తక్కువ. ఇద్దరు చంద్రులు ప్రతిపక్షం లేకుండా చెయ్యాలనే తపనతో అవసరంలేని ఫిరాయింపుల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థనే మంటకలిపారు.

ఇక ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎంపీలు భయపెట్టి వత్తిడి డబ్బిచ్చి కొన్న తమ కొత్తనాయకుడు ఇంద్రుడు చంద్రుడు సీటిచ్చి గెలిపించిన పాతనాయకుడు పరమనికృష్టుడని తిట్టడం ప్రజల్లో ఏహ్యభావన కలుగజేస్తుందనే ఇంగితజ్ఞానం కూడా లేకుండటాన్ని ప్రజలు పోస్టులో ఉత్తరాలు రాసేకాలం నుండి నెట్లో ఇన్స్తంట్ ఈమైల్లు పంపుకున్నట్టు "ఏం చేస్తాం కాలం మారింది" అన్నట్టు అలవాటు పడ్డారు. ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు నచ్చి ప్రజాసేవ చెయ్యడానికి పార్టీలలో చేరేవాల్లు బహు తక్కువ నేడు. అవకాశం, డబ్బు, అధికారమే ఎక్కువమందికి సర్వస్వం!

పార్టీ కోసం ప్రజల కోసం కిందిస్థాయి నుండి రాజకీయాలు ఒక మార్గంగా చేసుకుని సేవచేసిన వాళ్ళు వేరు వీళ్ళు వేరు. వీళ్ళు ఇలా ప్రవర్తించడానికి రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా కారణం! డబ్బుంటేనే సీటు ఎలాంటి చెడ్డ పెరున్నా కూడా అనే రాజకీయ పార్టీలు, డబ్బిస్తెనే ఓటు నువ్వెంత మంచిపనులు చేసినా అనే ప్రజలకు ఇలాంటి వారు తప్ప మంచోళ్లు ఎలా దొరుకుతారు? రాజకీయాలు డబ్బుమయం, నేరమయం అవ్వడానికి ఈ డబ్బుతోబాటు కులం మతం కూడా కారణాలు అవ్వడానికి కారణాలు కనిపెట్టడానికి మనమేమి బ్రెయిన్ సర్జన్స్, రాకెట్ సైంటిస్టులు కావాల్సిన అవసరం లేదు.

సమాజం పురోగమనంలో కాకుండా తిరోగమనంలో పోతుంటే ఆపవలసిన మేధావులు యువత చేష్టలుడిగి చూస్తూ ఏరోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని ఫేస్బుక్లో పోస్టులు చేసుకుంటే ఈ రాజకీయాలు ఎలా బాగుపడతాయి? మరి సమాజపు మైండుసెట్ మారనప్పుడు వైఎస్సార్సీపీ మాత్రం ఏమి చేయగలదు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ అధికార, ఇతర పార్టీల నుండి వచ్చే గట్టి అభ్యర్థులను తీసుకుని వ్యూహాత్మకంగా అధికార పార్టీని నైతికంగా దెబ్బకొట్టడమే కాకుండా గెలుపు గుర్రాలకు సీట్లిచ్చి గెలిపించుకుంటేనే మేలు.

గెలిస్తే వీళ్ళందరూ పార్టీలోనే ఉంటారు ఎందుకంటే వీళ్ళకి అధికారం ముఖ్యం గాని ఇంతకముందు ఏ పార్టీలో ఉన్నామనేది కాదు, ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే వీళ్ళు ఉండరు, కానీ గత పదేళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నోళ్లు కూడా ఉండరు.

సో, ఫైనల్గా 2019 ముందు వైఎస్సార్సీపీలోకి వచ్చేవాళ్ళు కోవర్ట్ ఆపరేషన్ చెయ్యడానికి చంద్రబాబు పంపితే రావడంలేదు, తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసమే! రాజకీయ నాయకులకి సొంత పార్టీ, సొంత నాయకుడు, సొంత ప్రజలు అనేవి కనుమరుగైపోయాయి. రాజకీయాలు వ్యాపారమయి, తమ రాజకీయ భవిష్యత్తు అత్యంత ముఖ్యమైనవిగా మారిపోయాయి!!

-గురవా రెడ్డి, అట్లాంటా

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?